వాలంటీర్ల ద్వారా నగదు పంపిణీ చేయొద్దు

పింఛన్లు సహా అన్ని నగదు పంపిణీ పథకాలకు వాలంటీర్లను దూరంగా ఉంచాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది.

Updated : 31 Mar 2024 06:21 IST

ప్రభుత్వ ఉద్యోగులతో ఇప్పించండి
మొబైల్స్‌/టాబ్లెట్స్‌ డిపాజిట్‌ చేసుకోండి
కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశం

ఈనాడు, అమరావతి: పింఛన్లు సహా అన్ని నగదు పంపిణీ పథకాలకు వాలంటీర్లను దూరంగా ఉంచాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఎన్నికల నియమావళి ముగిసే వరకు వారి వద్ద ఉన్న పరికరాలను (మొబైల్స్‌/టాబ్లెట్స్‌/ఇతర) జిల్లా ఎన్నికల అధికారుల వద్ద డిపాజిట్‌ చేసుకోవాలని స్పష్టం చేసింది. అమల్లో ఉన్న పథకాలకు సంబంధించిన ప్రయోజనాలను ప్రభుత్వ సాధారణ ఉద్యోగుల ద్వారా అందించేందుకు వీలుగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని రాష్ట్రప్రభుత్వానికి సూచించింది. వాలంటీర్ల పనితీరుపై వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు, పత్రికల్లో వస్తున్న కథనాలతో పాటు హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం కార్యదర్శి సంజయ్‌కుమార్‌ శనివారం ఇచ్చిన ఆదేశాల్లో పేర్కొన్నారు. వాలంటీర్లు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, వారిని ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని సిటిజన్స్‌ ఫర్‌ డెమోక్రసీ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు తీర్పును ప్రస్తావించారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొనవద్దని సీఈసీ ఆదేశించినా కొందరు వాలంటీర్లు పెడచెవిన పెడుతున్నారు. వైకాపా అభ్యర్థులకు ఓటేయాలని ప్రచారం చేస్తున్నారు. కొన్నిచోట్ల వైకాపా నేతలే వారిపై ఒత్తిడి తెస్తున్నారు. మరికొన్ని చోట్ల రాజీనామాలు చేయించి మరీ ప్రచారానికి తీసుకెళుతున్నారు. దీంతో వారిని నగదు పంపిణీ ప్రయోజనాలకు దూరంగా ఉంచాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది.

పింఛన్ల పంపిణీని గ్రామ కార్యదర్శులకు అప్పగించాలి

ఎన్నికల కోడ్‌ ముగిసేవరకు వాలంటీర్లను పింఛన్లు, ఇతర నగదు పంపిణీ పథకాలకు దూరంగా ఉంచాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించినందున ఆ బాధ్యతలను గ్రామపంచాయతీ కార్యదర్శులకు అప్పగించాలని అఖిల భారత పంచాయతీ పరిషత్‌ జాతీయ ఉపాధ్యక్షుడు జాస్తి వీరాంజనేయులు ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో 13,500 మందికిపైగా గ్రామపంచాయతీ కార్యదర్శులు ఉన్నారని, సంక్షేమ పథకాల పంపిణీలో పారదర్శకత పెంచేందుకు వీరికి బాధ్యతలు ఇవ్వాలని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని