జగన్నాటకంలో జీడిపల్లి గొంతు జీర!

జీడిపల్లి జలాశయం, ఎగువ పెన్నా (పేరూరు) ప్రాజెక్టులను అనుసంధానించి అనంతపురం జిల్లాలోని 8 మండలాల పరిధిలో 75 వేల ఎకరాలకు సాగునీరు అందించవచ్చు. ఇందుకు రూ.803 కోట్ల ఖర్చుతో ముట్టాల, తోపుదుర్తి, దేవరకొండ, సోమరవాండ్లపల్లి వద్ద నాలుగు జలాశయాలను నిర్మిస్తాం.

Updated : 30 Mar 2024 12:44 IST

తెదేపా చేపట్టిన జీడిపల్లి-పేరూరు నీటి పథకానికి పాతర
కొత్తది శిలాఫలకానికే పరిమితమై రైతన్నల గోడుగోడు
గుత్తి జనానికి ఉప్పునీరే మిగిల్చారు..
గుత్తి, రాప్తాడు నియోజకవర్గాల్లో సీఎం జగన్‌ బస్సు యాత్ర నేడు


జీడిపల్లి జలాశయం, ఎగువ పెన్నా (పేరూరు) ప్రాజెక్టులను అనుసంధానించి అనంతపురం జిల్లాలోని 8 మండలాల పరిధిలో 75 వేల ఎకరాలకు సాగునీరు అందించవచ్చు. ఇందుకు రూ.803 కోట్ల ఖర్చుతో ముట్టాల, తోపుదుర్తి, దేవరకొండ, సోమరవాండ్లపల్లి వద్ద నాలుగు జలాశయాలను నిర్మిస్తాం. నాలుగు ఎత్తిపోతల పథకాలను చేపడతాం.

2020 డిసెంబరు 9న శ్రీసత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లి మండలం వెంకటాంపల్లి వద్ద జలాశయాల నిర్మాణానికి వర్చువల్‌గా శంకుస్థాపన చేసిన సందర్భంగా సీఎం జగన్‌ హామీ ఇది..


ఈనాడు డిజిటల్‌, అనంతపురం: ఏరు దాటాక తెప్ప తగలేయడం ముఖ్యమంత్రి జగన్‌ నైజం. అవసరాల కోసం హామీలివ్వడం.. మరుక్షణమే మరిచిపోవడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. ఊరించి ఉసూరుమనిపించడంలో దిట్ట. 2020 చివరలో శ్రీసత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గంలోని చెన్నేకొత్తపల్లి మండలం వెంకటాంపల్లి వద్ద జీడిపల్లి-పేరూరు పథకానికి శంకుస్థాపన చేసిన సందర్భంగా ఆయన మాయమాటలెన్నో చెప్పారు. పథకాన్ని సత్వరం పూర్తిచేసి ఎనిమిది మండలాల్లో 75 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తామని పెద్దపెద్ద హామీలిచ్చారు. మూడేళ్లు గడిచినా దీని అతీగతీ లేదు. శనివారం ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్రలో రాప్తాడు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. కార్యరూపం దాల్చుతున్న పథకాన్ని నిలిపేయడమే కాకుండా కొత్తదీ అందించక దుర్భిక్షంలోకి నెట్టేసిన జగన్‌ వైఖరిని స్థానిక రైతులు ప్రశ్నిస్తున్నారు. జీడిపల్లి-పేరూరు ప్రాజెక్టు పూర్తికి ఇచ్చిన హామీ అడుగు ముందుకు పడలేదు. అధికారంలోకి వచ్చాక సీఎం హోదాలో ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి మరిచిపోయారు. ఈ ఒక్క పథకంపైనే సీఎం జగన్‌ మూడుసార్లు స్వయంగా హామీనిచ్చినా పనులు చేపట్టలేదు. శంకుస్థాపన శిలాఫలకాలు తప్ప గంప మట్టి తీసింది లేదు. నిధులు కేటాయించకుండా డిజైన్లు, సర్వే, భూసేకరణ పేరుతో జాప్యం చేశారు. దీన్నిబట్టి ఉమ్మడి అనంతపురం జిల్లా సాగునీటి ప్రాజెక్టులపై సీఎం జగన్‌ చిత్తశుద్ధి స్పష్టమవుతుంది.

అధికారంలోకి రాగానే పనుల రద్దు

జీడిపల్లి-పేరూరు పథకానికి 2018లోనే తెదేపా ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పుట్టకనుమ, సోమరవాండ్లపల్లి వద్ద బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్లు నిర్మించాలని నిర్ణయించింది. రూ.803 కోట్లకు పరిపాలన అనుమతులనిచ్చి రూ.565 కోట్లకు టెండర్లనూ పిలిచింది. 37 కి.మీ. కాలువ పనులూ పూర్తయ్యాయి. నాలుగు పంపుహౌస్‌ల నిర్మాణాన్నీ మొదలుపెట్టారు. 16 కి.మీ. కాలువ పనులు పెండింగ్‌లో ఉన్నాయి. అప్పట్లోనే 988 ఎకరాల భూమి సేకరించారు. 95 ఎకరాలకు సంబంధించి రూ.5.20 కోట్ల పరిహారమూ చెల్లించారు. ఆ రోజు ధర ప్రకారం ఇంకా రూ.50.75 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఇంతలో ప్రభుత్వం మారడంతో పనులు ఎక్కడివక్కడ నిలిచాయి. వైకాపా ప్రభుత్వం రాగానే ప్రాజెక్టు నమూనాను మార్చేసింది. తెదేపా హయాంలో చేపట్టిన పుట్టకనుమ రిజర్వాయరును రద్దు చేసింది. రూ.803 కోట్ల ఖర్చుతో ముట్టాల, తోపుదుర్తి, దేవరకొండ, సోమరవాండ్లపల్లి వద్ద నాలుగు జలాశయాల నిర్మిస్తామని ప్రకటించింది.


ఇదీ లక్ష్యం..

హంద్రీనీవాలో భాగంగా నిర్మించిన జీడిపల్లి జలాశయం నుంచి పేరూరుకు కృష్ణా జలాలు అందించాలని లక్ష్యం. ఎత్తిపోతల ద్వారా జీడిపల్లి జలాశయం నుంచి పేరూరు డ్యాంకు మూడు నెలల్లో 7.2 టీఎంసీలను తీసుకెళ్లాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా నిర్మించే దేవరకొండ, ముట్టాల, తోపుదుర్తి, సోమరవాండ్లపల్లి జలాశయాలను కృష్ణా జలాలతో నింపి కనగానపల్లి, చెన్నేకొత్తపల్లి, రాప్తాడు, రామగిరి, ఆత్మకూరు, కంబదూరు, కూడేరు, బెళుగుప్ప మండలాలకు నీరందించాలని నిర్ణయించుకున్నారు. వీటి నిర్మాణానికి 5,171 ఎకరాలు అవసరమవుతాయని అంచనా. జీడిపల్లి నుంచి ఎగువ పెన్నా జలాశయం వరకున్న 53.45 కి.మీ. ప్రధాన కాలువపై నాలుగు ఎత్తిపోతలు, 110 కాంక్రీటు కట్టడాలు చేపట్టాల్సి ఉంది. కొత్తపల్లి, ఆత్మకూరు, బాలవెంకటాపురం, మద్దెలచెరువు వద్ద ఎత్తిపోతల పథకాలు చేపట్టేలా ప్రాజెక్టు రూపొందింది. అయిదేళ్లలో ఈ పనులు ముందుకెళ్లలేదు.


గుత్తి దాహం కేకలు వినిపించవా?

అనంతపురం జిల్లా గుత్తి పురపాలికతోపాటు బసినేపల్లిలో తాగునీటి సమస్య తీరుస్తామని ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు సీఎం జగన్‌ హామీనిచ్చారు. అధికారంలోకి వచ్చాక పట్టించుకోలేదు. పట్టణంలో 55 వేల మంది నివసిస్తున్నారు. ఇంటింటికి కుళాయిలు ఏర్పాటుచేయించి నీటి సమస్య లేకుండా చూస్తామని ప్రకటించిన జగన్‌ అధికారంలోకి వచ్చాక విస్మరించారు. ఈసారి ప్రయాణంలో కర్నూలు జిల్లా నుంచి అనంతపురం జిల్లాలో జగన్‌ తొలి అడుగు గుత్తి ప్రాంతంలోనే పడనుంది.

గుత్తి పురపాలికలోని చెట్నేపల్లి, గుత్తి ఆర్‌.ఎస్‌, గుత్తి పట్టణంలో ప్రజలకు నెలకోసారి తాగునీటిని సరఫరా చేస్తున్నారు. పామిడి సమీపంలోని పెన్నా నుంచి నీరు రావాల్సి ఉంది. పెన్నాలో వైటీ చెరువు, సత్యసాయి పథకాలున్నాయి. వాటి నుంచి రోజుకు 30 లక్షల లీటర్ల నీరు రావాల్సి ఉంది. వైటీ చెరువు పథకం నుంచి రోజుకు పది లక్షల లీటర్లే అందుతున్నాయి. ఈ నీరు ఏమూలకూ సరిపోవు.

పురపాలిక అధికారులు ప్రస్తుతం 20 ట్యాంకర్లతో అందించే నీరు ఉప్పగానే ఉంటున్నాయి. తెదేపా ప్రభుత్వం గుత్తి వాసుల దాహార్తి తీర్చేందుకు రూ.173 కోట్లతో నీటి పథకాన్ని మంజూరు చేసింది. గార్లదిన్నె ఎంపీఆర్‌ డ్యామ్‌లో తుంగభద్ర జలాలను నిల్వ ఉంచి పైపులైన్‌ ద్వారా గుత్తికి అందించాలని పథకం రూపొందించారు. పథకం మంజూరై అయిదేళ్లు గడిచినా వైకాపా ప్రభుత్వం పూర్తి చేయలేదు. తెదేపాకు మంచి పేరు వస్తుందని మూలన పడేశారు. గుత్తి, సూరశింగనపల్లిలో ట్యాంకులను మాత్రం నిర్మించారు. కేవలం ఒకటిన్నర కి.మీ.దూరమే పైప్‌లైన్‌ వేశారు. పూర్తికి దాదాపు రూ.70 కోట్ల విలువైన పైపులు అవసరం. బిల్లుల చెల్లింపులో జాప్యం వల్ల పథకం పూర్తికి గుత్తేదారు సంస్థ చొరవ చూపడం లేదు. ట్యాంకర్లలో వచ్చే ఉప్పునీటి కోసం ఘర్షణలు తప్పడం లేదు.


నిధులు రాలిస్తేనే కదా!

2018లో తెదేపా ప్రభుత్వం పెద్దఎత్తున నిధులు కేటాయించి ఈ పథకం పనులను పరుగులు పెట్టించింది. 53 కి.మీ. ప్రధాన కాలువను దాదాపు పూర్తి చేసింది. భూనిర్వాసితులకు పరిహారమూ చెల్లించారు. వైకాపా ప్రభుత్వం వచ్చాక పరిహారం పెంచి ఇస్తామని ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి అప్పట్లో హామీనిచ్చారు. అయిదేళ్లు పూర్తయి మళ్లీ ఎన్నికలు వస్తున్నా సొమ్ము జమ చేయలేదు. నాలుగు ప్రాజెక్టుల నిర్మాణానికి 13 గ్రామాల రైతులు భూములిస్తున్నారు. ఎకరాకు రూ.20 లక్షలు ఇవ్వాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. అయితే నిబంధనల మేరకు ఎకరాకు రూ.8 లక్షల నుంచి రూ.10 లక్షలు ఇస్తామని ప్రభుత్వం చెబుతుండటంతో రైతులు ఒప్పుకోవడం లేదు. ఈ అయిదేళ్లలో ప్రాజెక్టు నిర్మాణానికి రూపాయి కేటాయించలేదు. ఇప్పుడు సీఎం జగన్‌ ఎన్నికల ప్రచారానికి వస్తున్నందున గతంలో తాను ఇచ్చిన హామీలపై ఏం మాట్లాడతారనేది చర్చనీయాంశమైంది.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని