అచ్చెన్నాయుడికి హైకోర్టులో ఊరట

స్కిల్‌ కేసులో రాష్ట్ర తెదేపా అధ్యక్షుడు అచ్చెన్నాయుడికి హైకోర్టులో ఊరట లభించింది. ఆయనపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని సీఐడీని న్యాయస్థానం ఆదేశించింది.

Published : 29 Mar 2024 03:45 IST

తొందరపాటు చర్యలు వద్దని సీఐడీకి ఆదేశం

ఈనాడు, అమరావతి: స్కిల్‌ కేసులో రాష్ట్ర తెదేపా అధ్యక్షుడు అచ్చెన్నాయుడికి హైకోర్టులో ఊరట లభించింది. ఆయనపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని సీఐడీని న్యాయస్థానం ఆదేశించింది. ముందస్తు బెయిలు పిటిషన్‌పై విచారణను ఏప్రిల్‌ 2కు వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ టి.మల్లికార్జునరావు గురువారం ఈమేరకు మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. నైపుణ్యాభివృద్ధి సంస్థ నిధుల దుర్వినియోగం ఆరోపణలతో ఏపీ సీఐడీ 2021 డిసెంబరు 9న నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిలు మంజూరు చేయాలని కోరుతూ అచ్చెన్నాయుడు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. విచారణలో సీఐడీ ప్రత్యేక పీపీ వైఎన్‌ వివేకానంద వాదనలు వినిపిస్తూ.. అదనపు దస్త్రాలు కోర్టులో దాఖలు చేసేందుకు కొంత సమయం ఇవ్వాలని కోరారు. సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా స్పందిస్తూ.. పిటిషనర్‌ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు.. అరెస్టు గురించి ఆందోళన ఉందన్నారు. రక్షణ కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులివ్వాలని కోరారు. ఈ వివరాలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి.. పిటిషనర్‌ విషయంలో అరెస్టుతోపాటు ఇతర తొందరపాటు చర్యలేవి తీసుకోవద్దని సీఐడీని ఆదేశించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని