వైకాపా అభ్యర్థి రాజ్యలక్ష్మి ఎస్టీ కాదంటూ వ్యాజ్యం

వైకాపా తరఫున పోలవరం శాసనసభ (ఎస్టీ) నియోజకవర్గం అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగనున్న తెల్లం రాజ్యలక్ష్మి ఎస్టీ కాదంటూ దాఖలైన వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది.

Published : 29 Mar 2024 05:32 IST

కౌంటర్‌ వేయాలని హైకోర్టు ఆదేశం
విచారణ ఏప్రిల్‌ 25కి వాయిదా

ఈనాడు, అమరావతి: వైకాపా తరఫున పోలవరం శాసనసభ (ఎస్టీ) నియోజకవర్గం అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగనున్న తెల్లం రాజ్యలక్ష్మి ఎస్టీ కాదంటూ దాఖలైన వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది. వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఉన్న రాజ్యలక్ష్మితో పాటు గిరిజన సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి, ఏలూరు జిల్లా కలెక్టర్‌, ఆర్డీవో, బుట్టాయిగూడెం తహశీల్దార్‌లకు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను ఏప్రిల్‌ 25కి వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బి.కృష్ణమోహన్‌ గురువారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. తెల్లం రాజ్యలక్ష్మి ఎస్టీ కాదంటూ మాదంవారిగూడెం నివాసి మడకం వెంకటేశ్వరరావు ఈ వ్యాజ్యం వేశారు. పిటిషనర్‌ తరఫున న్యాయవాది జడ శ్రావణ్‌కుమార్‌ వాదనలు వినిపిస్తూ.. రాజ్యలక్ష్మి బీసీ సామాజిక వర్గానికి చెందిన వారని తెలిపారు. తప్పుడు కుల ధ్రువపత్రంతో ఎస్టీగా చలామణి అవుతున్నారని నివేదించారు. ఈ వ్యవహారంలో విచారణ జరిపి తగిన ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశామన్నారు. బుట్టాయిగూడెం తహశీల్దార్‌కు పరిధి లేకపోయినా రాజ్యలక్ష్మి ఎస్టీ అంటూ ఉత్తర్వులు ఇచ్చారని పేర్కొన్నారు. వాటిని రద్దు చేయాలని న్యాయస్థానాన్ని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని