హమ్మయ్య.. జగన్‌ పర్యటనల నుంచి అవస్థలు తప్పాయి

ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండడంతో ముఖ్యమంత్రి జగన్‌ పర్యటనలు, సభల నుంచి ప్రజలకు అవస్థలు తప్పాయి. గడిచిన నాలుగున్నరేళ్లలో ఆయన ఉమ్మడి కర్నూలు జిల్లాకు వచ్చిన ప్రతిసారీ భద్రత పేరుతో దుకాణాలు మూయించి, వాటికి అడ్డంగా బారికేడ్లు పెట్టేవారు.

Published : 29 Mar 2024 09:04 IST

కోడ్‌ కారణంగా యథావిధిగా దుకాణాలు, రాకపోకలు

కర్నూలు నేరవిభాగం, న్యూస్‌టుడే: ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండడంతో ముఖ్యమంత్రి జగన్‌ పర్యటనలు, సభల నుంచి ప్రజలకు అవస్థలు తప్పాయి. గడిచిన నాలుగున్నరేళ్లలో ఆయన ఉమ్మడి కర్నూలు జిల్లాకు వచ్చిన ప్రతిసారీ భద్రత పేరుతో దుకాణాలు మూయించి, వాటికి అడ్డంగా బారికేడ్లు పెట్టేవారు. గతంలో కర్నూలులో కృష్ణానగర్‌కు సీఎం వచ్చిన సందర్భంలో వ్యాపారులకు రెండు రోజులపాటు నష్టం వాటిల్లింది. ఎన్నో ఏళ్లుగా చల్లటి గాలి, నీడ ఇచ్చిన పచ్చటి చెట్లను నరికివేయించారు. ప్రధాన రహదారులపై రాకపోకలు సాగించకుండా ప్రజలను ఇబ్బంది పెట్టారు. ముఖ్యమంత్రి సభలో నిరసన తెలుపుతారన్న ఉద్దేశంతో పదుల సంఖ్యలో ప్రతిపక్ష, ప్రజాసంఘాల నాయకులకు హెచ్చరికల నోటీసులు జారీ చేసి ముందస్తు అరెస్టు చేసి పోలీసుస్టేషన్లలో నిర్బంధించారు. చివరకు కర్నూలులో ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి మనవడి వివాహ వేడుక కార్యక్రమానికి జగన్‌ వచ్చిన సందర్భంలోనూ ఇదే జరిగింది. ఆయా సమయాల్లో అధికారులు, పోలీసుల హంగామా అంతా ఇంతా కాదు. ముఖ్యమంత్రి వస్తున్నారంటే వద్దు బాబోయ్‌ అనే పరిస్థితి జిల్లాలో ఉండేది. ఇప్పుడు ఉమ్మడి జిల్లాలో సీఎం పర్యటనలున్నా.. ఎన్నికల కోడ్‌ కారణంగా దుకాణాలు మూయించటం, చెట్లు నరికేయడం, రహదారులను దిగ్బంధించడం, ముందస్తు అరెస్టులు చేయటం వంటి చర్యల నుంచి ఊరట లభించడంతో ప్రజలు, వ్యాపారులు ఊపిరి పీల్చుకుంటున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని