మధ్యాహ్న భోజనం గుడ్ల బిల్లులు 5 నెలలుగా పెండింగ్‌

‘విద్యపై ఖర్చు చేసే ప్రతి పైసా పెట్టుబడిగా భావిస్తాను.. మధ్యాహ్న భోజన పథకాన్ని నేనే స్వయంగా పరిశీలిస్తున్నా. ఈ పథకం బిల్లులను గ్రీన్‌ఛానల్‌లో పెట్టండి’.. అంటూ సీఎం జగన్‌ చెప్పే మాటలకు చేసే పనులకు ఎక్కడా సంబంధం లేదు.

Updated : 30 Mar 2024 05:45 IST

ఈనాడు, అమరావతి: ‘విద్యపై ఖర్చు చేసే ప్రతి పైసా పెట్టుబడిగా భావిస్తాను.. మధ్యాహ్న భోజన పథకాన్ని నేనే స్వయంగా పరిశీలిస్తున్నా. ఈ పథకం బిల్లులను గ్రీన్‌ఛానల్‌లో పెట్టండి’.. అంటూ సీఎం జగన్‌ చెప్పే మాటలకు చేసే పనులకు ఎక్కడా సంబంధం లేదు. నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ అంటూ ప్రతి సభలోనూ ఊదరగొట్టే జగన్‌.. వారు చదువుతున్న బడులకు కోడిగుడ్లు సరఫరా చేసిన వారికి 5 నెలలుగా బిల్లులివ్వడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా 44,141 ప్రభుత్వ పాఠశాలల్లో 33,77,488 మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో వారానికి 5 కోడిగుడ్ల చొప్పున అందిస్తున్నారు. చిత్తూరు, తిరుపతి, నెల్లూరులాంటి చోట్ల పౌల్ట్రీ రైతులే కొంతమంది కలిసి టెండర్లు దక్కించుకున్నారు. ప్రభుత్వం సకాలంలో బిల్లులు ఇవ్వకపోవడంతో ఇలాంటివారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిరుడు అక్టోబరు నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు కోడిగుడ్ల గుత్తేదార్లకు రూ.136.57 కోట్ల బిల్లులు చెల్లించాల్సి ఉంది. మార్చి నెల కూడా పూర్తయితే బకాయి రూ.163.55 కోట్లకు పెరుగుతుంది. గుత్తేదార్లకు బిల్లులు ఇవ్వకపోవడంతో వారు పౌల్ట్రీ యజమానులకు డబ్బులు చెల్లించడం లేదు. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని