సర్వీస్‌ ఛార్జీ చెల్లించలేదని వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్ల తొలగింపు

వైకాపా ప్రభుత్వం ఎక్కడ చూసినా వ్యవసాయానికి నాణ్యమైన, ఉచిత విద్యుత్తు అందిస్తున్నామని గొప్పలు చెబుతోంది.

Published : 30 Mar 2024 04:34 IST

శ్రీసత్యసాయి జిల్లాలో విద్యుత్తుశాఖ చర్య

ఆత్మకూరు, న్యూస్‌టుడే: వైకాపా ప్రభుత్వం ఎక్కడ చూసినా వ్యవసాయానికి నాణ్యమైన, ఉచిత విద్యుత్తు అందిస్తున్నామని గొప్పలు చెబుతోంది. లోవోల్టేజీ సమస్యపై స్పందించని అధికారులు.. విద్యుత్తు సర్వీసు ఛార్జీల బకాయిల విషయంలో తీవ్రంగా స్పందిస్తున్నారు. శ్రీసత్యసాయి జిల్లా ఆత్మకూరు మండలం దేవునికుంట తండాలో నాలుగు విద్యుత్తు ట్రాన్స్‌ఫార్మర్లకు ఫ్యూజులు తొలగించారు. రైతులు చాలాకాలం నుంచి సర్వీసు ఛార్జీలు చెల్లించలేదు. అధికారులు ఉన్నపళంగా చెల్లించాలని ఒత్తిడి తేవడంతో త్వరలోనే చెల్లిస్తామన్నారు. అయినా వినకుండా ఫ్యూజులు తొలగించారు. ఈ ట్రాన్స్‌ఫార్మర్ల కింద ప్రస్తుతం రైతులు పంటలు సాగు చేయకపోవడంతో సమస్య తగ్గింది. ఈ విషయంపై విద్యుత్తు ఏఈ దాసు వివరణ కోరగా ఒక్కో విద్యుత్తు ట్రాన్స్‌ఫార్మర్‌ కింద రూ.4వేల వరకూ సర్వీసు ఛార్జీల బకాయిలు ఉన్నాయని చెప్పారు. పలుమార్లు రైతులకు సూచించామని.. పై నుంచి ఒత్తిడి ఉండటంతోనే కనెక్షన్‌ తొలగించామన్నారు. రైతులు చెల్లించగానే తిరిగి ఇస్తామని తెలిపారు. ఆత్మకూరు మండలవ్యాప్తంగా 5,500పైగా వ్యవసాయ కనెక్షన్లు ఉండగా రూ.20 లక్షల వరకూ ఇలా పెండింగ్‌ ఉన్నట్లు పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని