సర్వం జగన్నామం

గ్రామస్థులతో ముఖాముఖి అన్నారు. ఎవరు ఎలా, ఏం మాట్లాడాలో ముందే ‘సిద్ధం’ చేశారు. తర్వాత ‘రాజు’వారు వచ్చారు.

Updated : 29 Mar 2024 07:22 IST

గ్రామస్థులతో చర్చ పేరుతో జగన్‌ భజన
సమావేశం అంతా ఐ ప్యాక్‌ కనుసన్నల్లోనే
సీఎంపై పొగడ్తలతోనే సరిపెట్టారు

ఈనాడు, కర్నూలు: గ్రామస్థులతో ముఖాముఖి అన్నారు. ఎవరు ఎలా, ఏం మాట్లాడాలో ముందే ‘సిద్ధం’ చేశారు. తర్వాత ‘రాజు’వారు వచ్చారు. వెంటనే అక్కడకు వచ్చినవారు భజన మొదలుపెట్టారు. నంద్యాల జిల్లా శిరివెళ్ల మండలం యర్రగుంట్లలో సీఎం జగన్‌ ప్రజలతో ‘ముఖాముఖి’ కాస్తా.. భ‘జన’సభగా మారింది. మాట్లాడినవారంతా జగన్‌పై పొగడ్తలతోనే సరిపెట్టారు. ఎర్రగుంట్లలో గురువారం నిర్వహించిన సమావేశం మొత్తం సీఎంను పొగుడుతూ, ప్రభుత్వ పథకాలతో తమ జీవితాలు పూర్తిగా మారిపోయినట్లు మాట్లాడించారు. ఐప్యాక్‌ సభ్యుల ఆధ్వర్యంలో ముందే పలువురు లబ్ధిదారులకు శిక్షణ ఇచ్చారు. కొందరు మాట్లాడిన తీరు చూస్తే... బట్టీకొట్టి వచ్చినట్లు అర్థమవుతుంది. కార్యక్రమానికి వచ్చేవారిపై కఠిన ఆంక్షలు విధించారు. పాస్‌ ఉన్నవారు తప్ప వేరెవ్వరూ రాకుండా ఏర్పాట్లు చేశారు. పాస్‌లు ఉన్నవారిపైనా సెల్‌ఫోన్లు, పెన్నులు, చేతిరుమాలు, మంచినీటి సీసాలు, పుస్తకాలు తీసుకెళ్లనివ్వకుండా ఆంక్షలు విధించారు.

మీడియా ప్రతినిధులను లోపలికి అనుమతించకుండా కార్యక్రమం గుట్టుగా నిర్వహించారు. ప్రాంగణం మొత్తానికి పరదాలు కట్టేశారు. లోపల ఉన్నవారికి తప్ప బయట ఉన్నవారికి కార్యక్రమం కనిపించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ యర్రగుంట్లలో 1,496 ఇళ్లు ఉండగా అందులో 1,391 ఇళ్ల వారికి ప్రభుత్వం నుంచి లబ్ధి చేకూరిందని చెప్పారు. అన్ని పథకాలద్వారా రూ.48.74 కోట్ల ప్రయోజనం కలిగిందన్నారు. తర్వాత ప్రజలతో సీఎం ముఖాముఖి ప్రారంభమైంది. తన కుమార్తెకు కళ్లు కనిపించవని, పింఛను అందట్లేదని సీఎం సమక్షంలో ఒకరు రోదించగా.. కారణాలు కనుక్కొంటానని సమాధానమిచ్చారు.

అంతా వైకాపా కార్యకర్తలే   

యర్రగుంట్లకు చెందిన పుష్పలత జగన్‌ను పొగడ్తలతో ముంచెత్తారు. సంక్షేమ పథకాలతో లాభం పొందానని, వచ్చే అయిదేళ్లు జగనే సీఎం కావాలని కోరుకోవడంతో పాటు ‘వైనాట్‌ 175’ అన్నారు. గోవిందపల్లెకు చెందిన వైకాపా ఎంపీటీసీ సభ్యురాలు వాణి సాధారణ పౌరురాలిలా మాట్లాడారు. మహిళా సాధికారత జగన్‌తోనే సాధ్యమని, ఈ పాలనలో పేదరికం, అవినీతి తగ్గుతున్నాయని చెప్పారు. ఆళ్లగడ్డకు చెందిన అపర్ణ, ప్రసాద్‌ అనే దివ్యాంగ దంపతులు తమను తాము జగన్‌ అభిమానులుగా పేర్కొంటూ ప్రసంగించారు. తామిద్దరికి నెలకు రూ.6వేల పింఛను అందుతోందని, జగన్‌ చిత్రపటాన్ని గీసి చూపించారు. తర్వాత జగన్‌ డైలాగ్‌లను మిమిక్రీ చేస్తూ వినిపించారు.

రైతుపై వైకాపా నాయకుల దాడి

సీఎంకు వినతిపత్రం ఇచ్చేందుకు వస్తున్న రైతులపై వైకాపా నాయకులు దాడి చేశారు. సభాస్థలికి ఎదురుగా ఉన్న జాతీయరహదారిపైకి ఆళ్లగడ్డ తెదేపా అభ్యర్థి భూమా అఖిలప్రియ వచ్చారు. ఆమె ముఖ్యమంత్రికి రైతు సమస్యలపై వినతిపత్రం ఇవ్వాలని ప్రయత్నించగా, పోలీసులు అడ్డుకున్నారు. తన స్థానంలో యర్రగుంట్ల రైతులు వినతిపత్రం ఇస్తారనడంతో సమ్మతించి అయిదుగురికి అనుమతిచ్చారు. వారు వినతిపత్రం ఇచ్చేందుకు వస్తుండగా వైకాపా నాయకులు అడ్డుకున్నారు. నాయకుల అనుచరులు ఒక రైతుపై దాడి చేశారు. ఆళ్లగడ్డలో బయల్దేరిన జగన్‌.. ఎర్రగుంట్ల, సిరువెళ్ల, దీబగుంట తదితర గ్రామాల్లో ఆగారు. పలు గ్రామాల్లో ఆగి ఆగి ప్రయాణించనున్న నేపథ్యంలో ఆళ్లగడ్డ-నంద్యాల మార్గంలో బస్సులను అనుమతించలేదు. నంద్యాల వెళ్లాల్సిన వాహనాలను దారిమళ్లించారు. దీంతో ఆ మార్గంలో పదేపదే ట్రాఫిక్‌ అవాంతరాలు తలెత్తి మండుటెండలో ప్రజలు ప్రత్యక్ష నరకం అనుభవించారు.

ఎన్నికల కోడ్‌కు పాతరేసి విచ్చలవిడిగా ఖర్చు: నంద్యాల సభకు జనాల్ని తరలించేందుకు కర్నూలు జిల్లాలోని వందల ఆర్టీసీ బస్సులతోపాటు తిరుపతి, చిత్తూరు, అలిపిరి, ప్రొద్దుటూరు, కడప, అనంతపురం తదితర సుదూర ప్రాంతాల్లోని బస్సులనూ తీసుకొచ్చారు. దీంతో రాయలసీమలోని పలు ప్రాంతాలకు చెందిన వేలమంది ప్రయాణికుల బస్టాండ్లలో నిరీక్షిస్తూ నరకం అనుభవించారు. ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో వెచ్చించే ప్రతి పైసాకు లెక్కచూపాలి. ఆ స్పృహ లేకుండా వేల బస్సులను జనాల తరలింపునకు ఉపయోగించారు. అన్నిచోట్లా భారీగా ఫ్లెక్సీలను ఏర్పాటుచేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని