నిబంధనలకు పాతర.. రూ.కోట్ల జాతర

ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ‘మేమంతా సిద్ధం’ పేరుతో నిర్వహిస్తున్న బస్సు యాత్ర, బహిరంగ సభలను చూస్తుంటే రాష్ట్రంలో ఎన్నికల కోడ్‌ అమలులో ఉందా? అన్న సందేహం కలుగుతోంది.

Published : 30 Mar 2024 06:32 IST

సీఎం జగన్‌ బస్సు యాత్రలో విచ్చలవిడిగా ఖర్చు
ఎమ్మిగనూరు సభకు జనం తరలింపునకు 1,300 బస్సులు

ఈనాడు-కర్నూలు, ఎమ్మిగనూరు, కోడుమూరు పట్టణం, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ‘మేమంతా సిద్ధం’ పేరుతో నిర్వహిస్తున్న బస్సు యాత్ర, బహిరంగ సభలను చూస్తుంటే రాష్ట్రంలో ఎన్నికల కోడ్‌ అమలులో ఉందా? అన్న సందేహం కలుగుతోంది. పట్టణాలు, గ్రామాల్లో ముఖ్యమంత్రికి స్వాగతం పలకడానికి, బహిరంగ సభ నిర్వహణకు రూ.కోట్లలో ఖర్చు పెడుతున్నారు. శుక్రవారం కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో నిర్వహించిన మేమంతా సిద్ధం బహిరంగ సభకు సీఎం హాజరయ్యారు. ఇందుకు కోడుమూరు నుంచి బస్సు యాత్ర మొదలుకాగా గ్రామంలో 3 కి.మీ. మేర ఎటు చూసినా ఫ్లెక్సీలే కనిపించాయి. క్రేన్లతో గజమాల వేయడం, దారి పొడవునా పూలు చల్లడం, భారీ ఎత్తున బాణసంచా కాల్చడం, రహదారులపై పదుల సంఖ్యలో కళాకారుల నృత్య ప్రదర్శనలుసహా భారీ స్పీకర్లున్న మొబైల్‌ వ్యాన్లు ఏర్పాటు చేశారు. ఎమ్మిగనూరు పట్టణంలో కూడా సభ నిర్వహణకు రూ.కోట్లు ఖర్చు పెట్టారు.

అనధికారికంగా మరింత ఖర్చు...

సభకు వచ్చిన వారికి ఒక్కొక్కరికి రూ.300 ఇచ్చినట్లు పలువురు చర్చించుకున్నారు. మధ్యాహ్నం భోజనంతోపాటు పురుషులకు మద్యం ఉచితంగా అందించారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 14 నియోజకవర్గాల నుంచి జనాన్ని తీసుకువచ్చేందుకు రూ.కోట్లలో ఖర్చు పెట్టినట్లు సమాచారం. ఆర్టీసీ నుంచి అధికారికంగానే 1,300 బస్సులు తీసుకున్నారు. ఎమ్మిగనూరు బహిరంగ సభకు వచ్చిన మహిళలకు కవర్లలో డబ్బులు పెట్టి పంపిణీ చేశారు. రోడ్డు మీదే వాటిని వైకాపా నేతలు మహిళలకు అందజేస్తున్న వీడియోలు శుక్రవారం సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేశాయి.

ప్రయాణికులకు ప్రత్యక్ష నరకం

ఎమ్మిగనూరు సభకు వినియోగించిన 1,300 బస్సుల్లో సుమారు 700 ఉమ్మడి కర్నూలు జిల్లాలోని వివిధ డిపోలకు చెందినవే. దీంతో ప్రయాణికులు మూడో రోజు ప్రత్యక్ష నరకం చేశారు. ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆర్టీసీ బస్సుల కోసం గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చింది. కర్నూలు నుంచి ఎమ్మిగనూరు వెళ్లే మార్గంలో ముఖ్యమంత్రి బస్సు యాత్ర దృష్ట్యా ఈ దారిలో ప్రయాణికులను ఎక్కడపడితే అక్కడ ఆపేశారు. గూడూరు మండలం పెంచికలపాడు గ్రామం దగ్గర ముఖ్యమంత్రి బస చేసిన ప్రాంతానికి సమీపంలోని ప్రధాన రహదారిపై ఎక్కడికక్కడ బారికేడ్లు పెట్టడంతో ట్రాఫిక్‌ స్తంభించిపోయింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని