కొత్త ప్రభుత్వానికి అప్పుల గుదిబండ!

అప్పుల సర్కార్‌గా పేరు తెచ్చుకున్న జగన్‌ ప్రభుత్వం ఎన్నికల ముంగిట్లో భారీ అప్పుల పందేరానికి తెరతీసింది. ఎన్నికల కోడ్‌ ఉండగా హడావుడిగా కేంద్రం నుంచి అప్పుల సమీకరణకు అనుమతులు తీసుకుంది.

Updated : 30 Mar 2024 04:47 IST

జూన్‌ 4 లోపు రూ.20,000 కోట్ల రుణానికి ప్రణాళిక

ఈనాడు, అమరావతి: అప్పుల సర్కార్‌గా పేరు తెచ్చుకున్న జగన్‌ ప్రభుత్వం ఎన్నికల ముంగిట్లో భారీ అప్పుల పందేరానికి తెరతీసింది. ఎన్నికల కోడ్‌ ఉండగా హడావుడిగా కేంద్రం నుంచి అప్పుల సమీకరణకు అనుమతులు తీసుకుంది. ఎన్నికల కోడ్‌ వచ్చిన తర్వాత ఏ ప్రభుత్వమూ కీలక నిర్ణయాలు తీసుకోకూడదు. అలాంటిది ఏప్రిల్‌, మే నెలలతో పాటు జూన్‌ 4 వరకు ఏకంగా రూ.20,000 కోట్ల బహిరంగ రుణం తీసుకునేందుకు సిద్ధమైంది. ఇంత అప్పు కావాలంటూ రిజర్వుబ్యాంకుకు ఈ పాటికే వర్తమానం పంపింది. ఏడాది మొత్తానికి తీసుకోవాల్సిన అప్పుల్లో మూడోవంతు అప్పు మొదటి రెండు నెలల్లోనే తీసుకుని కొత్త ప్రభుత్వం నెత్తిన శఠగోపం పెట్టబోతున్నారు. ఎన్నికలు పూర్తయి, ఫలితాలు వెలువడే వరకూ అధికారంలోకి ఎవరు వస్తారో తెలియదు. అయినా ఏప్రిల్‌, మే నెల్లోనే రూ.20వేల కోట్ల అప్పులు తీసుకోవాలని నిర్ణయం తీసుకోవడం వివాదమవుతోంది.

సాధారణంగా కొత్త ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ఆర్థికశాఖ అప్పులకు అనుమతులు ఇచ్చేందుకు సమయం పడుతుంది. దాదాపు ఏప్రిల్‌ మూడో వారానికి రాష్ట్ర నికర రుణపరిమితి తేల్చి, వచ్చే ఆర్థిక సంవత్సరం మొత్తానికి ఎంత రుణం ఇవ్వనున్నదీ తేల్చిచెబుతుంది. ఆ మేరకు తొలి 9 నెలల్లో ఎంత తీసుకోవచ్చో.. ఆ మేరకు అనుమతి ఇస్తుంది. అయితే నెలకు ఇంతే తీసుకోవాలనే పరిమితి విధించదు. గతేడాది రుణాల అనుమతులు రావడానికి ఏప్రిల్‌లో చాలా ఆలస్యమయింది. జీతాల చెల్లింపులకూ ఇబ్బందులు ఎదురయ్యాయి. దాంతో ఈసారి ముందే స్పందించారు. కానీ, వచ్చే ప్రభుత్వం పొందాల్సిన అప్పుల్లో సింహభాగం ముందే తీసుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలే ఆందోళన కలిగిస్తున్నాయి. ఏప్రిల్‌ 2న రూ.4,000 కోట్ల రుణం పొందేందుకు కేంద్రం నుంచి ఆర్థికశాఖ అధికారులు ఇప్పటికే అనుమతులు తీసుకున్నారు.

రూ.50,000 కోట్ల వరకు...

రాష్ట్ర స్థూల ఉత్పత్తి విలువలో 3.5% మొత్తానికి కేంద్రం ప్రతి ఏటా రుణాలు తీసుకునేందుకు రాష్ట్రాలకు అనుమతి ఇస్తుంది. విద్యుత్తు సంస్కరణలు, ఇతర రూపేణా మరో 0.5% వరకు అనుమతులు ఇస్తోంది. ఈ నికర రుణపరిమితి లెక్క తేల్చే క్రమంలో ఇతరత్రా రూపాల్లో తీసుకునే మొత్తాలు మినహాయిస్తుంది. గతంలో అదనంగా పొందిన అప్పుల మొత్తాలను ఏడాదికి ఇంత చొప్పున మినహాయిస్తోంది. కార్పొరేషన్ల నుంచి తీసుకున్న రుణాలు ఇందులో కలపాలి. అన్ని రుణాలు కలిపే నికర రుణపరిమితి అవుతుందని రిజర్వుబ్యాంకు, ఆర్థిక సంఘం గతంలోనే తేల్చిచెప్పాయి. కార్పొరేషన్ల నుంచి పెద్ద మొత్తంలో రుణాలు తీసుకుంటున్నా అవి ఇందులో కలిపి లెక్కిస్తున్న దాఖలాలు లేవు. కొత్త ఆర్థిక సంవత్సరంలో ఎంత లేదన్నా సుమారు రూ.50వేల కోట్ల వరకు కొత్త అప్పులకు అనుమతులు రావచ్చనే అంచనాలు ఉన్నాయి. కేంద్ర ఆర్థికశాఖ ఎంతవరకు అనుమతి ఇచ్చిందన్నది ఇంకా తేలలేదు.

ఎన్నికలపై పరోక్ష ప్రభావం

అనేక ప్రభుత్వ పథకాలను ఎన్నికల కోడ్‌ వచ్చేలోపే ప్రభుత్వం అమలుచేయాలి. ఆలోపు బటన్‌ నొక్కి పథకాలు అమలుచేసినట్లు చూపినా అనేక మందికి ఆ మొత్తాలు ఇంకా అందలేదు. ఏప్రిల్‌ నెలాఖరు వరకు ఈ డబ్బులు అందజేసేలా అధికారపార్టీ ప్రణాళిక రూపొందించుకున్నట్లు తెలుస్తోంది. ఈ రుణాల్లో కొంతమొత్తం లబ్ధిదారులకు చేరవేసి, పరోక్షంగా ఎన్నికల్లో లబ్ధి పొందేలా వ్యూహం రూపొందించినట్లు కనిపిస్తోంది. దీంతో పాటు అధికారపార్టీ అనుయాయులకు బిల్లులు చెల్లించి, ఆ సొమ్మును ఎన్నికల్లోకి ప్రవహింపజేసే వ్యూహమూ అమలు చేయబోతున్నారనే విమర్శలు ఉన్నాయి. కేంద్ర ఆర్థికశాఖ రుణాలకు అనుమతులు ఇచ్చినా ఎన్నికల నేపథ్యంలో ఒకేసారి రూ.20 వేల కోట్ల రుణాలకు అనుమతించకుండా నెలవారీ పరిమితులు విధించాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని