కరవును కళ్లారా చూడు జగనన్నా

‘ఏడాది ఓపిక పట్టండి. సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తాం. వలసల నివారణకు శాశ్వత పరిష్కారం చూపిస్తాం.

Updated : 29 Mar 2024 06:52 IST

జిల్లాలో ఊళ్లకు ఊళ్లే ఖాళీ 
నేడు కర్నూలు జిల్లాలో సీఎం జగన్‌ బస్సు యాత్ర

ఈనాడు, అమరావతి, కర్నూలు న్యూస్‌టుడే యంత్రాంగం: ‘ఏడాది ఓపిక పట్టండి. సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తాం. వలసల నివారణకు శాశ్వత పరిష్కారం చూపిస్తాం. ఇక్కడే ఉపాధి కల్పిస్తాం’ అని పాదయాత్రలో కరవు ప్రాంతమైన కర్నూలు జిల్లా ప్రజలకు జగన్‌ చెప్పిన మాటలు ఇవి. 2019 ఎన్నికల ప్రచారంలోనూ అవే మాటలు ఊదరగొట్టారు. ఆయన ముఖ్యమంత్రి అయి అయిదేళ్లయినా.. ఇప్పటికీ అక్కడ ప్రాజెక్టులు పూర్తి కాలేదు. వలసలు ఆగలేదు. ఇన్నాళ్లు అధికారంలో ఉండి ఏమీ చేయని జగనన్న ఇప్పుడు ఎన్నికల వేళ బస్సు యాత్ర అంటూ ఆ ప్రాంతానికి వెళ్తున్నారు. కాస్త బస్సు దిగి ఊళ్లలోకి వెళ్లి చూస్తే.. వరుసగా రెండు సీజన్లలో పంటలుపోయి నష్టపోయిన రైతన్నల అప్పుల గోడు, కరవు కోరలు చాచడంతో ఉపాధి లేక ఊళ్లకు ఊళ్లే ఖాళీ అయిన దీనావస్థలు, అన్నదాతలు వలసకూలీలుగా మారి ఊరొదిలిన వాస్తవాలు, తాగునీటి కోసం కిలోమీటర్లకు కిలోమీటర్లు వెళుతున్న అక్కచెల్లెమ్మల దుర్భర పరిస్థితి, చిల్లిగవ్వ సాయమందించని కారణంగా ఖాయిలా పడ్డ స్పిన్నింగ్‌, వంటనూనెల మిల్లులు ఆయన కళ్లకు కనిపిస్తాయి. ఈ ప్రాంతంలో పల్లె కన్నీటిని తుడిచే ప్రయత్నం సీఎం ఎలాగో చేయలేదు. మరీ.. జిల్లాలో ఏడుకు ఏడింటా వైకాపా ఎమ్మెల్యేలే ఉన్నారు. ఇందులో ఆరు నియోజకవర్గాల్లో వలసలున్నాయి. అయినా ఏ ఎమ్మెల్యే ఈ సమస్యపై అసెంబ్లీలో ప్రస్తావించిందీ లేదు, నిధులు తెచ్చి పనులు చేసిందీ లేదు. ఎన్నికల ప్రచారానికి మాత్రం చుట్టూ మందీ మార్బలంతో ఇక్కడికి వస్తున్న జగన్‌ బస్సు దిగి జనం కష్టాలు వింటారా? లేదా.. అన్నీ చేసేశాం.. అంతా బాగుంది అని చెప్పి వెళ్లిపోతారో చూడాలి మరీ.

నేతన్నపైనా కక్షే?

‘నేతన్నను అన్ని విధాలుగా ఆదుకుంటాం.. ప్రతి ఒక్కరికీ నేతన్న నేస్తం, మగ్గాలకు షెడ్లు వేయిస్తాం. వడ్డీలేని రుణాలిస్తాం’అంటూ అనేక హామీలను గుప్పించి జగన్‌.. అధికారంలోకి వచ్చాక వారిపైనే కక్ష గట్టారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా 25 వేల మందికి ఉపాధి కల్పించేలా 2015 మే 2న బనవాసి వద్ద అప్పటి సీఎం చంద్రబాబు 91.31 ఎకరాల్లో టెక్స్‌టైల్‌ పార్కు ఏర్పాటు కోసం శంకుస్థాపన చేశారు. అక్కడ రూ.44 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు 8 కంపెనీలు ముందుకొచ్చాయి. కానీ జగన్‌ సర్కారొచ్చాక ఆ పార్కును రద్దు చేసింది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 17 వేల మంది చేనేత కార్మికులుంటే, ఈ ప్రాంతంలోనే 10 వేల మందివరకు ఉన్నారు. కానీ.. జిల్లాలో 2023లో నేతన్న నేస్తం పథకం కింద 4 వేల మందిని మాత్రమే ఎంపిక చేశారు. అంతే ఇక మగ్గాలకు షెడ్లు లేవు, వడ్డీలేని రుణాలూ లేవు.

‘ఆడా’తో అభివృద్ధి ఏదీ?

ఆదోని ప్రాంతీయ అభివృద్ధి యాజమాన్య సంస్థ(ఆడా)ను 2022 జనవరిలో ప్రారంభించినా.. దాంతో పైసా పని చేసింది లేదు. మరోవైపు ఈ ప్రాంతంలో దాదాపు 5 వేల మందికి ఉపాధిని కల్పిస్తున్న స్పిన్నింగ్‌ మిల్లులు, వంటనూనె తదితర కర్మాగారాలకు ప్రోత్సాహకాలు ఇవ్వకుండా వాటిని ఖాయిలా పడే దశకు చేర్చారు. అవి ఒక్కొక్కటిగా మూతపడుతుండడంతో కార్మికులు పొట్ట చేతపట్టుకుని పొరుగు రాష్ట్రాలకు వలసపోతున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 5-6వేల హెక్టార్లలో టమాటా సాగవుతోంది. వాటిని కిలో రూపాయి, అర్ధ రూపాయికే అమ్ముకోవాల్సిన దుస్థితితో రైతన్న నష్టపోతూనే ఉన్నారు. ఈ సమస్య పరిష్కారానికి రూ.10 కోట్లతో పత్తికొండలో టమాటా ప్రాసెసింగ్‌, జ్యూస్‌ ఫ్యాక్టరీ యూనిట్‌ను రెండు నెలల్లోనే శంకుస్థాపన చేస్తానంటూ గతేడాది జగనే స్వయంగా చెప్పారు. ఇప్పుడు కోడ్‌కు కొద్దిరోజుల ముందు హడావుడిగా భూమి పూజ చేసి మమ అనిపించగా.. ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి.

కరవు కాటకం..

జిల్లాలో కరవు కమ్మేయడంతో ఖరీఫ్‌, రబీ రెండు సీజన్లలోనూ పంటలన్నీ దెబ్బతిన్నాయి. ఖరీఫ్‌ సీజన్లో 2,38,230.92 హెక్టార్లలో వ్యవసాయ పంటలు దెబ్బతిని, రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయారు. పరిహారం పేరుతో ముఖ్యమంత్రి బటన్‌ నొక్కినా ఆ డబ్బు రైతుకు అందని పరిస్థితి.

ఏడింటిలో 6 నియోజకవర్గాల్లో వలసలే

కర్నూలు జిల్లాలోని మంత్రాలయం, ఆదోని, పత్తికొండ, ఎమ్మిగనూరు, కోడుమూరు, ఆలూరు నియోజకవర్గాల్లో కొన్ని చోట్ల ఊళ్లకు ఊళ్లే ఖాళీ అవుతున్నాయి. ఒక్క మంత్రాలయం నియోజకవర్గం నుంచే సుమారు 75 వేల మంది వలసబాట పట్టిన దురవస్థ నెలకొంది.

పడకేసిన ప్రాజెక్టులు..

కర్నూలు జిల్లాకు గుండెలాంటి గుండ్రేవుల రిజర్వాయరుకు, మంత్రాలయం, ఎమ్మిగనూరు నియోజకవర్గాల పరిధిలోని ఆర్డీఎస్‌ కాలువ నిర్మాణానికి తెదేపా ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తే జగన్‌ ప్రభుత్వం విడుదల చేయలేదు. వేదవతి, నగరడోణ పనులు ఒక్క అడుగూ ముందుకు పడలేదు.

ఒక్క పైసా కేటాయించ లేదు..

జిల్లాలో 2023-24 సంవత్సరానికి సంబంధించి 169 గ్రామాల్లో తాగునీటి ఎద్దడి నివారణకు డ్రాట్‌ కంటింజెంట్‌ యాక్షన్‌ ప్లాన్‌ కింద రూ.14.98 కోట్లు అవసరమని ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు గత డిసెంబరులోనే ప్రభుత్వానికి నివేదికలు సమర్పించినా ఒక్క పైసా కేటాయించలేదు. ఇప్పటికీ మంత్రాలయం మండలంలో కల్లుదేవకుంట గ్రామస్థులు 4 కిలోమీటర్ల దూరంలోని చిలకలడోణ, ఇబ్రహీంపట్నం గ్రామాలకు వెళ్లి తాగునీటిని తెచ్చుకుంటున్న దుస్థితి ఉంది.

మూగ జీవాల వేదనా పట్టదా..?

జిల్లాలోని కరవు మండలాల్లో పశువులకు దాణా కోసం 1,195 టన్నుల మిశ్రమ దాణా(టీఎంఆర్‌), 240 గడ్డి కత్తిరించే యంత్రాలు, 12.88 లక్షల గొర్రెలు, మేకలకు సంబంధించి నట్టల నివారణ మందు కోసం రూ.2.34 కోట్లను కేటాయించాలని 4 నెలల కిందటే ప్రతిపాదించినా నగదు మంజూరుకు జగనన్నకు మనసు రాలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని