సంక్షిప్త వార్తలు (6)

తిరుమల శ్రీవారిని గుజరాత్‌ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సి.మానవేంద్రనాథ్‌ రాయ్‌ శుక్రవారం ఉదయం వీఐపీ బ్రేక్‌ సమయంలో దర్శించుకున్నారు.

Updated : 30 Mar 2024 05:49 IST

శ్రీవారిని దర్శించుకున్న జస్టిస్‌ మానవేంద్రనాథ్‌ రాయ్‌

తిరుమల, న్యూస్‌టుడే: తిరుమల శ్రీవారిని గుజరాత్‌ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సి.మానవేంద్రనాథ్‌ రాయ్‌ శుక్రవారం ఉదయం వీఐపీ బ్రేక్‌ సమయంలో దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం, తితిదే అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు.


ఏపీ ఎన్జీఓ ఉద్యోగులతో ప్రభుత్వ సలహాదారు సమావేశాలు
సీఈఓకి ఆంధ్ర పెన్షనర్స్‌ పార్టీ ఫిర్యాదు

ఈనాడు, అమరావతి: ఏపీ ఎన్జీఓ ఉద్యోగులను ప్రభావితం చేసేలా ప్రభుత్వ సలహాదారు చంద్రశేఖరరెడ్డి సమావేశాలు నిర్వహిస్తున్నారని పేర్కొంటూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి(సీఈఓ)కి ఆంధ్ర పెన్షనర్స్‌ పార్టీ అధ్యక్షుడు సుబ్బరాయన్‌ శుక్రవారం ఫిర్యాదు చేశారు. ఏపీ ఎన్జీఓ నూతన కార్యవర్గాన్ని సన్మానించేందుకంటూ విశాఖపట్నం, విజయనగరం, విజయవాడల్లో ఈ సమావేశాలు నిర్వహించబోతున్నారని, ఓటర్లుగా ఉన్న ఉద్యోగులతో ప్రభుత్వ సలహాదారు సమావేశం కావడం ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించడమేనని పేర్కొన్నారు. శనివారం విజయనగరంలో సమావేశం ఉందని, దీనిని అడ్డుకోవాలని ఆయన సీఈఓను కోరారు. వైకాపాకు అనుకూలంగా ప్రచారం చేసే ఉద్దేశంతోనే ఆయన సమావేశాలు నిర్వహిస్తున్నారని వివరించారు.


ఏ ఐకాసలో చేరలేదు: సీపీఎస్‌ఈఏ

ఈనాడు, అమరావతి: ఏపీ సీపీఎస్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌(సీపీఎస్‌ఈఏ) ఏ ఐకాసలో చేరలేదని, అసత్య ప్రచారాలు నమ్మొద్దని ఆ అసోసియేషన్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కోరుకొండ సతీష్‌, సీఎం దాస్‌ ఓ ప్రకటనలో తెలిపారు. సీపీఎస్‌ ఉద్యోగుల పక్షాన పోరాటం చేస్తున్నామని, ఉద్యోగుల భవిష్యత్తే తమకుముఖ్యమని పేర్కొన్నారు. కొన్ని ఐకాసల్లో తాము చేరినట్లు వస్తున్న వార్తలను వారు ఖండించారు.


ఉపాధి కూలి రూ.600కు పెంచండి
వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్‌

ఈనాడు, అమరావతి: ఉపాధి హామీ పథకంలో పని దినాలను 200 రోజులకు పెంచాలని, కూలిని రూ.600 చేయాలని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు దడాల సుబ్బారావు, వెంకటేశ్వర్లు శుక్రవారం ఓ ప్రకటనలో డిమాండ్‌ చేశారు. ‘కేంద్ర ప్రభుత్వం ఉపాధి కూలిని రూ.27 పెంచి, మొత్తంగా రూ.300 చేసింది. ఇది ఏ మాత్రం సరిపోదు. గత పదేళ్లలో నిత్యావసర సరకుల ధరలు భారీగా పెరిగాయి. కనీస వేతనాలపై కేంద్ర ప్రభుత్వం నియమించిన అనూప్‌ సత్పతి కమిటీ కూడా రోజుకు రూ.375కు తక్కువ కాకుండా కూలి ఇవ్వాలని సూచించింది. మరోవైపు కార్పొరేట్‌ శక్తుల ఒత్తిడి మేరకు ఏటా ఈ పథకానికి నిధులు తగ్గిస్తున్నారు’ అని వారు విమర్శించారు.


జీపీఎఫ్‌ డబ్బుల కోసం ప్రాధేయపడాల్సి వస్తోంది
సచివాలయ ఉద్యోగుల సంఘం నేత నాపా ప్రసాద్‌

ఈనాడు, అమరావతి: ప్రభుత్వ ఉద్యోగుల జీపీఎఫ్‌కు ధర్మకర్తగా ఉండాల్సిన ప్రభుత్వం ఆ ధర్మకర్త లక్షణాన్నే కోల్పోయిందని, ఇంత దారుణమైన పరిస్థితి వస్తుందని ఏ ఉద్యోగీ ఊహించి ఉండరని ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం మాజీ ప్రధాన కార్యదర్శి నాపా ప్రసాద్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ‘గతేడాది జులై నుంచి కొత్త పీఆర్సీ అమలు కావాల్సి ఉంది. పీఆర్సీ ఆలస్యమైనందున మధ్యంతర భృతి (ఐఆర్‌) ప్రకటన కోసం ఉద్యోగులు ఎదురుచూడడం సాధారణం. కానీ, ఇప్పుడు ఐఆర్‌ గురించి కాకుండా ఉద్యోగులు కుటుంబ అవసరాల కోసం దాచుకున్న జీపీఎఫ్‌, ఏపీజీఎల్‌ఐ సొమ్ముల కోసం ప్రభుత్వాన్ని ప్రాధేయపడాల్సిన పరిస్థితి నెలకొంది’ అని పేర్కొన్నారు.


‘మద్య నియంత్రణ’పై 2న రౌండ్‌టేబుల్‌ సమావేశం  

ఈనాడు డిజిటల్‌, అమరావతి: సిటిజన్స్‌ ఫర్‌ డెమోక్రసీ (సీఎఫ్‌డీ) ఆధ్వర్యంలో ‘మద్య నియంత్రణ’ అంశంపై వచ్చేనెల 2న విజయవాడలోని బాలోత్సవ భవన్‌లో రౌండ్‌టేబుల్‌ సమావేశం జరగనుంది. ఆంధ్రప్రదేశ్‌ మద్యాంధ్రప్రదేశ్‌గా మారుతున్న తరుణంలో దీని నియంత్రణ ఆవశ్యకతను అన్ని రాజకీయ పార్టీలు వారి ఎన్నికల ప్రణాళికల్లో పొందుపర్చాలని సీఎఫ్‌డీ సంయుక్త కార్యదర్శి వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో కోరారు. ఈ సమావేశంలో పలు పార్టీలకు చెందిన మహిళా ప్రజాప్రతినిధులు, పౌర సంస్థలు, ప్రజాసంఘాలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొంటారని ఆయన పేర్కొన్నారు. సమాజంలో హత్యలు, అత్యాచారాలు, రోడ్డు ప్రమాదాలు, గృహహింస, అనారోగ్యాలకు కేంద్ర బిందువైన మద్యాన్ని, మత్తు పానీయాలను నిరోధించాలని డిమాండ్‌ చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు