ఉన్నాడు.. ఊరికో జగన్‌!

ఆవు చేలో మేస్తే... దూడ గట్టున మేస్తుందా..? గత ప్రభుత్వ పథకాల్ని కొనసాగిస్తే.. ఎక్కడ వారికి పేరొస్తుందోనని.. అధికారంలోకి రాగానే వాటిని ఆపేశారు జగన్‌. తమ అధినేత స్ఫూర్తిగా జూనియర్‌ జగన్లూ ఊళ్లలో అదే తీరు ప్రదర్శిస్తున్నారు!

Updated : 30 Mar 2024 12:45 IST

అభివృద్ధి పనులు చేయరు!
ఎవరైనా చేస్తామని ముందుకొస్తే దాడులు
ఇదీ రాష్ట్రంలో వైకాపా నాయకుల తీరు
ఈనాడు - అమరావతి

ఆవు చేలో మేస్తే... దూడ గట్టున మేస్తుందా..? గత ప్రభుత్వ పథకాల్ని కొనసాగిస్తే.. ఎక్కడ వారికి పేరొస్తుందోనని.. అధికారంలోకి రాగానే వాటిని ఆపేశారు జగన్‌. తమ అధినేత స్ఫూర్తిగా జూనియర్‌ జగన్లూ ఊళ్లలో అదే తీరు ప్రదర్శిస్తున్నారు! దాహంతో అల్లాడే ప్రజలకు నీరందిస్తే.. వద్దంటారు. రోడ్లపైన గుంతల్ని పూడుస్తుంటే.. అడ్డుకుంటారు. సామాన్యులు తమ పని చేసుకుంటామన్నా.. నిలువరిస్తారు. పోనీ అవన్నీ వాళ్లయినా చేస్తారా అంటే.. అదీ చేతకాదు.

ప్రజావేదిక ధ్వంసంతో ప్రారంభమైన జగన్‌ ప్రభుత్వ ఏలుబడిలో అయిదేళ్లూ అరాచకమే నడిచింది. తమ అధినేత చూపిన విధ్వంస బాటలోనే ఆ పార్టీ నాయకులూ నడుస్తూ వచ్చారు. ‘రాష్ట్రాన్ని మేము అభివృద్ధి చేయం.. ఇతరులెవరైనా చేస్తే ఊరుకోం’ అంటూ ప్రతిపక్ష పార్టీల నేతలను బెదిరించి ఎక్కడికక్కడ వారిపై దౌర్జన్యాలకు దిగారు. పంచాయతీలకు కేంద్రం ఇచ్చిన ఆర్థిక సంఘం నిధులు మళ్లించి గ్రామీణాభివృద్ధికి జగన్‌ ప్రభుత్వం ద్రోహం చేసింది. అధ్వానమైన రహదారులు, మురుగు కాలువలు, తాగునీరు.. ఇలా అనేక సమస్యలతో ప్రజలను సీఎం జగన్‌ కష్టాల్లోకి నెట్టేశారు. వీరి బాధలు చూసిన ప్రతిపక్ష తెదేపా నేతలు, కొందరు వ్యక్తులు తమ సొంత నిధులతో పనులు చేసేందుకు ముందుకు వస్తే వైకాపా నేతలు అడ్డంకులు సృష్టించారు.

ప్రతిపక్షానికి ఉన్న బాధ్యతా లేకపోయే!

స్వప్రయోజనాల కోసం వైకాపా సర్కారు చూపించే శ్రద్ధ ప్రజా సమస్యల పరిష్కారంమీద కనబరచలేదు. ఫలితమే గ్రామాలూ, పట్టణాలనే వ్యత్యాసం లేకుండా ప్రతి చోటా ప్రజలు అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు. వేసవి ప్రారంభంతోనే ప్రజలు తాగునీటికి అల్లాడుతున్నారు. ‘బిందెడు నీళ్లు ఇప్పించండి మహా ప్రభో’ అంటూ ఖాళీ బిందెలతో మహిళలు రోడ్లపైకి వస్తున్నారు. వర్షాకాలం వచ్చిందంటే పాడైన కాలువలతో రోడ్లపైకి వచ్చే మరుగునీరు, వీటికి తోడు దోమల రొద, అనారోగ్య సమస్యలు.. కాలం ఏదైనా జగన్‌ జమానాలో జనాలకు కష్టకాలమే. ప్రజల అవస్థలు చూసిన ప్రతిపక్ష తెదేపా ఎమ్మెల్యేలు, ఎంపీలు, సర్పంచులు, కొంతమంది వ్యక్తులు సమస్యల పరిష్కారానికి ముందుకొస్తే.. ప్రభుత్వం చేయని పనులు చేస్తున్నందుకు అభినందించాల్సింది పోయి తిరిగి వారిపై దౌర్జన్యాలకు పాల్పడ్డారు  వైకాపా నేతలు. తెదేపాకి ఎక్కడ పేరొస్తుందోనని కొన్నిచోట్ల చేసిన పనులూ తొలగించి ప్రజలకు కష్టాలే మిగిల్చారు.

ఊరూరా అరాచకాలే!

రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్‌ ఎంపీ ల్యాడ్స్‌ నుంచి ఇచ్చిన రూ.5 లక్షల నిధులతో వైయస్‌ఆర్‌ జిల్లా బద్వేల్‌ మండలంలో చేపట్టిన ఆర్వో ప్లాంట్ల ఏర్పాటు పనులను వైకాపా మహిళా నేత ఇటీవల అడ్డుకున్నారు. ఐదు ఆర్వో ప్లాంట్ల నిర్మాణాన్ని అడ్డుకుని.. కట్టిన గోడలను కూల్చేశారు. పైగా తనపై దౌర్జన్యం చేశారని సేవ చేయటానికి వచ్చినవారిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్న స్థలాన్ని కబ్జా చేయడానికే మహిళా నేత ఈ దౌర్జన్యానికి పాల్పడ్డారు.

పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గం కొమడవోలు, చొదిమెళ్ల జగనన్న లేఅవుట్లలోని ఆరువేల ఇళ్ల పునాదుల్లో మెరక చేసేందుకు పేదలు దగ్గర్లోనే మట్టి తవ్వకాలు చేపట్టారు.

వీటికి కలెక్టర్‌ అనుమతిచ్చారు కూడా. అయినా ఆ తవ్వకాలను ఆపేయాల్సిందేనని వైకాపా నేతలు గొడవ చేశారు. ఒక్కో లారీ మట్టికి రూ.500 చొప్పున తమకు కప్పం కట్టాలని పట్టుబట్టారు.

  • శ్రీ సత్యసాయి జిల్లా లేపాక్షి మండలంలో వర్షాలకు దెబ్బతిన్న బయనపల్లి కల్వర్టుని తన సొంత నిధులతో హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ పునర్నిర్మించే పనులను వైకాపా నేతలు అడ్డుకున్నారు. తమ ఆధ్వర్యంలోనే కల్వర్టుని పునర్నిర్మిస్తామని అప్పటివరకు వేచి ఉండాల్సిందేనని పనులు చేయనివ్వలేదు.
  • ప్రకాశం జిల్లాలోని రావెళ్లవారిపాలెం కస్తూర్బా పాఠశాల అభివృద్ధి పనుల టెండర్‌ రాలేదన్న అక్కసుతో వైకాపా నాయకులు అడ్డంకులు సృష్టించారు. రూ.95 లక్షల పనులను పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రుల కమిటీ ఆధ్వర్యంలో చేయించాలని అధికారులు నిర్ణయించారు. పనుల కోసం ఒత్తిడి చేసిన వైకాపా నేతల పన్నాగం ఫలించకపోవడంతో అవరోధం కలిగించారు. మెటీరియల్‌ పాఠశాల వద్దకు రాకుండా రహదారిని తవ్వించేశారు. మరో రెండు చోట్ల రహదారులకు అడ్డంగా మట్టి కుప్పలు పోసి అడ్డంకులు సృష్టించారు.
  • సత్యసాయి జిల్లా ఉప్పరపల్లి ఎస్సీ కాలనీలో సిమెంట్‌ రహదారి ఏర్పాటుకు ఎమ్మెల్యే బాలకృష్ణ విజ్ఞప్తిపై లోక్‌సభ సభ్యుడు కేశినేని నాని ఎంపీ ల్యాడ్స్‌లో రూ.6.50 లక్షలు కేటాయించారు. రోడ్డు నిర్మాణం పూర్తయ్యాక మిగిలిన నిధులతో గుత్తేదారు నాయనపల్లి ఎస్సీ కాలనీ సప్లమ్మ దేవాలయం వద్ద సిమెంట్‌ రహదారి నిర్మాణం చేపట్టగా వైకాపా నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మా పాలనలో రోడ్డు వేయడానికి మీరెవరంటూ గుత్తేదారుని దూషించడంతో మనస్తాపానికి గురైన ఆయన వేసిన రోడ్డుని రోజుల వ్యవధిలో తొలగించారు.
  • అనంతపురం జిల్లా నుసికొట్టాలలో.. 9కి.మీ. రోడ్డు అధ్వానంగా ఉన్న విషయాన్ని గ్రామస్థులు తెదేపా నేత సురేంద్రబాబు దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన తన సొంత నిధులతో పొక్లెయినర్లతో ముళ్ల చెట్లను తొలగించి గుంతల్లో మట్టి వేయించారు. అధికారులను రంగంలోకి దించి వైకాపా నేతలు ఆ పనులకు ఆటంకం సృష్టించారు.
  • ప్రకాశం జిల్లా మారెళ్ల గ్రామ పంచాయతీలో వైకాపా నేతల నిర్వాకంతో అభివృద్ధి పనులకు గ్రహణం పట్టింది. పంచాయతీ నిధులతో సిమెంట్‌ రోడ్లు, కాలువలు నిర్మించేందుకు సర్పంచి చేసిన ప్రయత్నాలను వైకాపా నాయకులు ముందుకు సాగనివ్వలేదు. గ్రామంలో అంతర్గత రహదారుల నిర్మాణం అనివార్యమైనప్పటికీ వైకాపా నేతలు అవరోధాలు సృష్టించి గ్రామాభివృద్ధిని అడ్డుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని