ఏపీలో రోగులకు ఎన్నికల కష్టాలు

ఎన్నికలు వచ్చాయంటే సామాన్యులకు పండగే అంటారు. కానీ, ఓ విషయంలో మాత్రం వారికి నానా ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

Published : 29 Mar 2024 05:30 IST

ఆరోగ్యశ్రీ కార్డు లేనివారికి అత్యవసర చికిత్సలు మాత్రమే
కోడ్‌ వల్ల పేరు.. తీరు మార్చేసిన అధికారులు

ఈనాడు, అమరావతి: ఎన్నికలు వచ్చాయంటే సామాన్యులకు పండగే అంటారు. కానీ, ఓ విషయంలో మాత్రం వారికి నానా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇన్నాళ్లూ ఆరోగ్యశ్రీ కార్డులు లేనివారికి ఆరోగ్యశ్రీ ట్రస్టు జిల్లా అధికారులు అనుమతిపత్రాలు జారీచేసేవారు. ‘ముఖ్యమంత్రి క్యాంప్‌ ఆఫీస్‌ (సీఎంసీఓ)’ పేరుతో జారీచేసే ఈ పత్రాల ఆధారంగా.. ఆరోగ్యశ్రీ కింద ఉన్న అన్ని రకాల చికిత్సలను అనుబంధ ఆసుపత్రుల్లో అందించేవారు. అయితే దీని పేరులో ‘ముఖ్యమంత్రి’ అని ఉన్నందున.. ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో వీటిని జారీ చేయొచ్చా.. లేదా అనే అనుమానం అధికారులకు వచ్చింది. దీనిపై ఎన్నికల కమిషన్‌కు వైద్య ఆరోగ్యశాఖ గత వారం లేఖ రాసింది. కోడ్‌ అమల్లో ఉంది కాబట్టి, ఎన్నికల అధికారుల నుంచి అనుమతి వచ్చేవరకు ఈ సేవలు ఆపేయాలని నిర్ణయించింది. తాజాగా రాష్ట్ర ఎన్నికల కమిషన్‌.. ఈ అనుమతిపత్రం పేరును మార్చింది. అత్యవసర వైద్యం అవసరమైన వారికి మాత్రమే అనుమతి పత్రాన్ని ఇకపై ‘ట్రీట్‌మెంట్‌ ఫర్‌ హెల్త్‌ ఎమర్జెన్సీ ఆన్‌ హ్యుమానిటేరియన్‌ వ్యూ’ (మానవతా దృక్పథంతో అత్యవసర చికిత్స) పేరుతో సిఫార్సు లేఖలను జారీచేయాలని సూచించింది.

ఇందులోనూ సేవల విషయంలో కొన్ని మార్పుచేర్పులు చేశారు. రోడ్డు ప్రమాదాలు, లేదా ఇతర ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడి అత్యవసర చికిత్సలు అవసరమైన వారికి మాత్రమే ఈ అనుమతిపత్రాలు జారీచేస్తారు. అంతేతప్ప కంటి శస్త్రచికిత్సలు, హెర్నియా శస్త్రచికిత్సలు, చాలారకాల ఇతర చికిత్సలు కూడా వీటిలో ఇకపై దాదాపు రెండు నెలల పాటు అందుబాటులో ఉండకపోవచ్చు. పరిమితంగా ఉండే సేవలను శుక్రవారం నుంచి పునరుద్ధరించే అవకాశం కనిపిస్తోంది. దీనివల్ల ఆరోగ్యశ్రీ కార్డులు లేని పేదరోగులకు ఇబ్బందులు ఎదురవుతాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. అత్యవసరం కాకపోయినా కొన్నిరకాల చికిత్సలు చేయించుకోవాలంటే ప్రైవేటులో పెద్దమొత్తంలో వెచ్చించాలి. ప్రభుత్వాసుపత్రుల్లో అన్నీ అందుబాటులో ఉండకపోవచ్చు. అలాంటి సందర్భాల్లో పాతపద్ధతి వారికి ఉపయోగపడేది. పేరు ఏదైనా.. అన్నిరకాల సేవలను అందుబాటులో ఉంచితే తమకు మేలు జరుగుతుందన్నది రోగుల వాదన.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని