41ఏ నోటీసు ఇచ్చినా.. ముందస్తు బెయిలు పిటిషన్‌ విచారణార్హమే

విచారణ నిమిత్తం తమ ముందు హాజరు కావాలని సీఆర్‌పీసీ సెక్షన్‌ 41ఏ కింద నిందితులకు పోలీసులు నోటీసులు జారీ చేశాక ముందస్తు బెయిలు పిటిషన్‌కు విచారణార్హత ఉండదని చెప్పడానికి వీల్లేదని హైకోర్టు స్పష్టం చేసింది.

Updated : 30 Mar 2024 05:48 IST

కీలక ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు

ఈనాడు, అమరావతి: విచారణ నిమిత్తం తమ ముందు హాజరు కావాలని సీఆర్‌పీసీ సెక్షన్‌ 41ఏ కింద నిందితులకు పోలీసులు నోటీసులు జారీ చేశాక ముందస్తు బెయిలు పిటిషన్‌కు విచారణార్హత ఉండదని చెప్పడానికి వీల్లేదని హైకోర్టు స్పష్టం చేసింది. 41ఏ నోటీసు ఇచ్చినా.. అరెస్టు ఆందోళన ఉంటుందని, ఇలాంటి పరిస్థితుల్లో ముందస్తు బెయిలు కోసం దాఖలు చేసిన పిటిషన్లను విచారించకుండా న్యాయస్థానాలు తోసిపుచ్చడానికి వీల్లేదని కర్ణాటక హైకోర్టు ‘రామప్ప’ కేసులో తీర్పు ఇచ్చిన విషయాన్ని గుర్తుచేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ టి.మల్లికార్జునరావు ఇటీవల ఈ మేరకు కీలక ఉత్తర్వులిచ్చారు.

కొంతమంది ఫేస్‌బుక్‌ నకిలీ ఐడీలను సృష్టించి షర్మిల, సునీతలను అపకీర్తి పాలు చేయడంతోపాటు దూషిస్తూ పోస్టులు పెట్టారని వి.రవీంద్రారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పులివెందుల పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో నిందితుడుగా ఉన్న విశాఖపట్నానికి చెందిన పినపల ఉదయ్‌భూషణ్‌ ముందస్తు బెయిలు కోసం హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఏపీపీ వాదనలు వినిపిస్తూ.. విచారణ నిమిత్తం హాజరుకావాలని పిటిషనర్‌కు 41ఏ నోటీసు ఇచ్చామన్నారు. ఈ నేపథ్యంలో ముందస్తు బెయిలు మంజూరు చేయాల్సిన అవసరం లేదన్నారు. పిటిషనర్‌ తరఫు న్యాయవాది పీవీజీ ఉమేశ్‌చంద్ర వాదనలు వినిపిస్తూ.. విశాఖపట్నంలో ఉన్న పిటిషనర్‌కు పోలీసులు 41ఏ నోటీసు ఇచ్చే అవకాశం ఉన్నా.. వేధించాలన్న ఉద్దేశంతో పులివెందుల ఠాణాకు తీసుకెళ్లి, అక్కడ నిర్బంధించారన్నారు. ఫిర్యాదుదారుడు వి.రవీంద్రారెడ్డి పిటిషనర్‌ను హతమారుస్తామని ఠాణాలో బెదిరించారన్నారు. ఈ నేపథ్యంలో పిటిషనర్‌ పులివెందుల ఠాణాకెళ్లి దర్యాప్తు అధికారి ముందు హాజరు కాలేరన్నారు. 41ఏ నోటీసు ఇచ్చినప్పటికీ.. అరెస్టు గురించి ఆందోళన ఉందన్నారు. కర్ణాటక హైకోర్టు తీర్పును న్యాయమూర్తి దృష్టికి తీసుకొచ్చారు. దీంతో పిటిషనర్‌కు న్యాయమూర్తి షరతులతో ముందస్తు బెయిలు మంజూరు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని