నారాయణ ఎడ్యుకేషనల్‌ సొసైటీ బ్యాంకు ఖాతాల స్తంభన

నారాయణ ఎడ్యుకేషనల్‌ సొసైటీ బ్యాంకు ఖాతాలను పోలీసులు ఫ్రీజ్‌ చేశారు. నెల్లూరు పోలీసులు లేఖ రాయడంతో.. హైదరాబాద్‌లోని హిమాయత్‌నగర్‌, ఖైరతాబాద్‌ శాఖల్లో ఉన్న నాలుగు ఖాతాలను స్తంభింపజేసినట్లు తెలిసింది.

Published : 29 Mar 2024 09:05 IST

ఐసీఐసీఐ బ్యాంకు అధికారులకు లేఖ రాసిన పోలీసులు

ఈనాడు, నెల్లూరు: నారాయణ ఎడ్యుకేషనల్‌ సొసైటీ బ్యాంకు ఖాతాలను పోలీసులు ఫ్రీజ్‌ చేశారు. నెల్లూరు పోలీసులు లేఖ రాయడంతో.. హైదరాబాద్‌లోని హిమాయత్‌నగర్‌, ఖైరతాబాద్‌ శాఖల్లో ఉన్న నాలుగు ఖాతాలను స్తంభింపజేసినట్లు తెలిసింది. మార్చి 4న నెల్లూరు నగర తెదేపా అభ్యర్థి నారాయణ అనుచరుల ఇళ్లలో పోలీసులు సోదాలు నిర్వహించారు. వారినుంచి రూ.1.81 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. నారాయణ విద్యాసంస్థల డైరెక్టర్‌ పునీత్‌పై కేసు నమోదుచేసినట్లు ఎస్పీ తిరుమలేశ్వరరెడ్డి విలేకర్లకు తెలిపారు. నారాయణ ఎడ్యుకేషనల్‌ సొసైటీకి అనుబంధంగా ఉన్న ఎన్‌స్పిరా సంస్థ.. 2015 నుంచి పొరుగుసేవలు అందిస్తోందని, ఆ సంస్థకు నారాయణ అల్లుడు పునీత్‌ కొత్తపా డైరెక్టర్‌గా ఉండగా, నారాయణ సంస్థకూ ఆయనే డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారని తెలిపారు. నారాయణ విద్యాసంస్థలతో ఎన్‌స్పిరా చేసుకున్న ఒప్పందం ప్రకారం రూ.20.63 కోట్లతో 92 వాహనాలు కొన్నారని, ఇన్వాయిస్‌ నారాయణ ఎడ్యుకేషనల్‌ సొసైటీ పేరుతో తీసుకోవడంతో పాటు, ఆ సంస్థ పేరుతో రిజిస్ట్రేషన్‌ చేయించడంలో అవకతవకలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. దీనిపై జిల్లా రవాణాశాఖ అధికారి చందర్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి విచారణ చేస్తున్నారు. అదేరోజు 9ఖాతాలను స్తంభింపజేయగా కోర్టుకెళ్లి స్టే ఆర్డరు తెచ్చుకున్నారు. తాజాగా నారాయణ ఎడ్యుకేషనల్‌ సొసైటీకి సంబంధించిన మరో నాలుగు ఖాతాలను నిలుపుదల చేయాలని బ్యాంకు అధికారులకు నెల్లూరు పోలీసులు లేఖ రాయడంతో ఫ్రీజ్‌ చేశారు. దీనిపై నగర డీఎస్పీ శ్రీనివాస్‌రెడ్డిని అడగ్గా.. కేసు దర్యాప్తులో భాగంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. నారాయణ అభిమానులు, అనుచరులు మాత్రం ఏపీ ప్రభుత్వం ఇంకా నారాయణపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని