పప్పూబెల్లాల్లా ఉన్నత విద్యామండలి నిధులు

విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పేషీ నిర్వహణ, ప్రభుత్వ సలహాదారు (విద్య) సాంబశివారెడ్డి కారు బిల్లు, సచివాలయంలోని ఉన్నత విద్యాశాఖలో పని చేస్తున్న సిబ్బందికి జీతాభత్యాలకు ఉన్నత విద్యామండలి నిధులను పప్పూ బెల్లాల్లా ఖర్చు పెట్టేస్తున్నారు.

Published : 29 Mar 2024 03:43 IST

మంత్రి బొత్స పేషీ జీతభత్యాలకు నెలకు రూ.3 లక్షలు
వైకాపాకు ప్రచారం చేస్తున్న సలహాదారు సాంబశివారెడ్డి కారుకు నెలకు రూ.81 వేలు

ఈనాడు, అమరావతి: విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పేషీ నిర్వహణ, ప్రభుత్వ సలహాదారు (విద్య) సాంబశివారెడ్డి కారు బిల్లు, సచివాలయంలోని ఉన్నత విద్యాశాఖలో పని చేస్తున్న సిబ్బందికి జీతాభత్యాలకు ఉన్నత విద్యామండలి నిధులను పప్పూ బెల్లాల్లా ఖర్చు పెట్టేస్తున్నారు. విద్యార్థుల ప్రయోజనం, విద్యాభివృద్ధి కోసం ఖర్చు చేయాల్సిన నిధులను ఇలా ఏటా రూ.కోటికిపైగా ఇష్టారాజ్యంగా వాడేస్తున్నారు. ఎంతోమంది పేద పిల్లలు తల్లిదండ్రులు కష్టపడి ప్రవేశ పరీక్షల దరఖాస్తు, కౌన్సెలింగ్‌ కోసం చెల్లించిన డబ్బులను విలాసాలకు వ్యయం చేస్తున్నారు. అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గంలో వైకాపా తరఫున ప్రచారం చేస్తున్న ప్రభుత్వ సలహాదారు సాంబశివారెడ్డి ఫిబ్రవరి నెల కారు కిరాయి కింద నిబంధనలకు విరుద్ధంగా ఉన్నత విద్యామండలి నుంచి రూ.81 వేలు తీసుకున్నారు. ఒక్క నెలలో ఆయన 1,635 కిలోమీటర్లు తిరిగారట.. ఎవరికి సలహాలు ఇవ్వడానికి ఇన్ని కిలోమీటర్లు తిరిగారో ఆయనకే తెలియాలి.

మంత్రి పేషీ అడ్డగోలు దోపిడీ..

విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పేషీలో పని చేస్తున్న ఓఎస్‌డీ ఎంఎస్‌ భగవాన్‌కు గౌరవ వేతనం కింద నెలకు రూ.1.40 లక్షలు ఉన్నత విద్యామండలి నుంచే చెల్లిస్తున్నారు. మంత్రి పేషీలో స్టేషనరీ కొనుగోలు కోసమంటూ ప్రతి నెలా రూ.75 వేలకు బిల్లులు పెట్టి తీసుకుంటున్నారు. దీంట్లో చాలా వరకు దొంగ బిల్లులనే ఆరోపణలున్నాయి. ఇలా దొంగ బిల్లులతో ప్రతి నెలా విద్యాశాఖలోని అన్ని విభాగాల నుంచి భారీగా పేషీకి దండుకుంటున్నట్లు విమర్శలున్నాయి.

  • పేషీ కారు ఖర్చు రూ.95 వేలట. ఓఎస్డీ కార్యాలయానికి వచ్చి కూర్చోవడం తప్ప బయట తిరిగే పనే ఉండదు. అయినా కారు బిల్లులు రూ.95 వేలు ప్రతి నెలా పెడుతున్నారు. మంత్రి పేషీ పేరుతో ప్రతి నెలా రూ.3 లక్షలకుపైగా ఉన్నత విద్యామండలి చెల్లిస్తోంది.
  • సచివాలయంలోని ఉన్నత విద్యాశాఖలో పనిచేస్తున్నవారికి పొరుగుసేవలు లేదా ఒప్పంద ఉద్యోగుల కింద ప్రభుత్వమే జీతం చెల్లించాలి. ఆర్థిక శాఖ అనుమతి లేకుండా ఉన్నతాధికారి ఇష్టారాజ్యంగా నియమించుకుంటూ ఉన్నత విద్యామండలి నుంచి జీతాలు ఇప్పిస్తున్నారు. మధ్యస్థాయి కన్సల్టెంట్‌ జీతం కింద ప్రతి నెలా రూ.1.25 లక్షలు, మరో కన్సల్టెంట్‌కు నెలకు రూ.25 వేల జీతాన్ని మండలే భరిస్తోంది. సచివాలయంలో పని చేస్తున్న ఇద్దరు అధికారులకు కారు బిల్లులు చెల్లిస్తోంది. గతంలో పురపాలక శాఖలో పదవీవిరమణ పొంది, ప్రస్తుతం ఉన్నత విద్యాశాఖలో పని చేస్తున్న సకలారెడ్డికి కారు భత్యం కింద ప్రతి నెలా రూ.35 వేలు చెల్లిస్తోంది.
  • ఉన్నతాధికారి ఇంట్లో పనిచేసే ముగ్గురు సిబ్బందికి కృష్ణా, జేఎన్‌టీయూ, కాకినాడ విశ్వవిద్యాలయాల నుంచి వేతనాలు చెల్లిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. సచివాలయంలో నియమించిన డేటా ఎంట్రీ ఆపరేటర్‌, ఆఫీస్‌ సబార్డినేట్లకు నెలకు రూ.52 వేల జీతాన్ని సైతం ఉన్నత విద్యామండలే భరిస్తోంది. వాస్తవంగా ఈ ఖర్చులన్నీ రాష్ట్ర ప్రభుత్వమే పెట్టాలి.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు