నాడు దర్జా.. నేడు గజగజ!

తాచెడ్డ కోతి వనమంతా పాడు చేసిందని... ఒక్కసారి అవకాశం ఇవ్వండని వేడుకుని, అధికారం దక్కించుకున్న జగన్‌ రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను దారుణంగా కుప్పకూల్చారు.

Published : 29 Mar 2024 05:38 IST

డ్వాక్రా సంఘాలకు తీరని ద్రోహం
మహిళల స్వయం ఉపాధిపై జగన్‌ దెబ్బ
అధికారంలోకి రాగానే 7,500 మంది ‘మిత్ర’లపై వేటు
సున్నా వడ్డీ రాయితీ కుదింపు
ఉన్నతి పథకానికి చేయూత కరవు
ఈనాడు, అమరావతి

డ్వాక్రా సంఘాల మహిళలు...
ఐదేళ్ల క్రితం దాకా దేశానికే దిక్సూచిగా నిలిచారు...
సేంద్రియ వ్యవసాయం చేశారు...
జనరిక్‌ ఔషధాలు విక్రయించారు...
మొక్కలు నాటారు... పింఛన్లూ పంచారు...
నేడు ప్రోత్సాహం కరవై దిక్కులు చూస్తున్నారు...

అది చేస్తా, ఇది చేస్తానంటూ ఊరూరూ తిరిగిన జగన్‌...
ఒక్కసారి అవకాశమిస్తే... ఐదేళ్లూ పీఠంపై ఉండి...
అవకాశాలను తుంచేసి... వారి వెన్ను విరిచారు!!

తాచెడ్డ కోతి వనమంతా పాడు చేసిందని... ఒక్కసారి అవకాశం ఇవ్వండని వేడుకుని, అధికారం దక్కించుకున్న జగన్‌ రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను దారుణంగా కుప్పకూల్చారు. ముఖ్యంగా కోటి మంది సభ్యులతో అలరారుతూ... పొదుపులో, స్వయం ఉపాధిలో దూసుకెళుతూ దేశానికే ఆదర్శంగా నిలిచిన డ్వాక్రా సంఘాలను నిలువునా మోసం చేశారు. తెదేపా ప్రభుత్వ హయాంలో డ్వాక్రా మహిళలు ఒక వెలుగు వెలిగారు. అన్నింటా వారికే అగ్రతాంబూలం దక్కింది. అవకాశమున్న ప్రతిచోటా అప్పటి ప్రభుత్వం వారి సేవల్ని వినియోగించుకుంది. దానికి ప్రతిఫలంగా ఆర్థిక ప్రోత్సాహకాలను అందించి... వారి కుటుంబాలు నిలుదొక్కుకునేలా చేసింది. పేదరిక నిర్మూలనకు కావాల్సింది ఇదే కదా. నాడు ఏదో ఒకట్రెండు చోట్లకాదు... ఈ సంఘాల సభ్యుల్లోని వేల మంది బ్యాంకింగ్‌ కరస్పాండెంట్‌ ఏజెంట్లుగా సేవలందించారు. డిపాజిట్లు సేకరించారు. అప్పులు ఇచ్చారు. జమ చేసుకున్నారు... ఉపకార వేతనాలను, ఉపాధి వేతనాలను, పింఛన్లను పంపిణీ చేశారు. బీమా, కల్యాణ మిత్రలుగా సేవలందించారు. ఏకంగా మూడు లక్షల మంది సేంద్రియ వ్యవసాయంలో ప్రవేశించారు. ‘అన్న సంజీవని’ పేరుతో జనరిక్‌ మెడికల్‌ దుకాణాలు నిర్వహించారు. ఉపాధి హామీలో వేసిన రహదారుల వెంట మొక్కలు పెంచారు. తెదేపా హయాంలో ఉచిత ఇసుక విధానాన్ని కూడా తొలుత డ్వాక్రా సంఘాల ద్వారానే అమలు చేయించారు. ఇంతగా వారికి అప్పట్లో ప్రాధాన్యం దక్కింది. జగన్‌ ప్రభుత్వంలో అంతకంటే ఎక్కువ చేయూత లభిస్తుందని ఆశించిన డ్వాక్రా మహిళలకు భంగపాటే ఎదురైంది. సీఎం పీఠం ఎక్కగానే ఈ విధానాలన్నింటికీ ఆయన చరమగీతం పాడారు. పైకి మాత్రం అక్కచెల్లెమ్మలంటూ పదేపదే పలవరించారు. వారి ప్రగతిని పాతాళానికి తొక్కే ఎత్తుగడలు అమలు చేశారు.


‘మిత్ర’లకు తీరని ద్రోహం

ఇంటిపట్టునే ఉండి ఎంతోకొంత సంపాదిస్తూ కుటుంబానికి చేదోడుగా నిలుస్తున్న వేల మంది డ్వాక్రా మహిళల ఉపాధిని జగన్‌ అధికారంలోకి రాగానే దెబ్బతీశారు. కనీసం వారిలో వితంతువులు, ఒంటరి మహిళలు ఉన్నారన్న కనికరం కూడా చూపించలేదు. తాను అధికారంలోకి వస్తే వేతనాలు పెంచి గొప్ప మేలు చేస్తానని ఎన్నికల ముందు ఊరూరూ తిరుగుతూ హామీలిచ్చారు. సీఎం కాగానే ఏకంగా 7,500 మందిని రోడ్డున పడేశారు.  పెళ్లికానుక పథకాన్ని అమలు చేసేందుకు తెదేపా ప్రభుత్వం 2,500 మంది కల్యాణమిత్రలను, చంద్రన్న బీమా పథకం అమలుకు 2,000 మంది బీమామిత్రలను, పశువుల పెంపకంలో రైతులకు చేయూతగా నిలిచేందుకు 3,000 మంది పశుమిత్రలను డ్వాక్రా మహిళల నుంచే నియమించింది. వీరంతా నెలకు రూ.5 వేల నుంచి రూ.20 వేల వరకు సంపాదించేవారు. అప్పట్లో వీరు ప్రతి పథకాన్ని లబ్ధిదారులకు చేరువ చేశారు. ఇలాంటి వారిని మరింత ప్రోత్సహించాల్సింది పోయి... విధుల్లో నుంచే తీసేశారు.


‘ఉన్నతి’కి అదనపు ప్రోత్సాహమే లేదు

న్నతి పథకం కింద తెదేపా ప్రభుత్వంలో డ్వాక్రా మహిళలకు చక్కటి ఆదరవు దక్కేది. మహిళల స్వయం ఉపాధికి చేయూతనివ్వడానికి... 2014-19 మధ్య తెదేపా ప్రభుత్వం వీరికి రూ.800 కోట్లను వడ్డీ లేకుండా రుణాలుగా ఇచ్చింది. అప్పును నెలవారీ వాయిదాల్లో తిరిగి కట్టించుకునేది. మహిళా సాధికారతకు పెద్దపీట వేయడంలో తనను మించిన వారే లేరన్నట్లుగా గొప్పలు చెప్పుకొనే జగన్‌... ఈ అయిదేళ్లలో ఉన్నతికి ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. గత ప్రభుత్వాలు ఇచ్చిన మొత్తాన్నే రొటేషన్‌ చేసుకుంటూ కాలాన్ని నెట్టుకొచ్చారు.


సభలకు తరలింపులో జగన్‌ది వికృతరూపం

రాష్ట్రంలో ఎక్కడైనా ముఖ్యమంత్రి జగన్‌ బహిరంగ సభ ఉందన్నా... మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొనే సమావేశాలు ఏర్పాటు చేస్తారన్నా డ్వాక్రా మహిళలు బెంబేలెత్తే పరిస్థితిని తీసుకొచ్చారు. సమావేశం ఉందంటే చాలు కిమ్మనకుండా వెళ్లాల్సి వచ్చేది. రాలేమని చెప్పే స్వేచ్ఛ, ఎదిరించే హక్కు లేకుండా చేశారు. ‘ఎన్ని పనులున్నా సభకు హాజరు కావాల్సిందే. లేకపోతే సంక్షేమ పథకాలు నిలిపేస్తాం’ అని అధికారులతో హుకుం జారీ చేయించారు. అనారోగ్యమైనా, అత్యవసర పనులున్నా వినలేదు. భార్యకు వీలవకుంటే భర్త వెళ్లాల్సి వచ్చింది. ఇది కేవలం ప్రభుత్వ కార్యక్రమాలకే పరిమితం కాలేదు. వైకాపా నిర్వహించిన ర్యాలీలు, మూడు రాజధానుల పేరుతో చేపట్టిన గర్జనలు, సామాజిక సాధికారత సభలు, ప్లీనరీ వంటి పార్టీ సమావేశాలకూ వర్తింపజేశారు. గతంలోనూ ప్రభుత్వ కార్యక్రమాలకు డ్వాక్రా మహిళల్ని తరలించడం ఉన్నా ఇంతస్థాయిలో బెదిరింపులు ఎప్పుడూ లేవు.


రూ.2 వేల కోట్లను లాగేసుకున్నారు

డ్వాక్రా సంఘాల్లోని 18-59 ఏళ్లు నిండిన మహిళలకు 60 ఏళ్లు దాటిన తర్వాత పింఛన్లు ఇచ్చేందుకు ఉమ్మడి రాష్ట్రంలో 2009లో అభయహస్తం పథకాన్ని తీసుకొచ్చారు. దీనికి అర్హతలున్న మహిళలు ఏటా ప్రీమియం చెల్లిస్తూ వస్తున్నారు. పింఛను చెల్లించేందుకు ప్రభుత్వం ఎల్‌ఐసీతో ఒప్పందం చేసుకుంది. దరఖాస్తుదారుల వాటా, ప్రభుత్వ వాటా కలిపి రూ.2 వేల కోట్ల వరకు చేరింది. అభినవ అప్పుల అప్పారావు... జగన్‌ కన్ను ఈ నిధిపై పడింది. ఎల్‌ఐసీని పథకం నుంచి తప్పించి ఆ మొత్తాన్ని తీసేసుకున్నారు. రెండు వేల కోట్లను ఏం చేశారో... ఎటు మళ్లించారో కూడా తెలియడం లేదు.


సున్నా వడ్డీ రాయితీలోనూ కోత

తెదేపా ప్రభుత్వ హయాంలో డ్వాక్రా సంఘాలకు బ్యాంకులు ఇచ్చే రుణ పరిమితి రూ.10 లక్షల వరకు ఉండేది. ఆ లోపు రుణం ఎంత తీసుకున్నా రూ.5 లక్షల వరకు సున్నా వడ్డీ రాయితీ వర్తించేది. జగన్‌ అధికారంలో రాగానే రూ.3 లక్షలకే వడ్డీ రాయితీ వర్తించేలా నిర్ణయం తీసుకున్నారు. దాంతో డ్వాక్రా మహిళలపై వడ్డీ భారం పెరిగింది. వడ్డీ ఎందుకు పెరుగుతోందో అర్థంకాక వారు తలలు పట్టుకున్నారు. దీనిపై ఏమీ మాట్లాడకుండా ఠంచనుగా సున్నా వడ్డీ రాయితీకి బటన్‌ నొక్కుతున్నట్లు బాకాలు ఊదుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని