వాసుపల్లికి సర్కారు నజరానాలు

విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్‌కు దోచిపెట్టేందుకు గుర్తించిన ప్రభుత్వ భూముల విలువ రూ.206 కోట్లు. తన ‘వైజాగ్‌ డిఫెన్స్‌ అకాడమీ’ విద్యాసంస్థ కార్యకలాపాల విస్తరణకు ప్రభుత్వం నుంచి కారుచౌకగా భూమిని పొందేందుకు వాసుపల్లి చేయని ప్రయత్నం లేదు.

Updated : 30 Mar 2024 07:23 IST

రూ.206 కోట్ల భూ సంతర్పణ!
భూ సేకరణ చట్టం ప్రకారం చెల్లించాల్సిన మొత్తంతో కలిపి
భారీగా ఫీజులు.. చౌకగా భూమి కొట్టేసేందుకు కుయుక్తులు!

ఈనాడు-అమరావతి, విశాఖపట్నం: విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్‌కు దోచిపెట్టేందుకు గుర్తించిన ప్రభుత్వ భూముల విలువ రూ.206 కోట్లు. తన ‘వైజాగ్‌ డిఫెన్స్‌ అకాడమీ’ విద్యాసంస్థ కార్యకలాపాల విస్తరణకు ప్రభుత్వం నుంచి కారుచౌకగా భూమిని పొందేందుకు వాసుపల్లి చేయని ప్రయత్నం లేదు. 10 ఎకరాల వరకు భూములు నామమాత్రపు ధరకు కేటాయించాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. చివరికి ముఖ్యమంత్రి కార్యాలయం జారీచేసిన ఆదేశాలతో విశాఖ జిల్లా అధికారులు ప్రతిపాదనలు సిద్ధంచేశారు. దీని ప్రకారం మూడుచోట్ల కలిపి 6.90 ఎకరాలను గుర్తించారు. ఈ మొత్తం భూమి మార్కెట్‌ విలువ సుమారు రూ.82 కోట్లు అవుతుంది. మధురవాడలో 1.50 ఎకరాలు, బక్కన్నపాలెంలో 40 సెంట్లు, కుసలవాడలో 5 ఎకరాల చొప్పున గుర్తించారు. చదరపు గజం మార్కెట్‌ విలువ మధురవాడలో రూ.1.15 లక్షలు, బక్కన్నపాలెంలో రూ.90,000 చొప్పున ఉంది. కుసలవాడలో ఎకరా రూ.45 లక్షల వరకు పలుకుతోంది. ప్రజల నుంచి భూసేకరణ జరిగినప్పుడు భూసేకరణ చట్టం-2013 ప్రకారం ప్రభుత్వపరంగా చేసే నష్టపరిహారం చెల్లింపుల మాదిరిగానే.. ప్రభుత్వ భూమిని పొందిన వారు కూడా చెల్లించాలి. ఈ ప్రకారమే వాసుపల్లికి భూమి కేటాయిస్తే.. మొత్తం రూ.206 కోట్లు చెల్లించాలని అధికారులు లెక్కలు తేల్చారు. ఈ మేరకు అధికార యంత్రాంగం ప్రభుత్వానికి ఇటీవల పంపిన నివేదికలో స్పష్టం చేసింది. ఈ ప్రతిపాదనలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి.

ఎమ్మెల్యే డిఫెన్స్‌ అకాడమీ ద్వారా పలుచోట్ల ఎంపీసీ, ఐఐటీ, డిఫెన్స్‌ రంగాల్లో అభ్యర్థులకు నైపుణ్య శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఒక్కో విద్యార్థికి హాస్టల్‌ వసతితో కలిపి సుమారు రూ.2.20లక్షలు, డేస్కాలర్‌ అయితే రూ.80వేల చొప్పున ఫీజులు తీసుకుంటున్నారు. ఉచితంగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వ భూమికి టెండర్‌ పెట్టడం గమనార్హం. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వాసుపల్లి విశాఖ దక్షిణ నియోజకవర్గం నుంచి తెదేపా తరఫున పోటీచేసి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన విద్యాసంస్థలపై వైకాపా ప్రభుత్వం దాడులు చేయించింది. ఆ పరిణామాల నేపథ్యంలో వాసుపల్లి వైకాపా పంచన చేరారు. నజరానా కింద ప్రభుత్వ భూమికి వాసుపల్లి గురిపెట్టారు. ప్రైవేటు రంగంలో ఉన్న డిఫెన్స్‌ అకాడమీకి భూముల కేటాయింపులకు అనుకూలంగా నైపుణ్యాభివృద్ధి సంస్థ నుంచి సిఫార్సులు రెవెన్యూ శాఖకు అందాలి. జీవీఎంసీ నుంచి ఎన్‌ఓసీ రావాలి. ఇవేమీ లేకుండానే విశాఖ జిల్లా కలెక్టర్‌ నుంచి భూ కేటాయింపులపై ప్రతిపాదనలు రెవెన్యూ శాఖకు అందాయి.


రూ.1.90 కోట్లతో రోడ్డేశారు

విశాఖపట్నం (వేపగుంట), న్యూస్‌టుడే: నగరంలో చాలా రోడ్లు అధ్వానంగా తయారై ప్రజలు అవస్థలు పడుతున్నా పట్టించుకోని వైకాపా ఎమ్మెల్యేలు నగర శివారులోని తమవారి భూముల విలువ పెరిగేలా రోడ్లు, ఇతర వసతులను కల్పిస్తున్నారు. తెదేపాలో గెలిచి వైకాపా పంచన చేరిన మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్‌కుమార్‌ మహావిశాఖ నగరపాలక సంస్థ పరిధి 88వ వార్డు నరవలో కొనుక్కున్న భూములకు జీవీఎంసీ నిధులు రూ.1.90 కోట్లు వెచ్చించి ప్రస్తుతం రహదారి పనులు చేపడుతున్నారు. మాజీ ఎమ్మెల్యే గణేశ్‌కుమార్‌ తన పలుకుబడిని ఉపయోగించి స్థానిక పెందుర్తి ఎమ్మెల్యే అదీప్‌రాజ్‌ సహకారంతో తన భూముల వరకు రహదారి నిర్మాణానికి నిధులు మంజూరు చేయించుకున్నారు. ఈ పనులకు ఈ ఏడాది జనవరి 12న శంకుస్థాపన చేయడానికి ఇంజినీరింగ్‌ అధికారులు ఏర్పాట్లు చేశారు. విషయం తెలుసుకున్న వార్డు తెదేపా కార్పొరేటర్‌ ముత్యాలనాయుడు, తెదేపా, జనసేన నాయకులు మేయర్‌కు ఫిర్యాదు చేశారు. జనసంచారం లేనిచోట, వ్యక్తిగత ప్రయోజనాలకు రహదారి నిర్మించడమేంటని ప్రశ్నించారు. వీరంతా ధర్నాకు దిగడంతో అధికారులు కాస్త వెనకడుగు వేసి శంకుస్థాపనను వాయిదా వేశారు. ప్రస్తుతం ఎన్నికల నియమావళి అమల్లోకి రావడంతో అధికారులంతా ఆ విధుల్లో నిమగ్నమవడంతో సందట్లో సడేమియాలా  గుట్టుచప్పుడు కాకుండా నాలుగు రోజుల కిందట రహదారి పనులు ప్రారంభించారు. ప్రస్తుతం మట్టి పని చేశారు. నిబంధనలకు విరుద్ధంగా రహదారిని నిర్మించడంపై విచారించాలని గ్రామస్థులు కోరుతున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని