డొక్కు బస్సులు.. ఛార్జీల బాదుళ్లు.. అనగనగా ఒక ప్రజాపీడకుడు!

ప్రగతి రథ చక్రం.. దశాబ్దాలుగా ప్రజల నోళ్లలో నానుతున్న నినాదం. జగన్‌ ఐదేళ్ల హయాంలో ఈ రథం గతి తప్పింది అభివృద్ధి వేటలో బోల్తా కొట్టింది ఖాళీలు భర్తీచేయక.. మరమ్మతులు లేక ఆర్టీసీని ‘తుక్కు’ చేసిన జగన్‌... మూడుసార్లు ఛార్జీలు పెంచి ప్రయాణికుల నడ్డివిరిచారు

Updated : 18 Apr 2024 16:50 IST

ప్రగతి రథ చక్రం.. దశాబ్దాలుగా ప్రజల నోళ్లలో నానుతున్న నినాదం. జగన్‌ ఐదేళ్ల హయాంలో ఈ రథం గతి తప్పింది అభివృద్ధి వేటలో బోల్తా కొట్టింది ఖాళీలు భర్తీచేయక.. మరమ్మతులు లేక ఆర్టీసీని ‘తుక్కు’ చేసిన జగన్‌... మూడుసార్లు ఛార్జీలు పెంచి ప్రయాణికుల నడ్డివిరిచారు

మొన్నామధ్య మైకులు పగిలిపోయేంతగా అబద్ధాల డప్పు కొట్టారు జగన్‌. ‘‘మీ కష్టం తెలిసిన మీ బిడ్డ ప్రభుత్వం ప్రతి గ్రామంలో ప్రతి ఇంటిలోనూ మార్పు తీసుకొచ్చింది’’ అంటూ నిర్లజ్జగా ఆత్మస్తుతి చేసుకున్నారు. గజదొంగ మాటల గారడీలో సిద్ధహస్తుడైన జగన్‌ తెచ్చిన ఆ మార్పులేంటో తెలుసా? ఆర్టీసీ ఛార్జీలను మూడుసార్లు పెంచి, జనం నుంచి అదనంగా అయిదేళ్లలో రూ. 5 వేల కోట్లను గుంజిపారేయడం! తుక్కు కింద పోవాల్సిన డొక్కు బస్సులను రోడ్డెక్కించి జనం బతుకులతో రోజూ చెలగాటమాడటం! బస్టాండ్లలో పిల్లాపాపలతో పడిగాపులు పడేవారిని వదిలేసి, బస్సులన్నింటినీ వైకాపా ప్రచార సభలకు పట్టుకుపోవడం! తనకే సాధ్యమైన ఇలాంటి ‘మార్పు’లతో ప్రజారవాణా సంస్థ వెన్నెముక విరగ్గొట్టిన జగన్‌- పేద, మధ్య తరగతి ప్రయాణికుల పాలిట అశనిపాతం. ప్రజాప్రయోజనాలకు పాతరేసి, ఆర్టీసీ ఉద్యోగులనూ అష్టకష్టాల పాల్జేసిన జగన్‌- కంటపడిన బక్కప్రాణులను చీల్చి చంపి తినే తోడేలుకు ప్రతిరూపం!


ప్రజాభద్రతకు ప్రమాదకారి జగనే!

ప్రతిపక్షనేతగా జగన్‌ జనాన్ని ఎంతగా మభ్యపెట్టారంటే- తాను ముఖ్యమంత్రిని కాకపోతే ఆర్టీసీ మిగలదంటూ కల్లబొల్లి జోస్యాలు చెప్పారు. అలాంటి పచ్చి అబద్ధాలతో ఎలాగైతేనేం సీఎం అయ్యారు. ఆపై ఆర్టీసీ ప్రగతి రథచక్రాలకు పంక్చర్‌ చేసిన జగన్‌- ప్రయాణికుల ప్రాణాలను గాల్లో దీపాలుగా మార్చేశారు. పది రోజుల క్రితం శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నుంచి కవిటి వైపు వెళ్తున్న బస్సు.. స్టీరింగ్‌ పట్టేసి నడిరోడ్డుపై ఆగిపోయింది. అంతకు రెండు రోజుల మునుపు పార్వతీపురం రైల్వే వంతెనపై ప్రయాణిస్తున్న బస్సు బ్రేకులు ఫెయిలయ్యాయి. నిరుడు ఫిబ్రవరిలో అనకాపల్లి నుంచి చోడవరం వస్తున్న బస్సు స్టీరింగ్‌ మొరాయించి, రోడ్డు పక్క దుకాణాల పైకి దూసుకుపోయింది. పశ్చిమగోదావరి జిల్లా అజ్జమూరు దగ్గర నడుస్తున్న బస్సు చక్రాలు ఉన్నట్టుండి ఊడిపోయాయి. అదే జిల్లాలో స్టీరింగ్‌ పట్టేసిన బస్సు.. జల్లేరు వాగులోకి బోల్తాకొట్టింది. ఆ ఘోర ప్రమాదంలో పది మంది ప్రాణాలు పోయాయి. విశాఖపట్నం, కృష్ణా, నెల్లూరు జిల్లాల్లో ఆర్టీసీ బస్సుల్లో హఠాత్తుగా మంటలు ఎగిసిపడ్డాయి. అనంతపురంలో బ్రేకులు ఫెయిలైన బస్సు ఒకటి ముందు వెళ్తున్న వాహనాలను ఢీకొట్టి, జనం నెత్తురు కళ్లజూసింది. రాష్ట్రవ్యాప్తంగా రోజుకు సుమారు 38 లక్షల మంది ప్రయాణించే ఆర్టీసీ బస్సులు ఇలా ఎప్పుడు ఎక్కడ ఎలాంటి ప్రమాదానికి గురవుతాయో తెలియని దారుణావస్థ నెలకొంది. ఎండిన మానుకు ఎర్రపూలు చుట్టినట్లు- పనికిమాలిన బస్సులకు పైపై సోకులు చేసి నడిపించడంలో జగన్‌ సర్కారు పండిపోయింది. కొత్త బస్సుల కొనుగోళ్లపై గాలిలో మేడలు కడుతూ కూర్చున్న జగన్‌ కారణంగానే ప్రయాణికులూ, ఇతర వాహనదారుల భద్రతకు భరోసా లేకుండాపోయింది.


డొక్కు బస్సుల జగన్‌ జమానా!

‘‘అభివృద్ధి చేసిన అధికార పార్టీకి తిరుగులేదు’’ అంటూ వైకాపా అధినేత పగటికలలు కంటున్నారు. ఏది అభివృద్ధి.. ప్రజలకు ప్రాణాపాయం పెంచడమే జగన్‌ దృష్టిలో ‘ప్రగతి’ అయితే, ఆ పనిలో ఆయనకు నిజంగానే తిరుగులేదు. ఆర్టీసీ బస్సులు బాలేవు మహాప్రభూ అని ఎవరెన్ని సార్లు మొత్తుకున్నా- దున్నపోతు మీద వానపడినట్లుగానే వ్యవహరించారు జగన్‌. 2019లో ఆర్టీసీ చేతిలో సొంతవి, అద్దెవి కలిపి 12,027 బస్సులు ఉండేవి. 2024 జనవరి నెలాఖరు నాటికి వాటి సంఖ్య 10,761కి తగ్గిపోయింది. ఇదీ నాలుగేళ్లలో శ్రీమాన్‌ జగన్‌ సాధించిన అభివృద్ధి! ‘‘ఆర్టీసీలో 12 లక్షల కి.మీ.లకు పైగా తిరిగిన 3,600 బస్సులను వెంటనే మార్చాలి. అలాగైతేనే ప్రయాణికుల భద్రతలో ప్రమాణాలు పాటించినట్లు’’ అని 2019 నవంబరులో జగన్‌ ధర్మోపదేశాలు చేశారు. ఎక్కడి మాటను అక్కడే వదిలేసి వెళ్లిపోయే ఆయన- పాత బస్సుల తొలగింపునూ అలాగే అటకెక్కించారు. దాంతో 2023 డిసెంబరు నాటికి 12 లక్షల కి.మీ.కు మించి తిరిగేసిన బస్సుల సంఖ్య 4,445కు ఎగబాకింది. కాలంచెల్లిన ఆ బస్సులన్నీ మృత్యు శకటాల వంటివే. అయినా వాటిని రోడ్లపై తిప్పడం మానలేదు జగన్‌ సర్కారు. వైకాపా ఏలుబడిలో 2020లో ఒక్కసారి మాత్రమే మూడొందల బస్సులు కొనుగోలు చేశారు. నిరుడు మరో 1500 బస్సులను కొన్నట్లు పెద్ద హంగామా చేశారు కానీ, ప్రజలకు అవి అందుబాటులోకి రానేలేదు. తగినన్ని బస్సుల్లేక సర్వీసులు తరచూ రద్దవుతూ ప్రయాణికులు నానా అగచాట్ల పాలవుతున్నా- అధికార మత్తులో మునిగిన జగన్‌ కంటికి అవేమీ ఆనలేదు. ఆయన పాలనలో మూడున్నర వేలకు పైగా పల్లెలు అసలు బస్సు సేవలకే నోచుకోలేదు. ఆ పల్లెల బాధలను పట్టించుకోలేని జగన్‌ ‘ప్రతి గ్రామాన్నీ మార్చేశా’నని టముకేసుకోవడం అంటే- అంతకంటే సిగ్గుమాలినతనం ఇంకోటి ఉండదు!


జగన్మోహన దోపిడీ దొర!

చెప్పేవి శ్రీరంగ నీతులు.. చేసేవి గజదొంగ పనులు అన్న మాట జగన్‌కు సరిగ్గా సరిపోతుంది. 2014-15లో రాష్ట్రంలో కిలోమీటరుకు సగటు బేసిక్‌ ఛార్జీ 76 పైసలు.  ఆ తరవాతి సంవత్సరంలో అది 83 పైసలుకు చేరింది. అప్పటి నుంచి 2018-19 వరకు బేసిక్‌ ఛార్జి 83 పైసలే ఉంది. దానికే ‘‘ఆర్టీసీ ఛార్జీల బాదుడే బాదుడు’’ అంటూ ప్రతిపక్షనేతగా జగన్‌మోహన్‌రెడ్డి మొసలికన్నీళ్లు కారుస్తూ రంకెలు వేశారు. అదే జగన్‌ సీఎం అయ్యాక కిలోమీటరుకు సగటు బేసిక్‌ ఛార్జీని 83 పైసలు నుంచి రూ.1.24కు పెంచేశారు. అంటే- తెదేపా ఏలుబడిలో కిలోమీటరుకు సగటు బేసిక్‌ ఛార్జీ ఏడు పైసలు పెరిగింది. జగన్మోహన దోపిడీ దొర పాలనలోనైతే అది ఏకంగా 41 పైసలు అధికమైంది. జగన్‌ మార్కు ప్రజాసేవ అంటే ఇదే.. పైకి తియ్యటి మాటలు చెబుతూ, వెనకాల గోతులు తీయడంలో వైకాపా అధినేత ఆరితేరిపోయారు. ‘‘బాదుడే బాదుడు’’ అంటూ గుండెలు బాదుకుని, నేనైతే అంతా మంచే చేస్తానని చెప్పి ఓట్లేయించుకున్న జగన్‌- సీఎం అయిన ఆర్నెల్లకే ఆర్టీసీ ఛార్జీల పెంపుతో జనాన్ని వాయగొట్టారు. ఆపై 2022లో మూడు నెలల వ్యవధిలోనే ఇంకో రెండు సార్లు ఛార్జీలు పెంచి ప్రయాణికులను లూఠీ చేశారు. పేదలు ఎక్కువగా ప్రయాణించే పల్లెవెలుగుల నుంచి విద్యార్థుల బస్సుపాసుల వరకు అన్నింటిపైనా అధిక ఛార్జీలను బాదిపారేశారు జగన్‌. ఆర్టీసీ ఛార్జీల పెంపుతో రూ.5,243 అదనపు భారాన్ని జనం నెత్తిన మోపారు. అలాంటి కర్కోటక పాలకుడు ఇప్పుడొచ్చి ప్రజాసంక్షేమమే తన లక్ష్యమంటూ దగుల్బాజీ డ్రామాలు ఆడుతున్నారు. దెయ్యాలు వేదాలు వల్లించినట్లు పేదల నామస్మరణ చేస్తున్న జగన్‌- పన్నులూ ఛార్జీల వాయింపుతో బడుగు బలహీనవర్గాలనే ఎక్కువగా దోచేశారు.


జగన్‌ పాడుబుద్ధికి జనం బలి

అయిదు కోట్ల ఆంధ్రులకు సేవలందించాల్సిన ఆర్టీసీని సొంత రవాణా సంస్థగా మార్చుకుని దొడ్లో కట్టేసుకున్నారు జగన్‌. తానెక్కడ ప్రచార సభలు నిర్వహిస్తే- అక్కడికి ఆర్టీసీ బస్సులను వేల సంఖ్యలో తెప్పించుకున్నారు. డిపోల్లోని బస్సుల్లో 70-80శాతం అలా జగన్‌ పార్టీ కార్యకర్తల తరలింపులకే అంకితమైతే- నడిరోడ్లపై నరకం చవిచూడటం సాధారణ ప్రయాణికుల వంతు అయ్యింది. నిరుడు దసరా సందర్భంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో వంద బస్సులు పెట్టారు. చాలామంది వాటికి రిజర్వేషన్‌ చేయించుకుని టిక్కెట్లు కొనుక్కున్నారు. జగన్మోహన ప్రభువులు వేంచేస్తున్నారని చెప్పి ఆ టిక్కెట్లను రద్దు చేసేశారు. జగన్‌ సభలు జరిగిన ప్రతిసారీ జనానికి ఇలాంటి పాట్లు తప్పలేదు. మందుపోసో, డబ్బులిచ్చో, బెదిరించో, బులిపించో బహిరంగ సభలకు జనాన్ని భారీగా తరలించి, తనకు లేని బలాన్ని ఉన్నట్లు చూపించుకోవాలన్నది జగన్‌ పాడుబుద్ధి. దానికోసం బస్సులను తన సభలకు పట్టుకుపోయి ఇంటర్‌ పరీక్షల సమయంలో విద్యార్థులను, బతుకుతెరువు కోసం వేరే ఊళ్లకు వెళ్లే కార్మికులను, అత్యవసర పనుల మీద బయల్దేరిన వారిని.. ఇలా అందరినీ హింసించారు. ఏపీఎస్‌ఆర్టీసీ కాస్తా ‘జేఎంఆర్టీసీ’ (జగన్‌మోహన్‌ రెడ్డి ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్‌) అయిన దరిమిలా ప్రతిపక్షాల సభలకు ఒక్క బస్సూ దొరకలేదు. ముందే డబ్బులు కడతామన్నా బస్సులను ఇవ్వలేదు. అదే వైకాపా సభలకైతే చెల్లింపులతో సంబంధం లేకుండా బస్సులను పంపించి స్వామిభక్తిని చాటుకుంది ‘జేఎంఆర్టీసీ’ యాజమాన్యం!


ఉద్యోగులకు జగన్‌ కుచ్చుటోపీ!

పళ్లెంలో పచ్చడి మెతుకులను విదిల్చి పంచభక్ష్య పరమాన్నాలు వడ్డించామని ప్రచారం చేసుకునేవారిని ఎప్పుడైనా చూశారా? ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి ఉద్యోగులను ఉద్ధరించేశామని జగన్‌ సర్కారు కొట్టుకుంటున్న గప్పాలూ అలాంటివే. సంస్థ ఆదాయంలో పాతిక శాతాన్ని కాజేస్తున్న వైకాపా ప్రభుత్వం- తమను నిండా ముంచిందని ఉద్యోగులు శాపనార్థాలు పెడుతున్నారు. వేతన సవరణ బకాయిల చెల్లింపుల నుంచి వైద్య ఖర్చుల భరింపు వరకు ప్రతిచోటా ఆర్టీసీ ఉద్యోగుల ఆశలను జగన్‌ చిదిమేశారు. డ్రైవర్‌, మెకానిక్‌ పోస్టులను భర్తీ చేయకుండా, సరైన శిక్షణ లేని తాత్కాలిక సిబ్బందితో పనిచేయిస్తూ, ప్రయాణికుల ప్రాణాలను దైవాధీనం చేశారు. అధికారంలోకి రాకమునుపు ఆర్టీసీ ప్రైవేటుపరం చేసేస్తున్నారహో అంటూ జగన్‌ పెడబొబ్బలు పెట్టారు. సీఎం కుర్చీలో కూర్చున్నాక ఆర్టీసీ ఆస్తులను సొంత పార్టీకి ధారాదత్తం చేయించారు. బాపట్లలో వైకాపా కార్యాలయం కోసం రూ.కోట్ల విలువైన ఆర్టీసీ స్థలాన్ని అలాగే కారుచౌకగా కొట్టేశారు. సామాన్యుల కోసం కాస్త మంచి బస్సులు వేయించడానికి జగన్‌కు మనసు రాలేదు. కానీ, ఆర్టీసీ డబ్బు రూ.23కోట్లు పెట్టి సొంత పర్యటనల కోసం ఆయన ఇటీవలే అయిదు ప్రత్యేక బస్సులను కొనిపించారు. అక్రమార్కులకు అధికారం దక్కితే- ప్రజావసరాలను పక్కకునెట్టేసి స్వీయప్రయోజనాలనే నెరవేర్చుకుంటారు. అందుకు నిదర్శనం- అడ్డూఆపూ లేని జగన్‌ పీడనే!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని