అప్పు కోసం మచిలీపట్నం పోర్టు భూములు తాకట్టు!

ఏపీ మారిటైం బోర్డు పేరుతో మరో రూ.3,900 కోట్ల మేర కొత్త అప్పులు తేవడానికి రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తమైంది. దీనికి సంబంధించిన దస్త్రాలు వేగంగా కదులుతున్నాయి.

Published : 30 Mar 2024 04:08 IST

పీఎఫ్‌సీ నుంచి రూ.3,900 కోట్ల అప్పు కోసం ప్రతిపాదన

ఈనాడు, అమరావతి: ఏపీ మారిటైం బోర్డు పేరుతో మరో రూ.3,900 కోట్ల మేర కొత్త అప్పులు తేవడానికి రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తమైంది. దీనికి సంబంధించిన దస్త్రాలు వేగంగా కదులుతున్నాయి. మచిలీపట్నం పోర్టు కోసం 1,688 ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రభుత్వం కేటాయించింది. ఈ భూమిని తాకట్టు పెట్టి కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ (పీఎఫ్‌సీ) నుంచి రుణాన్ని తీసుకురాబోతోంది. పోర్టు భూములను తాకట్టు పెట్టడానికి వీలుగా అవసరమైన ఉత్తర్వులు ఇవ్వాలంటూ రెవెన్యూ అధికారులపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది.

లీజుకు ఇస్తే.. తాకట్టు పెట్టేస్తున్నారు

ప్రాజెక్టు పేరుతో భూములు తీసుకోవడం.. వాటినే తాకట్టుపెట్టి రుణాలు పొందడం సీఎం జగన్‌కు వెన్నతోపెట్టిన విద్యగా మారింది. ఈ కోవలోనే ఆరు నెలల కిందట మచిలీపట్నం పోర్టు అభివృద్ధికి ప్రభుత్వ భూములను కేటాయించింది. భూముల బదలాయింపు పూర్తయిన మరుక్షణం హడావుడిగా రుణాలు తేవడానికి ప్రయత్నాలు మొదలు పెట్టింది. పోర్టు అభివృద్ధి కోసం అవసరమైన రెవెన్యూ భూములను పరిశ్రమలు, మౌలిక సదుపాయాల కల్పనా శాఖకు బదిలీ చేస్తూ రెవెన్యూశాఖ 2023 సెప్టెంబరు 15న ఉత్తర్వులు ఇచ్చింది. ఆ భూములను మార్టిగేజ్‌ చేయడానికి వీలు లేదన్న నిబంధనను రెవెన్యూశాఖ ఉత్తర్వుల్లో ప్రస్తావించింది. ఆ భూముల్లో పోర్టు నిర్మాణానికి అనుమతిస్తూ ఏపీ మారిటైం బోర్డుకు పరిశ్రమలశాఖ లీజు ప్రాతిపదికన బదిలీ చేసింది. మచిలీపట్నం పోర్టు అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన మచిలీపట్నం పోర్టు డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(ఎంపీడీసీఎల్‌)కు ఆ భూములను మారిటైం బోర్డు బదిలీ చేసింది. రెవెన్యూశాఖ నిబంధనల ప్రకారం భూములను లీజు ప్రాతిపదికన ఇచ్చినప్పుడు.. వాటిపై రుణాలు తీసుకోవడం సాధ్యం కాదు. కానీ నిబంధనలను పక్కకునెట్టి రుణాన్ని తేవడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని