కొంచెం ఓపిక పట్టండి.. అంతా మంచే జరుగుతుంది

‘సార్‌.. మాపై చాలా కేసులు పెట్టారు. దీంతో చాలామందికి పాస్‌పోర్టులు ఆగిపోయాయి.

Updated : 29 Mar 2024 07:31 IST

అయిదేళ్లుగా అమరావతి రైతులు నేరస్థుల్లా కోర్టుల్లో నిలబడుతున్నారు 
ప్రభుత్వం వారికి న్యాయం చేయాలి 
సుప్రీంకోర్టు మాజీ సీజే జస్టిస్‌ ఎన్‌.వి.రమణ
తమపై ఎన్నో కేసులు పెట్టారన్న రాజధాని మహిళలు  
మా పిల్లలపైనా కేసులు పెట్టారమ్మా.. అన్న జస్టిస్‌  
గన్నవరం విమానాశ్రయంలో తనను కలిసిన అన్నదాతలకు ఓదార్పు

ఈనాడు, అమరావతి - న్యూస్‌టుడే, గన్నవరం గ్రామీణం, హనుమాన్‌ జంక్షన్‌: ‘సార్‌.. మాపై చాలా కేసులు పెట్టారు. దీంతో చాలామందికి పాస్‌పోర్టులు ఆగిపోయాయి. ఎప్పుడూ పోలీసుస్టేషనే చూడనోళ్లం.. ఇప్పుడు కేసు వాయిదాల కోసం వారానికి రెండు, మూడు రోజులు కోర్టుల చుట్టూ తిరుగుతున్నాం. ఉదయం నుంచి సాయంత్రం దాకా కోర్టుల్లో ఉండాల్సి వస్తోంది. హైకోర్టు తీర్పు ఇచ్చినా.. జగన్‌ ప్రభుత్వం ఇంత వరకు ప్లాట్లను అభివృద్ధి చేయలేదు’ అని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ ఎదుట రాజధాని రైతులు, మహిళలు తమ గోడు వెల్లబోసుకుని కన్నీటి పర్యంతమయ్యారు. ఈ సందర్భంగా ఆయన వారితో మాట్లాడుతూ.. ‘ఇక మీకు మంచి జరుగుతుందని ఆశిద్దాం.. మీరు కొంచెం ఓపిక పట్టండి’ అని ధైర్యం చెప్పారు. కృష్ణా, ఎన్టీఆర్‌ జిల్లాల్లో ఒకరోజు పర్యటన కోసం గురువారం ఉదయం జస్టిస్‌ రమణ హైదరాబాద్‌ నుంచి విజయవాడకు విమానంలో వచ్చారు. గన్నవరం విమానాశ్రయం వెలుపల ఆయనను కలిసిన రైతులు తమ సమస్యల్ని విన్నవించుకున్నారు.

‘మాకు ఇచ్చిన ప్లాట్లను తాకట్టు పెట్టి రుణాలు తీసుకుందామన్నా బ్యాంకర్లు ఇవ్వడం లేదు. 2019 వరకు బ్యాంకులు రుణాలు ఇచ్చేవి. వైకాపా ప్రభుత్వం వచ్చాక పరిస్థితులు మారిపోయాయి. గత ప్రభుత్వం 25 రెవెన్యూ గ్రామాల పరిధిలో పూలింగ్‌లో భూములు ఇవ్వని చోట్ల భూసేకరణ ప్రకటన ఇచ్చింది. వైకాపా ప్రభుత్వం ఇటీవల దీనిని ఉపసంహరించింది. దీని వల్ల రాజధాని మాస్టర్‌ప్లాన్‌కు తీవ్ర విఘాతం ఏర్పడుతుంది’ అని రైతులు వివరించారు. ‘ఎన్నికలయ్యాక.. ఒకసారి మా శిబిరాలకు రావాలి. మాలో ధైర్యాన్ని నింపాలి. సూచనలు, సలహాలు ఇవ్వాలి’ అని రైతులు కోరగా.. తప్పనిసరిగా వస్తానని ఆయన హామీ ఇచ్చారు. కౌలు ఇవ్వాల్సిన గడువు దాటి ఏడాది అయినా ఇంకా జమ కాలేదనీ, జీవనం చాలా కష్టంగా ఉందని అన్నదాతలు ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తంచేశారు.

2,700 మందిపై 470 కేసులు పెట్టారు

‘నా మీద నాలుగు కేసులు పెట్టారు. వాయిదాల కోసం కోర్టు చుట్టూ తిరుగుతున్నా. కేసులు చూసుకోవాలా? కుటుంబాన్ని చూసుకోవాలా? అర్థం కావడం లేదు’ అని మందడం గ్రామానికి చెందిన ప్రియాంక వాపోయారు. జస్టిస్‌ రమణ స్పందిస్తూ.. ‘మా పిల్లల పైనా కేసులు పెట్టారమ్మా..’ అని వ్యాఖ్యానించారు. ‘ఏనాడూ ఎవరినీ చేయి చాచి అడగలేదు. ఎన్ని వానలు పడినా తట్టుకున్నాం. ఇవాళ ప్రభుత్వం ఇంత కక్షపూరితంగా వ్యవహరిస్తుందని ఊహించలేదు. ఈ కష్టాన్ని తట్టుకోలేకపోతున్నాం. ప్రతిరోజూ చచ్చి బతుకుతున్నాం’ అని తుళ్లూరుకు చెందిన రజిని కంటతడి పెట్టారు. ‘వారసత్వంగా వచ్చిన భూముల్ని ఇచ్చి.. బిడ్డలకు ఉద్యోగాలు లేక కోర్టుల చుట్టూ తిరుగుతున్నాం’ అని మహిళా రైతు మల్లీశ్వరి వాపోయారు. తనపై పోలీసులు 20 కేసులు పెట్టారని.. తాను ఎదుర్కొంటున్న ఇక్కట్లను జస్టిస్‌ రమణ ముందు చెప్పుకొన్నారు.

తమ జీవితంలో ఇన్ని కష్టాల్ని ఎన్నడూ చూడలేదని, తమను న్యాయవ్యవస్థే కాపాడుతోందని పలువురు మహిళలు కన్నీరు పెట్టుకున్నారు. పోలీసులు 2,700 మందిపై 470 కేసులు పెట్టారని అమరావతి రాజధాని ఐకాస సమన్వయ కమిటీ సభ్యుడు సుధాకర్‌.. జస్టిస్‌ రమణ దృష్టికి తీసుకొచ్చారు. ‘మీరు ధైర్యంగా ఉండండి. ఏ ప్రభుత్వం ఉన్నా.. మీరు గట్టిగా పోరాటం చేయాలి. లేనిపక్షంలో రైతుల్ని ఎవరూ లెక్కచేయరు. మద్దతు ధరపై దిల్లీ శివారులో ప్రతికూల పరిస్థితుల్లోనూ అన్నదాతలు పోరాడారు. అంతకంటే గొప్ప పోరాటం మీరు చేస్తున్నారు. తప్పనిసరిగా మీకు న్యాయం జరుగుతుంది’ అని జస్టిస్‌ రమణ ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఆయనకు రైతులు, మహిళలు వినతిపత్రం అందించారు.

ఆలస్యమైనా రైతులకు న్యాయం లభిస్తుంది

‘రాజధాని నిర్మాణానికి భూములిచ్చి.. ప్రస్తుత ప్రభుత్వ విధానాలతో 1,563 రోజులుగా ఉద్యమం చేస్తున్నారు. అమరావతి నిర్మాణానికి చాలా త్యాగం చేశారు’ అని జస్టిస్‌ రమణ అన్నారు. విమానాశ్రయం బయట ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘అయిదేళ్లుగా కోర్టుల్లో నేరస్థుల్లా నిలబడుతూ... అనేక కష్టనష్టాలకోర్చి రైతులు గొప్ప ఉద్యమం చేస్తున్నారు. వారి పరిస్థితి హృదయ విదారకంగా ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం వీరికి మేలు చేస్తుందని ఆశిస్తున్నా. న్యాయవ్యవస్థ కూడా వీరికి న్యాయం చేస్తుందని విశ్వసిస్తున్నా.. ఆలస్యమైనా తప్పక న్యాయం లభిస్తుంది. మంచి రాజధాని నిర్మాణం జరగాలని కోరుకుంటున్నాను’ అని ఆయన అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు