ఎన్నికల వేళ రూ.530 కోట్ల ఎర

కేంద్రం ఇచ్చిన ఆర్థిక సంఘం నిధులనూ ఇతర అవసరాలకు మళ్లించి పట్టణ స్థానిక సంస్థలను తీవ్ర అవస్థలకు గురి చేసిన జగన్‌ సర్కార్‌ ఎన్నికల వేళ సొంత పార్టీకి చెందిన పాలక వర్గాలను బుజ్జగించేందుకు కొత్త ఎత్తుగడ వేసింది.

Updated : 29 Mar 2024 06:11 IST

పట్టణ స్థానిక సంస్థల్లో ఆర్థిక సంఘం పనుల పెండింగ్‌ బిల్లుల చెల్లింపు
పాలకవర్గాల మద్దతు కూడగట్టేలా జగన్‌ ప్రభుత్వం ఎత్తుగడ
కోడ్‌కు ముందే ఉత్తర్వులు.. ఆలస్యంగా వెలుగులోకి

ఈనాడు, అమరావతి: కేంద్రం ఇచ్చిన ఆర్థిక సంఘం నిధులనూ ఇతర అవసరాలకు మళ్లించి పట్టణ స్థానిక సంస్థలను తీవ్ర అవస్థలకు గురి చేసిన జగన్‌ సర్కార్‌ ఎన్నికల వేళ సొంత పార్టీకి చెందిన పాలక వర్గాలను బుజ్జగించేందుకు కొత్త ఎత్తుగడ వేసింది. ఆర్థిక సంఘం నిధులతో గత మూడేళ్లలో చేసిన పనులకు కొన్ని బిల్లులు చెల్లించే ఏర్పాట్లు చేసింది. ఇందుకోసం రూ.530.50 కోట్ల నిధులను ఎన్నికల కోడ్‌ వెలువడే ముందు పట్టణ స్థానిక సంస్థలకు విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన మెమో ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (సీఎఫ్‌ఎంఎస్‌)తో సంబంధం లేకుండా పెండింగ్‌ బిల్లులను పుర కమిషనర్లే చెల్లించేలా ఆదేశాలిచ్చింది. పట్టణ స్థానిక సంస్థల్లో 2020-21, 2021-22, 2022-23లో కేంద్ర ఆర్థిక సంఘం నిధులతో చేసిన పనులకు సంబంధించిన బిల్లులను సీఎఫ్‌ఎంఎస్‌ పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేసినా రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విడుదల చేయకుండా గత మూడేళ్లుగా తీవ్ర ఇబ్బందులకు గురి చేసింది.

ఎన్నికలు నిర్వహించిన 100 పుర, నగరపాలక సంస్థల్లో, నగర పంచాయతీల్లో వైకాపాకి చెందిన వారే మేయర్లుగా, ఛైర్మన్లుగా ఉన్నప్పటికీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. దీంతో ఆర్థిక సంఘం పనులంటేనే టెండర్లు వేయడానికి గుత్తేదారులు భయపడుతున్నారు. కేంద్రం ఇచ్చిన ఆర్థిక సంఘం నిధులను పట్టణ స్థానిక సంస్థల పీడీ ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం జమ చేసి..ఖాతాలను సీఎఫ్‌ఎంఎస్‌ పోర్టల్‌కి అనుసంధానించింది. దీంతో ఈ నిధులతో చేసే పనులకు బిల్లుల చెల్లింపులపై రాష్ట్ర ఆర్థికశాఖ అనుమతి తప్పనిసరి అయింది. పీడీ ఖాతాల్లో నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఇతర అవసరాలకు మళ్లించి అప్పుడప్పుడు బిల్లులు చెల్లించింది. దీంతో వైకాపాకి చెందిన మేయర్లు, పురపాలక ఛైర్మన్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు కొద్దికాలంగా ప్రభుత్వంపై రగిలిపోతున్నారు. పనులు చేయించినా బిల్లులు రావడం లేదని కొందరైతే తమ అసంతృప్తిని బాహాటంగానే వ్యక్తం చేశారు.

పాత పనులే కొత్తగా చూపించి చెల్లింపులు...

ఆర్థిక సంఘం నిధులతో పనులు చేసి సీఎఫ్‌ఎంఎస్‌ పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేసిన బిల్లులను ప్రభుత్వ తాజా ఆదేశాల ప్రకారం పుర కమిషనర్లు మొదట రద్దు చేయాలి. అదే పనుల కోసం పాలకవర్గాలతో మరోసారి తీర్మానం చేయించి బిల్లులు చెల్లించనున్నారు. పాత పనులే మరోసారి కొత్తగా చూపించి బిల్లులు చెల్లిస్తారు. ఇందుకోసం రూ.530.50 కోట్ల 15వ ఆర్థిక సంఘం నిధులను పట్టణ స్థానిక సంస్థల బ్యాంకు ఖాతాలకు జమ చేశారు. పూర్తి చేసిన పనులకే కొత్తగా మరోసారి బిల్లులు తయారు చేసి చెల్లింపులు చేయనున్నారు. ఎన్నికల వేళ బిల్లులు చెల్లించడం ద్వారా పనులు చేయించిన పాలకవర్గ సభ్యులు, వైకాపా అనుకూల గుత్తేదారుల అభిమానాన్ని చూరగొనాలని జగన్‌ సర్కార్‌ ప్రయత్నిస్తోంది. ఇందుకోసం ఎన్నికల కోడ్‌ వెలువడక ముందే ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి ఈనెల 5న పట్టణ స్థానిక సంస్థలకు మెమో జారీ చేశారు.

మరో రూ.1,000 కోట్ల నిధుల మాటేమిటి?

ఆర్థిక సంఘం నిధులతో చేసిన పనులకు సంబంధించిన పెండింగ్‌ బిల్లుల చెల్లింపులకు 2022-23 సంవత్సరానికి కేంద్రం కేటాయించిన రూ.530.50 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. 2020-21, 2021-22 సంవత్సరాలకు కేంద్రం ఇచ్చిన నిధుల సంగతి ఏమిటన్నది పట్టణ స్థానిక సంస్థల నుంచి వ్యక్తమవుతున్న ప్రశ్న. కేంద్రం నిధులు ఇచ్చినప్పుడల్లా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదు. వాటిని ఇతర అవసరాలకు మళ్లించడం ద్వారా బిల్లుల చెల్లింపుల్లో జాప్యమైంది. ఇప్పుడు కూడా రెండేళ్లకు కేంద్రం ఇచ్చిన నిధులు ఊసెత్తకుండా..2022-23లో కేటాయించిన నిధులను పెండింగ్‌ బిల్లులకు వాడుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. ఇవి కాకుండా గుత్తేదారులకు ఇంకా పెండింగ్‌ ఉన్న రూ.1,000 కోట్లను మరచిపోవలసిందేనా? అని పట్టణ స్థానిక సంస్థల పాలకవర్గాలు ప్రశ్నిస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని