వైకాపా రాక్షస పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడుకుందాం

పోర్టు ద్వారా గంజాయి వ్యాపారం చేసేందుకే విశాఖను రాజధానిగా చేస్తామంటున్నారు. అందుకే 25 వేల కేజీల మాదక ద్రవ్యాలను అక్కడ దించారు.

Updated : 29 Mar 2024 06:16 IST

‘నిజం గెలవాలి’ యాత్రలో నారా భువనేశ్వరి

ఈనాడు, న్యూస్‌టుడే, యంత్రాంగం: ‘పోర్టు ద్వారా గంజాయి వ్యాపారం చేసేందుకే విశాఖను రాజధానిగా చేస్తామంటున్నారు. అందుకే 25 వేల కేజీల మాదక ద్రవ్యాలను అక్కడ దించారు. వైకాపా ప్రభుత్వం విశాఖను గంజాయి రాజధానిగా చేసింది. గత అయిదేళ్లలో అత్యాచారాలు, అరాచకాలకు రాష్ట్రం అడ్డాగా మారింది. వైకాపా రాక్షస పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడుకుందాం. చంద్రబాబును అక్రమ అరెస్టు చేస్తే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారంతా 53 రోజుల పాటు పోరాటం చేశారు. ఆయన అవినీతికి పాల్పడ్డారంటే నమ్ముతారా’ అని తెదేపా అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ప్రశ్నించారు. ఏలూరు జిల్లాలో మూడో రోజు గురువారం ఆమె ‘నిజం గెలవాలి’ యాత్ర చేశారు. ఆగిరిపల్లి, నూజివీడు మండలాల్లో పర్యటించి.. చంద్రబాబు అక్రమ అరెస్టు సమాచారంతో ఆవేదనకు గురై మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆగిరిపల్లి మండలం తోటపల్లిలో బెజవాడ రామారావు, ఆగిరిపల్లిలో కల్వకొల్లు శ్రీరాములమ్మ, పలగాని చంద్రయ్య, నూజివీడు మండలం గొల్లపల్లిలో వెనిగళ్ల పూర్ణచంద్రయ్య కుటుంబసభ్యులను కలిసి ధైర్యం చెప్పారు. వారికి చంద్రబాబు ఇచ్చిన భరోసా పత్రాన్ని అందజేశారు. భారీగా తరలివచ్చిన ప్రజలను ఉద్దేశించి తోటపల్లి, ఆగిరిపల్లి, గొల్లపల్లిలో భువనేశ్వరి ప్రసంగించారు.

భువనేశ్వరి గురువారం కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం అంగలూరు, పోలిమెట్ల, గుడివాడ మండలం మోటూరులోనూ పర్యటించారు. చంద్రబాబు అక్రమ అరెస్టు సమయంలో హఠాన్మరణం చెందిన చేబ్రోలు కోటేశ్వరరావు (అంగలూరు), అట్లూరి సంజీవరావు(పోలిమెట్ల), శ్రీనివాసరావు(మోటూరు) కుటుంబాలను ఆమె పరామర్శించి భరోసా పత్రాలను అందజేశారు. ఎన్టీఆర్‌ను ముఖ్యమంత్రిగా చేసిన నియోజకవర్గం గుడివాడ అని.. ఎన్టీఆర్‌ కుటుంబం గుడివాడను ఎన్నడూ మరువదన్నారు.

అడుగడుగునా నిఘా!

భువనేశ్వరి పర్యటనపై పోలీసులు, ఎన్నికల పర్యవేక్షణాధికారులూ అడుగడుగునా నిఘా పెట్టారు. నూజివీడు మండలంలోని గొల్లపల్లిలో పర్యటించిన ఆమె కార్యక్రమం మొత్తాన్ని వీడియో తీయించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని