‘పర్యాటకం...’ పక్కా నాటకం!

జగన్‌ ప్రభుత్వంలో పర్యాటక రంగం అభివృద్ధికి అప్పులివ్వడానికి బ్యాంకులే కాదు... పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలూ ముందుకు రాలేదు.

Updated : 29 Mar 2024 06:22 IST

పర్యాటక రంగంలో పెట్టుబడులకు ప్రైవేటు సంస్థల వెనకంజ
రూ.17,127 కోట్ల ఒప్పందాల్లో వచ్చినవి 18.67 శాతమే
బయటపడిన విశాఖ పెట్టుబడుల సదస్సు డొల్లతనం
ఈనాడు, అమరావతి

గొప్పలు చెప్పడం... తుస్సుమనిపించడం... జగన్‌ ప్రభుత్వం ఐదేళ్లలో చేసిందిదే... ఇందుకు పర్యాటకరంగమే చక్కటి ఉదాహరణ... పెట్టుబడిదారుల సదస్సులో 117 ఒప్పందాలు కుదిరాయంది... రూ.17,127 కోట్ల పెట్టుబడులు వస్తాయంది... ఏకంగా 39,170 మందికి ఉద్యోగాలు లభిస్తాయంది... తీరా ఈ మాటలన్నీ సముద్రం ఒడ్డున కట్టే ఇసుక గూళ్ల మాదిరే కనుమరుగయ్యాయి... కేవలం రూ.3,094 కోట్ల పెట్టుబడులతో 20 ప్రాజెక్టులు చేపట్టగా... అందులో మూడే మొదలవగా... వచ్చిన ఉద్యోగాలు 346 మాత్రమే... ఆయన నికరంగా చేసిందేమిటయ్యా అంటే... రుషికొండపై ప్యాలెస్‌ కట్టుకోవడం... పర్యాటకాభివృద్ధి సంస్థ ఆస్తులపై అప్పులు తేవడం... అస్మదీయులకు పర్యాటక ప్రాజెక్టులు అప్పగించడం!

గన్‌ ప్రభుత్వంలో పర్యాటక రంగం అభివృద్ధికి అప్పులివ్వడానికి బ్యాంకులే కాదు... పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలూ ముందుకు రాలేదు. ప్రభుత్వం ఒత్తిడి తెచ్చిందనో, అధికారుల మాట కాదనలేకో పెట్టుబడుల సదస్సులో అవగాహన ఒప్పందం చేసుకున్న అనేక సంస్థలు అనంతరం ముఖం    చాటేశాయి. పర్యాటక రంగం అభివృద్ధిపై అయిదేళ్లలో జగన్‌ ప్రభుత్వ ఆర్భాటం అంతాఇంతా కాదు.     లండన్‌-ఐ తరహా ప్రాజెక్టులు అభివృద్ధి చేసి ప్రపంచం నలుమూలల నుంచీ పర్యాటకులను ఆకట్టుకోవాలని  ఈ రంగంపై నిర్వహించిన సమీక్షల్లో సీఎం ఇచ్చిన ఆదేశాల్లో పసలేదని తేలిపోయింది. పైగా సుదూరాల నుంచి విశాఖ నగర సందర్శనకు వచ్చే పర్యాటకులకు సౌకర్యంగా ఉండే రుషికొండపై రిసార్టును కూల్చేసి, రూ.450 కోట్లతో సీఎం జగన్‌ రాజభవనం నిర్మించుకున్నారు. పాడైన రిసార్టులు, హోటళ్ల ఆధునికీకరణ కోసం ప్రభుత్వం నుంచి రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ)కు ఒక్క రూపాయి కేటాయించలేదు. ఏపీటీడీసీ ఆస్తులు తనఖా పెట్టుకుని అప్పు ఇవ్వాలని ఏడాదిన్నరగా బ్యాంకుల చుట్టూ అధికారులు  తిరుగుతున్నారు. ఎట్టకేలకు ఎస్‌బీఐ ముందుకొచ్చినా.. రుణం ఇంకా విడుదల చేయలేదు. పర్యాటక రంగంలోనూ ప్రైవేటు పెట్టుబడులు ఉత్తుత్తివేనని తేటతెల్లమైంది. గతేడాది నిర్వహించిన పెట్టుబడుదారుల సదస్సులో ఒప్పందం కుదిరిన ప్రాజెక్టుల్లో కేవలం మూడే కార్యరూపం దాల్చాయి. ఒప్పందాల విలువలో 18.07% పెట్టుబడులే వచ్చాయి. పనులు ప్రారంభించిన 20 ప్రాజెక్టుల్లో.. విజయవాడలో ఒక హోటల్‌, బాపట్లలో బీచ్‌ రిసార్టు, సత్యసాయి జిల్లాలో వెల్‌నెస్‌ సెంటర్‌ మాత్రమే మనుగడలోకి వచ్చాయి. మిగిలిన 17 ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయి.  మిగతా సంస్థలతో పెట్టుబడులు పెట్టించేలా రెండు కమిటీలను ఏర్పాటు చేశామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ ఫలితం కనిపించడం లేదు.


రాయితీలు కాగితాలకే పరిమితం...

పెట్టుబడులపై ప్రభుత్వ రాయితీలు కాగితాలకే పరిమితమవడంతో ఎక్కువమంది ఆసక్తి చూపడం లేదు. ఉదాహరణకు పాలసీలో భాగంగా పెట్టుబడులు పెట్టి ప్రారంభించే హోటళ్లకు ఏపీజీఎస్‌టీ అయిదేళ్ల వరకు మినహాయింపు, బార్ల ఫీజుల్లో రాయితీ వంటివి సరిగా అమలుకావడం లేదు. హోటళ్ల నిర్వాహకులనుంచి ముక్కుపిండి ప్రభుత్వం వసూలు చేస్తోంది.

ఈ ఏడాది జనవరి 29 నుంచి 31 వరకు మూడు రోజులపాటు విశాఖలో నిర్వహించిన దక్షిణ భారత హోటళ్ల అసోసియేషన్‌ సదస్సులో రాష్ట్ర ప్రభుత్వ ప్రాతినిధ్యం లేదంటే పర్యాటక రంగానికి ఎంత ప్రాధాన్యమిచ్చారో అర్థమవుతోంది. కర్ణాటక, తమిళనాడు, కేరళ తదితర రాష్ట్రాల పర్యాటకశాఖల నుంచి ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు హాజరైనా ఏపీ నుంచి ఎవరూ పాల్గొనలేదు.


వెంకన్ననీ విడిచిపెట్టలేదు!

రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థకు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం లేకపోగా.. ఉన్న ఆస్తులను, పర్యాటకుల కోసం అమలు చేస్తున్న వివిధ ప్యాకేజీలను ప్రైవేటు సంస్థల చేతుల్లో పెట్టేశారు. దాదాపు 15 రిసార్టులను ఎన్నికల కోడ్‌ వచ్చే ముందు ప్రైవేటు సంస్థలకు    అప్పగించేందుకు ఏపీటీడీసీ టెండర్లు పిలిచింది. దీనిపై ‘ఈనాడు’లో కథనం వెలువడడంతో టెండర్ల ప్రక్రియను నిలిపేశారు. అయినప్పటికీ నెల్లూరు జిల్లాలోని మైపాడు బీచ్‌ రిసార్టును ఇటీవలే ఒక ప్రైవేటు సంస్థకు కట్టబెట్టారు.

రాష్ట్రేతర ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకుల కోసం అమలుచేస్తున్న ప్యాకేజీలను సైతం ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టారు. ఇతర రాష్ట్రాల నుంచి తిరుమల వచ్చేవారికి ప్రత్యేకంగా బస్సు ప్యాకేజీ ఏపీటీడీసీ ఆధ్వర్యంలో ఏళ్లుగా అమలు చేస్తున్నారు.  బెంగళూరు, చెన్నై తదితర ప్రాంతాల నుంచి పర్యాటకులను బస్సుల్లో తీసుకొచ్చి తిరుమలలో స్వామి వారి దర్శనం చేయించి మళ్లీ అవే బస్సుల్లో వెనక్కి పంపుతారు. వీరికి వసతి, భోజన సదుపాయమూ ఏపీటీడీసీయే సమకూర్చేది. ఆదాయం సమకూరే ఈ ప్యాకేజీని ఇటీవలే ప్రైవేటు సంస్థకు కట్టబెట్టారు. ఒక్కో టికెట్‌పై ప్రైవేటు సంస్థ.. ఏపీటీడీసీకి కమీషన్‌ చెల్లించనుంది. దాంతో ఏపీటీడీసీ కోసం తితిదే రోజూ కేటాయించే 1,100 దర్శన టిక్కెట్లను అధికారులు ప్రైవేటు చేతుల్లో పెట్టినట్లయింది. దీనివల్ల టికెట్లు దుర్వినియోగమయ్యే ఆస్కారముంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని