అన్నతంత్రం.. కుదేలైన యంత్రం

సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు (ఎంఎస్‌ఎంఈ) రాయితీ ధరకు విద్యుత్‌ అందించడంతోపాటు తక్కువ వడ్డీకి రుణాలు ఇవ్వగలిగితేనే ఈ పోటీ ప్రపంచంలో అవి నిలదొక్కుకునే అవకాశం ఉంటుంది.

Updated : 30 Mar 2024 05:36 IST

ఐదేళ్లలో పారిశ్రామిక రంగం తిరోగమనం
వైకాపా సర్కారు వడ్డింపులతో 40 శాతం పెరిగిన ఉత్పత్తి వ్యయం
జగన్‌ దెబ్బకు లబోదిబోమంటున్న పారిశ్రామికవేత్తలు
రెండేళ్లుగా రాయితీలూ ఎగ్గొట్టిన ప్రభుత్వం
పరిశ్రమల భూములనూ 50 శాతం లాక్కునేలా ఉత్తర్వులు
ఈనాడు, అమరావతి


ప్రభుత్వమేదైనా.. పాలకులెవరైనా..
పారిశ్రామికవేత్తలను రా.. రమ్మంటారు..
రాయితీలు, ప్రోత్సాహకాలు ఇస్తామంటారు..
కానీ, ‘ఊరందరిదో దారి..’ అన్నట్లుంది వైకాపా సర్కారు తీరు..
పరిశ్రమలకు విద్యుత్‌ ఛార్జీలు పెంచుతారు..
ట్రూఅప్‌ లేదా సర్దుబాటు పేరిట భారం వేస్తారు..
లైసెన్సు ఫీజులు పెంచుతారు..
ఆస్తి పన్నులోనూ దండుకుంటారు..
జీవో ఎప్పుడిచ్చినా..
సారు గద్దెనెక్కిన నాటి నుంచి పన్ను కట్టాలట..
ఇక్కడ ఇంకో ఆప్షన్‌ కూడా ఉందండోయ్‌..
పన్నులు కట్టలేకపోతే సగం భూములను తిరిగిచ్చేయాలట..
దీంతో ‘నీకో నమస్కారం.. నీ బాదుడుకో నమస్కారం’ అంటూ..
పారిశ్రామికవేత్తలంతా తిరిగి చూడకుండా పలాయనం చిత్తగించారు!


రాయితీ అంటూనే..

సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు (ఎంఎస్‌ఎంఈ) రాయితీ ధరకు విద్యుత్‌ అందించడంతోపాటు తక్కువ వడ్డీకి రుణాలు ఇవ్వగలిగితేనే ఈ పోటీ ప్రపంచంలో అవి నిలదొక్కుకునే అవకాశం ఉంటుంది. దీనికోసం కేంద్రంతో సంప్రదించి ప్రత్యేక విధానాన్ని రూపొందించాలి.

తాడేపల్లిలోకి క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్షలో సీఎం జగన్‌ వ్యాఖ్యలివి.


ఈ మాటలు విన్న ఎవరికైనా ఏమనిపిస్తుంది? చిన్న పరిశ్రమలపై సీఎం జగన్‌కు ఎనలేని ప్రేమ ఉందనే అనిపిస్తుంది. కానీ, ఆయన చేతలు మాత్రం భిన్నం. కొవిడ్‌ దెబ్బ నుంచి కోలుకునేలా రాయితీలు ఇవ్వకపోగా.. విద్యుత్‌ ఛార్జీల భారం మోపారు. గతంలో వాణిజ్య, పారిశ్రామిక విద్యుత్‌ వినియోగదారుల నుంచి యూనిట్‌కు  6 పైసల చొప్పున సుంకం వసూలు చేసేవారు. కానీ, జగన్‌ సర్కారు ఈ మొత్తాన్ని రూపాయికి పెంచుతూ(1,667 శాతం) 2022 ఏప్రిల్‌లో ఉత్తర్వులు ఇచ్చింది. దక్షిణాది రాష్ట్రాల్లో అత్యధికంగా యూనిట్‌కు 47 పైసలు వసూలు చేసే కర్ణాటకను మించిపోయాం.   తెలంగాణలో 6 పైసలు, కేరళలో 10 పైసలు, తమిళనాడులో 36 పైసల వంతున అక్కడి డిస్కంలు వసూలు చేస్తుండటం గమనార్హం. ట్రూఅప్‌, ఇంధన సర్దుబాటు ఛార్జీలు(ఎఫ్‌పీపీసీఏ), సుంకం ఇలా మొత్తం కలిపి పరిశ్రమలపై ఏటా సుమారు రూ.2,600 కోట్ల అదనపు భారం పడింది.

రాష్ట్ర ప్రభుత్వమేదైనా పారిశ్రామికవేత్తలకు రాయితీలు, ప్రోత్సాహకాలు అందించి.. పరిశ్రమలు ఏర్పాటు చేసేలా చూస్తుంది. వైకాపా సర్కారు మాత్రం అందుకు రివర్స్‌. రాష్ట్రంలోని పరిశ్రమలపై విద్యుత్‌ ఛార్జీలు, ఆస్తి పన్ను, నీటి పన్ను, వార్షిక లైసెన్సు ఫీజులు.. ఇలా రకరకాల భారాలను మోపుతోంది. ఈ ఐదేళ్ల జగన్‌ ‘బాదుడే బాదుడు’ పాలనలో ఉత్పత్తి వ్యయం కనీసం 40% పెరిగినట్లు పారిశ్రామికవేత్తలు వాపోతున్నారు. పెట్టుబడిదారులకు రాయితీలు కల్పిస్తామని, మూలధన వ్యయ భారం తగ్గిస్తామని, చేయిపట్టి నడిపిస్తామని పలుమార్లు ఆయన చెప్పిన మాటలన్నీ డొల్లేనని తేలింది. దాంతో రాష్ట్రంలోని సుమారు 27 వేల భారీ పరిశ్రమలు, సుమారు 5 లక్షల సూక్ష్మ, చిన్న, మధ్యతరహా(ఎంఎస్‌ఎంఈ) పరిశ్రమలు ప్రస్తుతం గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నాయి.


విలువ పెరిగిందా.. అంతే..

పరిశ్రమ భూములకు కూడా ఆస్తి పన్ను విధానాన్ని జగన్‌ ప్రభుత్వం తీసుకొచ్చింది. గతంలో భవనాల వరకే పన్ను లెక్కించేవారు. దీంతో 2019లో రూ.1.13 లక్షలు ఆస్తి పన్ను చెల్లించిన ఓ కంపెనీ.. ప్రస్తుతం రూ.1.44 లక్షలు చెల్లించాల్సి వస్తోంది. అది చాలదన్నట్లు ఏటా 5 శాతం పన్ను పెంపు వర్తించేలా నిబంధన విధించింది.


జీఓ ఎప్పుడిచ్చామని కాదన్నయ్యా..

ఎక్కడైనా ఉత్తర్వులు జారీ చేసిన తేదీ నుంచి పెంచిన లైసెన్సు ఫీజులు వసూలు చేయడం సహజం. కానీ, జగన్‌ ప్రభుత్వం రూటే సెపరేటు. పరిశ్రమల నుంచి వసూలు చేసే వార్షిక లైసెన్సుల ఫీజులను పెంచుతూ 2023లో ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.  అప్పటినుంచి కాకుండా.. 2019 నుంచి లెక్కగట్టి మరీ (రెట్రాస్పెక్టివ్‌) వసూలు చేసింది. వార్షిక లైసెన్సు ఫీజు హార్స్‌పవర్‌ (హెచ్‌పీ), కిలోవాట్‌(కేడబ్ల్యూ) ఆధారంగా పెంచుతూ ప్రభుత్వం గత ఏడాది ఉత్తర్వులు ఇచ్చింది. 2007 తర్వాత వార్షిక లైసెన్సు ఫీజులను పెంచడం ఇదే తొలిసారి. ఈ పెంపు కూడా 2019 నుంచి వర్తిస్తుందని జగన్‌ ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఈ ఉత్తర్వులతో కాలుష్య నియంత్రణ మండలి, బాయిలర్‌, ఫ్యాక్టరీ లైసెన్సు, అగ్నిమాపక శాఖ, కార్మిక శాఖతోపాటు వివిధ శాఖల లైసెన్సుల ఫీజులు గతంతో పోలిస్తే దాదాపు మూడు రెట్లు పెరిగాయి. రాష్ట్రంలోని సుమారు 25,270 పరిశ్రమలపై ఈ పెంపు ప్రభావం పడింది. ఒక్క కాలుష్య నియంత్రణ మండలి ధ్రువీకరణ కోసం 2019లో మూడేళ్లకు రూ.90 వేలు చెల్లిస్తే.. ఇప్పుడది రూ.4 లక్షలకు పెరిగింది.


మామూలు ‘ఇంపాక్ట్‌’ కాదు..

రాష్ట్రంలో చిన్నా పెద్దా కలిపి మొత్తం 1,500 పారిశ్రామిక పార్కులు, పారిశ్రామికవాడలను ఏపీఐఐసీ అభివృద్ధి చేసింది. చాలా ఏళ్ల క్రితం పరిశ్రమల కోసం తీసుకున్న భూములపై ‘గ్రోత్‌ పాలసీ’ పేరుతో భారం మోపేందుకు వైకాపా ప్రభుత్వం హడావుడిగా జీవో నం-5, 6 తెచ్చింది. ఇలా రూ.3,500 కోట్లు రాబట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఏపీఐఐసీ ద్వారా పరిశ్రమల కోసం తీసుకున్న భూముల్లో.. తొలుత   ప్రతిపాదించిన కార్యకలాపాల్లో మార్పులు చేయాలని భావిస్తే(మరో తరహా పరిశ్రమకు వినియోగించాలనుకుంటే) అప్పటి మార్కెట్‌ విలువలో 50 శాతాన్ని ఇంపాక్ట్‌ ఫీజుగా చెల్లించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఆ మొత్తాన్ని చెల్లించలేని పక్షంలో 50 శాతం భూములను ప్రభుత్వానికి స్వాధీనం చేయాలంటూ మెలిక పెట్టింది. పరిశ్రమల ఏర్పాటు కోసం ప్రైవేటు భూములు కొనుగోలు చేసిన వారు కూడా ప్రస్తుత మార్కెట్‌ విలువపై 15 శాతం ఇంపాక్ట్‌ ఫీజు చెల్లించాలట.


వేల ఎకరాలు వృథాగా..

పెట్టుబడులను ఆకర్షించేలా భూములను తక్కువ ధరకు అందించాలన్న మౌలిక విధానాన్ని జగన్‌ ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది. పారిశ్రామిక పార్కుల్లో స్థలాల అభివృద్ధికి భారీగా ఖర్చు చేయాల్సి వస్తోందని, ఆ మొత్తాన్ని పరిశ్రమల యజమానుల నుంచే వసూలు చేయాలని జగన్‌ ఆదేశించారు. దీంతో కృష్ణా జిల్లా మల్లవల్లి పారిశ్రామిక పార్కులో గతంలో ఎకరా రూ.16.5 లక్షలుగా ఉన్న భూముల ధరలను సర్కారు అమాంతం రూ.80 లక్షలకు పెంచింది.

ఇదే తరహాలో వీరపనేని గూడెం పారిశ్రామిక పార్కులో ఎకరా ధరను రూ.91 లక్షలకు పెంచుతూ ఉత్తర్వులు ఇచ్చింది. ఆ దెబ్బకు అప్పటికే పరిశ్రమల ఏర్పాటు కోసం భూములు కేటాయించాలని కోరుతూ దరఖాస్తు చేసుకున్న పారిశ్రామికవేత్తలు తమ ప్రతిపాదనలను విరమించుకున్నారు. ఇదే తరహాలో రాష్ట్రంలోని  అన్ని పారిశ్రామిక పార్కుల్లో స్థలాల ధరలను ప్రభుత్వం భారీగా పెంచడంతో.. పారిశ్రామికవేత్తల్లో ఆసక్తి తగ్గిపోయింది. ఏపీఐఐసీ రికార్డుల ప్రకారం అన్ని పారిశ్రామిక పార్కుల్లో కలిపి 44,767 ఎకరాలు వృథాగా పడి ఉన్నాయి.


కొనేటప్పుడు కిలో వాట్‌.. అమ్మేటప్పుడు కిలో వోల్ట్‌!

వివిధ ఉత్పత్తి సంస్థల నుంచి కిలో వాట్‌ అవర్‌(కేడబ్ల్యూహెచ్‌) ఆధారంగా డిస్కంలు విద్యుత్‌ను కొంటాయి. వారికి చెల్లించే బిల్లు కూడా ఆ ప్రకారమే చెల్లిస్తాయి. కానీ, పరిశ్రమల దగ్గరకు వచ్చేప్పటికి కిలో వోల్ట్‌ అవర్‌(కేవీహెచ్‌) విధానంలో బిల్లులు వసూలు చేస్తున్నాయి. రెండేళ్ల కిందటి వరకు కేడబ్ల్యూహెచ్‌ విధానంలోనే పరిశ్రమలు వినియోగించిన విద్యుత్‌కు డిస్కంలు బిల్లులు ఇచ్చాయి. బిల్లింగ్‌ను కేవీహెచ్‌ విధానంలోకి మార్పు చేయడం ద్వారా పవర్‌ ఫ్యాక్టర్‌ ఆధారంగా చెల్లించాల్సి వస్తోంది. ట్రూఅప్‌, ఎఫ్‌పీపీసీఏ, కేవీహెచ్‌ బిల్లింగ్‌ విధానం వల్ల యూనిట్‌కు సగటున రూ.14 వంతున చెల్లించాల్సి వస్తోంది. కర్ణాటక,  ఉత్తరాఖండ్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో పరిశ్రమలు వినియోగించే విద్యుత్‌కు యూనిట్‌కు గరిష్ఠంగా రూ.7 మాత్రమే వసూలు చేస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని