మా అభ్యర్థులు పేదోళ్లు

వైకాపా తరఫున పోటీచేస్తున్న అభ్యర్థులు పేదోళ్లని.. వారి ఆర్థికపరిస్థితి అంతంత మాత్రమేనని సీఎం జగన్‌ శుక్రవారం ఎమ్మిగనూరులో నిర్వహించిన ‘మేమంతా సిద్ధం’ సభలో వ్యాఖ్యానించడంతో పలువురు ఆశ్చర్యపోయారు.

Updated : 30 Mar 2024 07:06 IST

పలువురి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమేనన్న సీఎం
ఆ వ్యాఖ్యలపై పలువురి విస్మయం

ఈనాడు-కర్నూలు, న్యూస్‌టుడే-ఎమ్మిగనూరు: వైకాపా తరఫున పోటీచేస్తున్న అభ్యర్థులు పేదోళ్లని.. వారి ఆర్థికపరిస్థితి అంతంత మాత్రమేనని సీఎం జగన్‌ శుక్రవారం ఎమ్మిగనూరులో నిర్వహించిన ‘మేమంతా సిద్ధం’ సభలో వ్యాఖ్యానించడంతో పలువురు ఆశ్చర్యపోయారు. కర్నూలు మేయర్‌ బీవై రామయ్య పేదవాడని, ఆలూరు అభ్యర్థిగా పోటీచేస్తున్న విరూపాక్షి కూడా పేద వ్యక్తని, తన చెల్లెలు బుట్టమ్మ (బుట్టా రేణుక) ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమేనని, కోడుమూరు అభ్యర్థి డాక్టర్‌ సతీశ్‌ దగ్గర డబ్బుల్లేవని, ఐఏఎస్‌ అధికారిగా పనిచేసి, ఇటీవలే రాజీనామా చేసి కర్నూలు అభ్యర్థిగా పోటీచేస్తున్న డాక్టర్‌ ఇంతియాజ్‌ దగ్గర కూడా డబ్బులు లేవని, ఆదోని అభ్యర్థి సాయన్న (సాయి ప్రసాద్‌రెడ్డి), మంత్రాలయం అభ్యర్థి బాలనాగిరెడ్డి కూడా సౌమ్యులని, వారిద్దరి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమేననడంతో అందరూ ఆశ్చర్యపోయారు. వారంతా కోటీశ్వరులని, విలాసవంతమైన కార్లు, బంగళాలు ఉన్నాయని అంతా అనుకుంటున్న వేళ ముఖ్యమంత్రి పేదలు అనేసరికి అందరికీ ఒక్కసారి షాకయ్యారు. తనది పేదల పార్టీ అని, మే 13న కురుక్షేత్ర యుద్ధం జరగబోతోందని, అందులో పెత్తందారులంతా ఒకవైపు, పేదలంతా ఒకవైపు ఉండి పోరాడాలంటూ సీఎం పిలుపునివ్వడం గమనార్హం.

చెప్పిందే... చెప్పారు.. వినలేక జనం వెనక్కి

నా అక్కలు, చెల్లెళ్లు, నా బీసీలు, ఎస్సీలు అంటూ సీఎం జగన్‌ ప్రభుత్వ పథకాల గురించి చెప్పిందే పదే పదే వల్లెవేశారు. సాయంత్రం 4:30 గంటలకు అని చెప్పి 5:53 గంటలకు సభకు హాజరయ్యారు. సభలో ప్రసంగిస్తూ నాడు-నేడు, విద్యా దీవెన, అమ్మఒడి పథకాల గురించే చెప్పినా, ప్రజల నుంచి స్పందన లేదు. సీఎం మాట్లాడిన ఐదు నిమిషాలకే ప్రజలు వెనుదిరిగారు. ఎమ్మిగనూరు, ఆదోని, ఆలూరు, పత్తికొండ, డోన్‌, కోడుమూరు, కర్నూలు, పాణ్యం, ఇతర ప్రాంతాల నుంచి 1,300 బస్సుల్లో ప్రజలను తరలించారు. ఎమ్మిగనూరు వీవర్స్‌ కాలనీ చేనేత మైదానంలో 6 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటుచేశారు. దీనికి ఇరువైపులా బారికేడ్లు కట్టి, బ్యానర్లు వేశారు. మధ్యలో ర్యాంప్‌ వేసి పెద్దఎత్తున జనం పోగైనట్లు చూపించారు. జగన్‌ ఏదో హామీ ఇస్తారని ఆశతో వచ్చి నిరాశతో వెళ్లిపోయారు.

పొంగిన పొరుగు మద్యం

జగన్‌ సభకు కర్ణాటక మద్యం ఏరులై పారింది. సభకు వచ్చినవారికి డబ్బులతో పాటు మద్యం, బిర్యానీ ప్యాకెట్లు అందించారు. పలువురు మద్యం దుకాణాల వద్ద తాగుతూ అక్కడే ఉండిపోయారు. సభస్థలానికి చాలామంది రాకపోవడంతో పాటు బస్సులోనే మద్యం తాగి ఊగుతూ ఎక్కడ పడితే అక్కడే ఉండిపోయారు. రూ.లక్షల విలువ చేసే కర్ణాటకకు చెందిన టెట్రా ప్యాకెట్లు అక్రమంగా కొనుగోలు చేసి పంపిణీ చేశారు. బహిరంగంగా తాగుతున్నా పోలీసులు చూసీచూడనట్లుగా వ్యవహరించారు.

అన్నీ అబద్ధాలే

  • ప్రసంగంలో పదే పదే ఆయా పథకాలకు సంబంధించిన డబ్బులు మీ ఖాతాల్లో వేశామంటూ చెప్పారు. గత ప్రభుత్వ ఆలోచనలతో రాష్ట్రంలో నూటికి 30 మంది ఆడపిల్లలు పదో తరగతి పూర్తిచేసే పరిస్థితి లేదని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో విద్యావ్యవస్థ గురించి 14 నిమిషాలు మాట్లాడారు. బాల్యవివాహాలు తగ్గాయని చెప్పినా, జిల్లాలో పశ్చిమ ప్రాంతంలోనే ఎక్కువగా బాల్య వివాహాలు జరుగుతున్నాయి. అక్కచెల్లెమ్మల పేరిట 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చామన్నారు, క్షేత్రస్థాయిలో కొండలు, గుట్టలే కనిపిస్తున్నాయి.
  • తాము మహిళలు, యువత సంక్షేమానికి ఎంతో పాటుపడ్డామని, మహిళల ఖాతాల్లో రూ.లక్షలకు లక్షలు కనిపిస్తాయని, మహిళలు తన ప్రభుత్వానికి రక్షాబంధన్‌ కట్టాలంటూ ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. కర్నూలు పశ్చిమ ప్రాంతంలో కరవు కారణంగా వేలమంది రైతులు వలసపోతున్నా.... తాను రైతులను గుండెల్లో పెట్టుకుని చూసుకున్నానంటూ ముఖ్యమంత్రి ప్రకటించడంపై పలువురు అసహనానికి లోనయ్యారు.
  • పదవులిచ్చినా పెత్తనం లేకుండా చేస్తున్నారని.. రిజర్వుడు నియోజకవర్గాల్లో పెద్దల ఆధిపత్యమే కొనసాగుతోందని.. నియోజకవర్గంలో తమకు విలువే లేకుండా పోతోందని వైకాపా దళిత ఎమ్మెల్యే ఆర్థర్‌ బహిరంగంగా ప్రకటించారు. అయినా ముఖ్యమంత్రి మాత్రం నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అంటూ వారికి అత్యధిక ప్రాధాన్యమిస్తున్నానని, 50% టికెట్లు వారికే ఇస్తున్నానని చెప్పడం గమనార్హం.

వినతిపత్రం ఇస్తామంటే ఈడ్చిపారేశారు

దళితులకు గతంలో అమలుచేసిన 27 పథకాలు రద్దుచేయడం, ఎస్సీ సబ్‌ప్లాన్‌ నిధులను పక్కదారి పట్టించడంపై సమతా సైనిక్‌దళ్‌ రాయలసీమ అధ్యక్షుడు రంగయ్య ముఖ్యమంత్రికి వినతిపత్రం ఇవ్వడానికి ప్రయత్నించారు. సంస్థ సభ్యులను తన ఇంటికి పిలిచి మాట్లాడారు. విషయం తెలుసుకున్న పోలీసులు వారిని గృహనిర్బంధం చేశారు. కమిటీ రోడ్డులో ఉన్న ఆయనతోపాటు మల్లేశ్‌, పరమేశ్‌, రాజోలప్ప తదితరులను గురువారం మధ్యాహ్నం రెండు గంటలకు మంత్రాలయం పోలీసుస్టేషన్‌కు తరలించారు. ఇదెక్కడి అన్యామని అడిగితే వారిని ఈడ్చిపారేశారు.దీంతో కొందరికి దెబ్బలు తగిలాయి. దీంతో వారు ‘సీఎం డౌన్‌డౌన్‌’ అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని