అంత తొందరెందుకు?

శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో 21 మంది సహాయ ఆచార్యులకు ఉన్నతి కల్పిస్తూ అధికారులు తీసుకున్న నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Updated : 29 Mar 2024 06:28 IST

ఎస్కేయూలో వివాదాస్పదంగా సహాయ ఆచార్యులకు అందలం

అనంతపురం(ఎస్కేయూ), న్యూస్‌టుడే: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో 21 మంది సహాయ ఆచార్యులకు ఉన్నతి కల్పిస్తూ అధికారులు తీసుకున్న నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వీరి నియామకం విషయంలో న్యాయస్థానంలో వివాదం నడుస్తోంది. అవేవీ పట్టించుకోకుండా వారిని 11వ స్థాయి (లెవెల్‌) నుంచి 12వ స్థాయికి పెంచారు. నూతన హోదా ప్రకారం వేతనాలు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 16న ఎన్నికల నియమావళి అమల్లోకి రాగా, అదే రోజు సాయంత్రం హడావుడిగా ఈ ఉత్తర్వులు జారీ చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. దస్త్రాల్లో మాత్రం 14న జారీ చేసినట్లు పేర్కొన్నారని పలువురు ఆరోపిస్తున్నారు. 14న వర్సిటీ ఉన్నతాధికారులు రాజధానిలో ఉన్నారని, పాత తేదీతో ఉత్తర్వులు విడుదల చేసినట్లు చెబుతున్నారు. మార్చి 2న నిర్వహించిన ఎస్కేయూ పాలకమండలి సమావేశంలో సహాయ ఆచార్యుల పదోన్నతులను ఆమోదించారు. అప్పుడ[ు తీర్మానం చేసినా, ఎన్నికల వేళ తీసుకున్న నిర్ణయంపై దుమారం రేగుతోంది. 2009లో కుసుమ కుమారి ఉపకులపతిగా ఉన్న సమయంలో వీరిని నియమించారు. రోస్టర్‌ పాటించకుండా నియామకాలు చేపట్టారని, గవర్నర్‌ నామినీ లేకుండానే మౌఖిక పరీక్షలు నిర్వహించారని న్యాయస్థానంలో వ్యాజ్యం దాఖలైంది. ఉద్యోగాలు పొందిన వారూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. మధ్యంతర ఉత్తర్వులతో వారు ఉద్యోగాల్లో కొనసాగుతున్నారు. 21 మందిలో రంగస్వామి అనే ఉద్యోగి మృతి చెందగా, శ్రీకాంత్‌ అనే సహాయాచార్యుడు రాజీనామా చేశారు. మరో ఇద్దరు డిగ్రీ కళాశాలల అధ్యాపకులుగా వెళ్లారు. మరొకరు విధుల్లోనే చేరలేదు. మిగిలిన 16 మందికి స్థాయి, వేతనం పెంచుతూ తాజాగా ఉత్తర్వులు ఇచ్చారు. న్యాయస్థానం తదుపరి తీర్పు మేరకే వారిని కొనసాగించాలని ఆదేశాలున్నా.. తాజా నిర్ణయం వివాదాస్పదమవుతోంది. వీసీని వివరణ కోరగా 14వ తేదీనే ఉత్తర్వులు జారీ చేసినట్లు వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని