అవ్వాతాతలకు టోకరా!

విద్యార్థులు, యువత, నిరుద్యోగులు, ఉద్యోగులు.. రైతులు, మహిళలు ఇలా... జగన్‌ నమ్మించి మోసం చేయని వర్గమంటూ మిగల్లేదు. ఆఖరికి వృద్ధులకూ నిరాశే మిగిల్చారు...!

Published : 30 Mar 2024 04:35 IST

పండుటాకులపై దయ చూపని జగన్‌
మండలానికో వృద్ధాశ్రమం ఏర్పాటుకు హామీ
ఐదేళ్లలో ఒక్కటంటే ఒక్కటీ కట్టలేదు
ప్రతిపక్ష నేతగా చెప్పిన మాటలన్నీ పచ్చి అబద్ధాలే
ఈనాడు, అమరావతి

విద్యార్థులు, యువత, నిరుద్యోగులు, ఉద్యోగులు.. రైతులు, మహిళలు ఇలా... జగన్‌ నమ్మించి మోసం చేయని వర్గమంటూ మిగల్లేదు. ఆఖరికి వృద్ధులకూ నిరాశే మిగిల్చారు...!
ప్రతిపక్షనేతగా పాదయాత్ర సందర్భంగా... అవ్వాతాతల కోసం మండలానికో వృద్ధాశ్రమం ప్రారంభిస్తానని మాటిచ్చారు... ఐదేళ్లలో ఒక్కటీ ఏర్పాటు చేయలేదు... ఇప్పుడు రెండోసారి అధికారం కావాలంటూ... మళ్లీ బస్సుయాత్రకు బయలుదేరారు...!!


చేసేదే చెబుతా? చెప్పింది తప్పకుండా చేస్తా. మాటిచ్చానంటే ఇక మడమ తిప్పడమనేదే ఉండదు’’... అంటూ జగన్‌ పదేపదే వల్లెవేస్తారు. ఇవన్నీ పచ్చి అబద్ధాలని ఆయన ఐదేళ్ల పాలన రుజువు చేసింది. గత ఎన్నికల ముందు ప్రతిపక్ష నేతగా ‘ప్రజా సంకల్పయాత్ర’లో అడుగడుగునా అసత్యాలనే ప్రజలపై కుమ్మరించారు. ఎలాగైనా సరే ముఖ్యమంత్రి పీఠం ఎక్కాలనే కుయుక్తితో ప్రజల్ని మాయచేశారు. వృద్ధుల కష్టాలు చూసి ఎంతో చలించిపోయినట్లు గొప్పగా నటించారు. వారిపై అపారమైన ప్రేమను ఒలకబోశారు. మండలానికో వృద్ధాశ్రమాన్ని ఏర్పాటు చేస్తానని మాటిచ్చారు. ప్రతిపక్షనేతగా    ఇడుపులపాయ నుంచి పాదయాత్ర ప్రారంభించిన రెండో రోజైన 2017 నవంబరు 7న ‘‘వైకాపా అధికారంలోకి వచ్చిన వెంటనే ఎలాంటి ఆసరా లేని వృద్ధుల కోసం మండలానికి ఒకటి చొప్పున వృద్ధాశ్రమాన్ని ఏర్పాటు చేస్తాం. అందులో వైద్యులు, సిబ్బందిని కూడా నియమిస్తాం. జీవిత చరమాంకంలో ఉన్న వారికి అండగా ఉంటాం’’ అని గొప్పగా ప్రకటించారు. మాటలైతే తియ్యగానే చెప్పారు. పాదయాత్రను ముగించారు. కావాలనుకున్న అధికారమూ వచ్చింది. ముఖ్యమంత్రి పీఠంపై ఆసీనులై ఐదేళ్లు అధికారం అనుభవించారు. కానీ, ఆనాడు చెప్పిన మాటలను మరచిపోయారు. వృద్ధాశ్రమాల ఏర్పాటు ఊసే లేదు. మండలానికి ఒకటి కాదుకదా... రాష్ట్రవ్యాప్తంగానైనా ఒక్కటంటే ఒక్కదాన్నీ కట్టిందే లేదు. ఆయన హామీలన్నీ ఓట్ల కోసమే తప్ప ఆచరణ కోసం కాదని.. చెప్పడానికి   ఇదో చిక్కటి నిదర్శనం.


కేంద్రం గ్రాంటుతో నడుస్తున్నవి 68

రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సాయంతో స్వచ్ఛంద సేవా సంస్థల ఆధ్వర్యంలో నడుస్తున్న వృద్ధాశ్రమాలు 68 ఉన్నాయి. వృద్ధుల సంఖ్యకు అనుగుణంగా వీటికి కేంద్రమే గ్రాంటును విడుదల చేస్తుంది. వీటికి అదనంగా మచిలీపట్నం, చిత్తూరులలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో మరో రెండు వృద్ధాశ్రమాలు నడుస్తున్నాయి. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి రాకమునుపు నుంచే ఇవి కొనసాగుతున్నాయి. వీటికి అదనంగా ప్రతిపక్ష నేతగా జగన్‌ మండలానికి ఒకటి నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఆ ప్రకారం రాష్ట్రంలోని 660 మండలాలకు 660 వృద్ధాశ్రమాలు రావాలి. ఐదేళ్ల పాలన     పూర్తవుతున్నా, ఒక్కటీ ఏర్పాటు కాలేదు.


ప్రైవేటువి వందల్లోనే...

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో కాకుండా రాష్ట్రంలో ఇతర సంస్థల నేతృత్వంలో వందకుపైనే వృద్ధాశ్రమాలు కొనసాగుతున్నాయి. అత్యధికంగా కృష్ణా, ఎన్టీఆర్‌ జిల్లాల్లో 18 ఉన్నాయి. ప్రైవేటు వ్యక్తుల్లో కొందరు ఉచితంగా నడుపుతుండగా మరికొందరు డబ్బు తీసుకుంటూ కొనసాగిస్తున్నారు. ప్రైవేటు కేంద్రాలే ఇన్ని నడుస్తున్నాయంటే కచ్చితంగా వాటి అవసరం ఉన్నట్లే కదా? అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, ఏలూరు, ఎన్టీఆర్‌ జిల్లాల్లో ప్రభుత్వ    ఆధ్వర్యంలో నడిచే వృద్ధాశ్రమాలు లేవు. మండలానికి ఒకటి ఏర్పాటు దేవుడెరుగు.. కనీసం ఈ జిల్లాల్లో అయినా అందుబాటులోకి తీసుకురావాలనే ఆలోచన చేశారా? అంటే అదీ లేదు. ఈ ఐదు జిల్లాల్లో 150 మంది చొప్పున ఉండేలా వృద్ధాశ్రమాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలనే ప్రతిపాదన ఏడాదిగా ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉంది. ఈ దస్త్రాన్ని ముందుకు   తీసుకెళ్లేందుకు జగన్‌ కనీస ప్రయత్నం చేయలేదు.


రాష్ట్ట్ర్రంలో ఒంటరి వృద్ధులు అధికం

రాష్ట్రం నుంచి ఉపాధి, ఉద్యోగాలు, ఉన్నత చదువుల కోసం యువత ఇతర రాష్ట్రాలు, విదేశాలకు వెళ్లడం అధికం. ఈ కారణంగా ప్రతి గ్రామంలో ఒంటరి తల్లిదండ్రులు ఉంటున్నారు. వీరిలో ఒంటరి వృద్ధుల సంఖ్య ఎక్కువే. కొన్ని గ్రామాల్లో 20-40 ఏళ్ల మధ్య ఉండే యువతే కనిపించదంటే అతిశయోక్తి కాదు. అంతేకాకుండా.. ఏ ఆదరవూ లేని వారు.. బిడ్డలు పట్టించుకోని వారూ చాలామందే ఉన్నారు. ఇలాంటి వారు జగన్‌ మాటల్ని నమ్మి మోసపోయారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని