సంక్షిప్తవార్తలు (6)

ఏపీ బార్‌ కౌన్సిల్‌ ఛైర్మన్‌ గంటా రామారావు తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా పత్రాన్ని బార్‌ కౌన్సిల్‌ కార్యదర్శికి శనివారం సమర్పించినట్లు తెలిసింది.

Updated : 31 Mar 2024 05:18 IST

బార్‌ కౌన్సిల్‌ ఛైర్మన్‌ పదవికి గంటా రామారావు రాజీనామా

ఈనాడు, అమరావతి: ఏపీ బార్‌ కౌన్సిల్‌ ఛైర్మన్‌ గంటా రామారావు తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా పత్రాన్ని బార్‌ కౌన్సిల్‌ కార్యదర్శికి శనివారం సమర్పించినట్లు తెలిసింది. దాంతో ఛైర్మన్‌ పదవికి త్వరలో ఎన్నిక జరగనుంది.


పాలిటెక్నిక్‌ విద్యార్థిని బలవన్మరణంపై విచారణ కమిటీ

ఈనాడు డిజిటల్‌, అమరావతి: విశాఖపట్నం జిల్లా కొమ్మాది ప్రాంతంలోని ఓ ప్రైవేటు పాలిటెక్నిక్‌ కళాశాలలో మొదటి సంవత్సరం విద్యార్థిని బలవన్మరణంపై ముగ్గురు సభ్యులతో కూడిన విచారణ కమిటీని సాంకేతిక విద్యాశాఖ నియమించింది. ఆత్మహత్యపై పూర్తిస్థాయి విచారణ జరిపి వివరణాత్మక నివేదికను 24 గంటల్లో సమర్పించాలని కమిషనర్‌ చదలవాడ నాగరాణి శనివారం ఆదేశించారు. విద్యాసంస్థలోని ఓ అధ్యాపకుని లైంగిక వేధింపుల కారణంగానే తాను చనిపోతున్నానని తండ్రికి ఆ విద్యార్థిని వాట్సప్‌ సమాచారం పంపినట్టు పలు పత్రికల్లో కథనాలు వెలువడ్డాయి. కళాశాలలో పలువురు విద్యార్థినులు తనలాగే ఇబ్బంది పడుతున్నారని.. ఆ విషయం బయటకు రావాలనే ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు ఆమె ఆ సంక్షిప్త సమాచారంలో పేర్కొంది. దీంతో అప్రమత్తమైన సాంకేతిక విద్యాశాఖ విచారణ బృందాన్ని నియమించింది. మరోవైపు ఈ కేసులో వాస్తవాలను వెలికితీసేందుకు పోలీసులు ముమ్మర దర్యాప్తు చేపట్టారు. శనివారం కళాశాలకు వెళ్లి సీజింగ్‌లో ఉన్న సీసీటీవీ ఫుటేజీలను మరోమారు పరిశీలించారు. వివరాలను నమోదు చేసుకున్నారు.


ఏడుగురు వాలంటీర్లపై వేటు

విశాఖపట్నం (పద్మనాభం), న్యూస్‌టుడే: నిబంధనలు ఉల్లంఘించి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఏడుగురు వాలంటీర్లను విధుల నుంచి తొలగించినట్లు ఎంసీసీ సభ్యురాలు, పద్మనాభం ఎంపీడీఓ బి.శైలజ తెలిపారు. ఈ నెల 26న విశాఖలోని గంధవరం గ్రామంలో వైకాపా ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు నిర్వహించిన ప్రచారంలో ఏడుగురు  వాలంటీర్లు ప్రత్యక్షంగా పాల్గొన్నారు. ఈ మేరకు విచారణ చేపట్టి వారిని తొలగించినట్లు శైలజ పేర్కొన్నారు. నియమావళిని ఉల్లంఘించిన ఆ ఏడుగురి వాలంటీర్లతో పాటు కో-ఆపరేటివ్‌ బ్యాంకు    ఉద్యోగి గల్లా రామకృష్ణపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై సురేష్‌ తెలిపారు.


13 మంది వాలంటీర్ల రాజీనామా

విజయనగరం గ్రామీణం, న్యూస్‌టుడే: విజయనగరం జిల్లాలో గొల్లలపేట పంచాయతీకి చెందిన 13 మంది వాలంటీర్లు రాజీనామా చేశారు. వీరి రాజీనామాలను ఎంపీడీఓ జి.వెంకటరావు ధ్రువీకరించారు. తొలినుంచి వీరు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. వీరి సేవలు పూర్తి స్థాయిలో వినియోగించుకునేందుకు అధికార పార్టీ నాయకుడే వారితో రాజీనామా చేయించారనే చర్చ జరుగుతోంది.


సీనియర్లను కాదని జూనియర్లకు కీలక పోస్టింగులు!

నిబంధనల అతిక్రమణపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు

ఈనాడు, అమరావతి: స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతి పొందిన జాబితాలోని సీనియర్లను కాదని జూనియర్లకు కీలకమైన పోస్టింగులు ఇచ్చారని రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు అందింది. డిప్యూటీ కలెక్టర్లుగా ఉన్న వారిలో స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతి పొందేందుకు అర్హులైన 106 మందితో ఓ జాబితా (ప్రొవిజనల్‌ సీనియార్టీ లిస్ట్‌)ను రెవెన్యూ శాఖ గెజిట్‌ రూపంలో గత ఏడాది డిసెంబరులో విడుదల చేసింది. అయితే... వీరిలో ఎనిమిది మందికే స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్‌ హోదాలో పోస్టింగులు ఇచ్చారని ఫిర్యాదుదారు పేర్కొన్నారు. వీరుకాకుండా పోస్టింగులు పొందిన మరో 18 మంది బాగా జూనియర్లని, వీరిలో కొందరు ప్రస్తుతం జిల్లాల్లో డీఆర్‌ఓలుగా పని చేస్తున్నారని తెలిపారు. అడిషనల్‌ డిస్ట్రిక్ట్‌ మేజిస్ట్రేట్‌/డిప్యూటీ డిస్ట్రిక్ట్‌ ఎలక్షన్‌ ఆఫీసర్‌ హోదా వీరికి ఉందని తెలిపారు. పది, పన్నెండేళ్ల నుంచి పనిచేస్తున్న సీనియర్లను కాదని జూనియర్లకు ఎలా అవకాశాన్ని కల్పిస్తారని ప్రశ్నించారు. నిబంధనల అతిక్రమణ జరిగిందని ఆరోపించారు. అంతేకాకుండా జూనియర్లలో పలువురిపై ఆదాయానికి మించిన కేసులు కూడా ఉన్నాయని తెలిపారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపించి అర్హులైన వారికి న్యాయం చేయాలని కోరారు.


డీఎస్సీ వాయిదా హర్షణీయం

ఈనాడు డిజిటల్‌, అమరావతి: రాష్ట్రంలో డీఎస్సీ పరీక్షను కేంద్ర ఎన్నికల సంఘం వాయిదా వేయడంపై నిరుద్యోగ ఐక్య కార్యాచరణ సమితి (ఐకాస) హర్షం వ్యక్తం చేసింది. ‘జగన్‌ ప్రభుత్వం అయిదేళ్లు కాలయాపన చేసి ఎన్నికలున్నాయని తెలిసినా.. డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇచ్చి హడావుడిగా పరీక్షలు నిర్వహించాలనుకుంది. నిరుద్యోగుల వినతులపై స్పందించిన ఈసీ డీఎస్సీని వాయిదా వేసింది. అధికారంలోకి వచ్చిన 60 రోజుల్లోనే మెగా డీఎస్సీపై మొదటి సంతకం చేస్తామన్న చంద్రబాబు హామీపై నిరుద్యోగులకు నమ్మకముంది’ అని ఐకాస అధ్యక్ష, కన్వీనర్లు హేమంత్‌కుమార్‌, షేక్‌ సిద్దిక్‌ శనివారం వేర్వేరు ప్రకటనల్లో పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని