గుత్తేదార్ల దయ.. గనులశాఖ ప్రాప్తం

టెండరు దక్కించుకున్న గుత్తేదారు ఒకటో తేదీన ఆ నెల సొమ్ము అడ్వాన్స్‌గా జమ చేయాలనేది నిబంధన. కానీ అత్యధిక జిల్లాల్లో గుత్తేదారులు ఆ డబ్బు చెల్లించడం లేదు.

Updated : 29 Mar 2024 06:19 IST

సీనరేజ్‌ సొమ్ము ప్రతి నెలా చెల్లించని గుత్తేదార్లు
వీరంతా ప్రభుత్వ పెద్దలకు కావాల్సినవారే 
అందుకే కోట్ల కొద్దీ బకాయిలున్నా నోరెత్తని గనులశాఖ అధికారులు
వారు ఇచ్చినప్పుడే తీసుకుని కళ్లకు అద్దుకుంటున్న వైనం
ఈనాడు - అమరావతి


 ‘ప్రైవేట్‌ సంస్థలకు సీనరేజ్‌ వసూళ్ల బాధ్యతలు అప్పగిస్తే.. ప్రతి నెలా నిర్దిష్టమైన ఆదాయం వస్తుంది. ప్రభుత్వ ఖజానాకు రాబడి పెరుగుతుంది’

లీజుదారుల నుంచి సీనరేజ్‌ వసూళ్లు ప్రైవేటు సంస్థలకు అప్పగించే విధానం ప్రవేశపెట్టినప్పుడు జగన్‌ ప్రభుత్వం చెప్పిన మాటలివి.


టెండరు దక్కించుకున్న గుత్తేదారు ఒకటో తేదీన ఆ నెల సొమ్ము అడ్వాన్స్‌గా జమ చేయాలనేది నిబంధన. కానీ అత్యధిక జిల్లాల్లో గుత్తేదారులు ఆ డబ్బు చెల్లించడం లేదు. ఆ గుత్తేదార్లంతా వైకాపా ప్రభుత్వ పెద్దలకు సన్నిహితులు కావడంతో గనుల శాఖ అధికారులు ఇదేంటని అడిగే ధైర్యం చేయలేకపోతున్నారు. వాళ్లు ఎప్పుడు చెల్లిస్తే అప్పుడే తీసుకొని.. మీ దయ, మా ప్రాప్తం అంటున్నారు. సీనరేజ్‌ వసూళ్ల బాధ్యతలు ప్రైవేటు సంస్థలకు అప్పగించడం ద్వారా గనులశాఖ ఆదాయం పెరగకపోగా తగ్గుతోంది. గుత్తేదార్లు లీజుదార్ల నుంచి సీనరేజ్‌, తదితరాలు వసూలు చేస్తూ, ప్రభుత్వానికి మాత్రం సకాలంలో డబ్బు చెల్లించడం లేదు. గనుల శాఖలో మొదటి నుంచి అధికారులే సీనరేజ్‌ వసూలు చేసేవారు. కొన్నిచోట్ల అధికారులు లీజుదారులతో లాలూచీపడి సీనరేజ్‌ చెల్లించకపోయినా ఖనిజాలు తరలించేలా చూస్తున్నారనే వాదన తెరపైకి తెచ్చి.. సీనరేజ్‌ వసూళ్లు ప్రైవేటుకు అప్పగించే విధానాన్ని జగన్‌ ప్రభుత్వం తీసుకొచ్చింది. దేశంలో కేవలం రాజస్థాన్‌లో మాత్రమే గ్రానైట్‌ సీనరేజ్‌ వసూళ్లు ప్రైవేటు సంస్థలకు ఇచ్చారు. దీనిని నమూనాగా తీసుకొని మన రాష్ట్రంలో అన్ని చిన్న తరహా ఖనిజాలకూ సీనరేజ్‌ వసూళ్లు ప్రైవేటుకు అప్పగించేలా నిబంధనలు మార్చేశారు. ఉమ్మడి జిల్లాల వారీగా రెండేళ్ల కిందట టెండర్లు పిలిచారు. ఏడు ఉమ్మడి జిల్లాలకు బిడ్లు ఖరారు చేసి, గుత్తేదార్లకు సీనరేజ్‌ వసూళ్ల బాధ్యతలు అప్పగించారు. అప్పటి నుంచే అసలు కథ మొదలైంది.

అన్నీ పెద్దల సన్నిహితులవే..

ఉమ్మడి చిత్తూరు, విజయనగరం జిల్లా టెండరును రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌, కడప జిల్లా టెండరును హిల్‌సైడ్‌ ఎస్టేట్స్‌ సంస్థలు దక్కించుకున్నాయి. ఇవి రెండూ తెలంగాణ మంత్రి, సీఎం జగన్‌కు అత్యంత సన్నిహితుడైన పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుటుంబానికి చెందినవి. అనంతపురం జిల్లా టెండరును అమిగోస్‌ మినరల్స్‌, గుంటూరు జిల్లాలో ఏఎంఆర్‌, తూర్పుగోదావరి టెండరును సుధాకర్‌ ఇన్‌ఫ్రా దక్కించుకున్నాయి. ఇవి రెండూ ప్రభుత్వ పెద్దలకు కావాల్సిన సంస్థలే. శ్రీకాకుళం జిల్లా టెండరు విశ్వసముద్రకు వచ్చింది.

చెల్లింపులేవీ?

టెండరు దక్కించుకున్న సంస్థలు రెండేళ్లపాటు ఆయా లీజుదారుల నుంచి సీనరేజ్‌, కన్సిడరేషన్‌ ఎమౌంట్‌, జిల్లా ఖనిజ నిధి (డీఎంఎఫ్‌), ఖనిజాన్వేషణ నిధి (మెరిట్‌), ఆదాయ పన్ను వసూలు చేయాలి. టెండరులో కోట్‌ చేసిన ధరను 24 వాయిదాలుగా విభజించి.. ఆ మొత్తాన్ని ప్రతి నెలా ఒకటో తేదీలోపు చెల్లించాలనేది ఒప్పందం. కడప, చిత్తూరు, అనంతపురం, విజయనగరం, తూర్పుగోదావరి జిల్లాల గుత్తేదార్లు సకాలంలో ఈ సొమ్ము చెల్లించడం లేదు. కడప జిల్లాలో గుత్తేదారు సంస్థ నెలకు రూ.9 కోట్ల మేర గనుల శాఖకు చెల్లించాల్సి ఉండగా ఏడు నెలల బకాయి పేరుకుపోయింది. అనంతపురం జిల్లాలో నెలకు రూ.10.79 కోట్లు కట్టాలి. అక్కడా మూడు నెలల బకాయి ఉంది. తూర్పుగోదావరి జిల్లాలో నెలకు రూ.9.7 కోట్ల చొప్పున చెల్లించాల్సి ఉండగా, డిసెంబరు నుంచి సొమ్ము కట్టడం లేదు. చిత్తూరు జిల్లాలో నెలకు రూ.12 కోట్ల మేర చెల్లించాల్సి ఉండగా, అందులో కొంత మొత్తమే చెల్లిస్తున్నారు.

నిబంధనలన్నీ కాగితాల్లోనే..

సీనరేజ్‌ గుత్తేదారులు పాటించాల్సిన నిబంధనలతో నిరుడు ఫిబ్రవరి 3న గనులశాఖ సంచాలకులు వెంకటరెడ్డి ఉత్తర్వులు జారీచేశారు. దీని ప్రకారం టెండర్‌లో కోట్‌ చేసిన మేరకు ఏ నెలయినా చెల్లించకపోతే.. ఆ గుత్తేదారు కాంట్రాక్ట్‌ను రద్దు చేయాలి. రాతపూర్వకంగా కారణాలు తెలియజేస్తే మరుసటి నెల 24 శాతం వడ్డీతో రాబట్టాలి. గుత్తేదారు ఇలా ప్రతి నెలా చెల్లింపులు చేయకపోతే, సీనరేజ్‌ కింద వసూలు చేసిన సొమ్మును సీజ్‌చేసి, వెంటనే గనులశాఖ ద్వారా సీనరేజ్‌ వసూళ్లకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి. అయితే నెలల తరబడి గుత్తేదారులు చెల్లింపులు చేయకపోయినా గనులశాఖ అధికారులు చోద్యం చూస్తున్నారు. వాళ్లు చెబుతున్న కారణాలకు గుడ్డిగా తలూపుతున్నారు. గుత్తేదారులంతా ప్రభుత్వ పెద్దలకు సన్నిహితులు కావడమే ఇందుకు కారణం.  

డెడ్‌ రెంట్‌ చెల్లించకపోయినా పర్మిట్లు

నిబంధనల ప్రకారం ప్రతి లీజుదారు వార్షిక డెడ్‌ రెంట్‌ చెల్లించాకే, ఆ లీజులో తవ్వి, తరలించే ఖనిజానికి పర్మిట్లు జారీ చేయాలి. గనులశాఖ ద్వారా పర్మిట్ల జారీ ఉన్నప్పుడు.. అంతా ఆన్‌లైన్‌ విధానమే నడిచేది. దీనివల్ల లీజుదారు డెడ్‌రెంట్‌ చెల్లించారా లేదా తెలిసేది. ఇప్పుడు సీనరేజ్‌ గుత్తేదారులు ఆన్‌లైన్‌ కాకుండా, ఆఫ్‌లైన్‌లో ముద్రిత పర్మిట్లు జారీ చేస్తున్నారు. దీనివల్ల కొందరు లీజుదారులు వార్షిక డెడ్‌ రెంట్‌ చెల్లించకపోయినా పర్మిట్లు జారీ చేసేస్తున్నారు. దీనివల్ల గనులశాఖ రాబడి తగ్గినట్లు తెలిసింది.


ఇసుకలో జేపీ మాదిరిగా ఎగవేతేనా?

రాష్ట్రంలో ఇసుక తవ్వకాలు, విక్రయాల టెండరు పొందిన గుత్తేదారు సంస్థ జేపీ పవర్‌ వెంచర్స్‌ రెండేళ్లకు రూ.1,528 కోట్లు చెల్లించే ఒప్పందంతో టెండరు దక్కించుకుంది. 30 నెలలపాటు ఇసుక వ్యాపారం చేసింది. ఈ లెక్కన ప్రభుత్వానికి రూ.1,909 కోట్లు చెల్లించాలి. రూ.1,059 కోట్లు మాత్రమే చెల్లించి, చేతులు దులిపేసుకుంది. ప్రభుత్వ పెద్దలు పూర్తి స్థాయిలో ఇసుక దందా చేసి వందల కోట్లు దోచేశారు. అందుకే జేపీ సంస్థ బకాయి రూ.850 కోట్లపై ప్రభుత్వం గానీ, గనులశాఖ గానీ గట్టిగా అడగటం లేదనే విమర్శలున్నాయి. ఇప్పుడు సీనరేజ్‌ వసూళ్ల గుత్తేదారులు కూడా.. లీజుదారుల నుంచి వసూళ్లు చేసుకొని, చివరకు ప్రభుత్వానికి ఎగనామం పెడితే దానికి బాధ్యులెవరనే ప్రశ్న తలెత్తుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని