జగన్‌ యాత్ర.. జనానికి యాతన

జగన్‌మోహన్‌రెడ్డి అయిదేళ్లుగా సీఎం హోదాలో ఎక్కడికెళ్లినా ప్రజలకు నరకం చూపించారు. ఇప్పుడు వైకాపా అధినేతగా ఎన్నికల ప్రచారానికి వెళ్లినా పరిస్థితి మారలేదు.

Updated : 31 Mar 2024 08:08 IST

అవసరం లేకపోయినా 44వ జాతీయ రహదారిపై ట్రాఫిక్‌ నిలిపివేత
బస్సు యాత్రకు ఇబ్బందవుతుందని ఉదయం 8 నుంచే కరెంటు సరఫరా కట్‌
12 గంటలపాటు కరెంటు కోతతో పట్టణవాసుల నరకయాతన

ఈనాడు డిజిటల్‌- అనంతపురం, న్యూస్‌టుడే- గుత్తి, గుత్తి గ్రామీణం: జగన్‌మోహన్‌రెడ్డి అయిదేళ్లుగా సీఎం హోదాలో ఎక్కడికెళ్లినా ప్రజలకు నరకం చూపించారు. ఇప్పుడు వైకాపా అధినేతగా ఎన్నికల ప్రచారానికి వెళ్లినా పరిస్థితి మారలేదు. వైకాపా నాయకుల దౌర్జన్యానికి పోలీసుల అత్యుత్సాహం తోడై జగన్‌ బస్సుయాత్రలో జనాలకు ఇబ్బందులు తప్పడం లేదు. ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్రలో భాగంగా సీఎం జగన్‌ శనివారం ఉదయం 10.30కు అనంతపురం జిల్లా గుత్తి పట్టణానికి రావాల్సి ఉంది. అయితే ఆయన 6 గంటల ఆలస్యంగా సాయంత్రం 4.30కు చేరుకున్నారు. దానికి రెండు గంటల ముందే పోలీసులు 44వ నంబరు జాతీయరహదారిపై ట్రాఫిక్‌ను నిలిపివేశారు. దాంతో హైదరాబాద్‌, బెంగళూరు వెళ్లాల్సిన ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు. జగన్‌ కర్నూలు జిల్లాలో ఉండగానే గుత్తి మండలం బసినేపల్లి క్రాస్‌ వద్ద పత్తికొండ, ఆదోని, మంత్రాలయం మీదుగా వెళ్లాల్సిన వాహనాలను రెండు గంటలపాటు నిలిపివేశారు. సాయంత్రం 4.30 గంటలకు గుత్తి పట్టణంలోకి బస్సు యాత్ర ప్రవేశించింది. 5.30 గంటలకు గుత్తి శివారులోని ఓ ప్రైవేటు పాఠశాల వద్ద జగన్‌ కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్నారు. ఆ సమయంలోనూ హైదరాబాద్‌- బెంగళూరు జాతీయ రహదారిపై ట్రాఫిక్‌ నిలిపివేశారు. సుమారు 5 కిలోమీటర్ల వరకు ట్రాఫిక్‌ నిలిచిపోయి వాహనదారులు ఇబ్బందిపడ్డారు. సీఎం జగన్‌ గుత్తి నుంచి జాతీయ రహదారి మీదుగా అనంతపురం చేరుకునే వరకు ట్రాఫిక్‌ను ఒకవైపునకు మళ్లించారు. దీంతో 50 కిలోమీటర్ల దూరానికి 4.30 గంటల సమయం పట్టిందని వాహనదారులు వాపోయారు. బస్సుయాత్ర ఆలస్యం కావడంతో వైకాపా నాయకులు తరలించిన జనం జగన్‌ రాక ముందే ఇళ్లకు వెళ్లిపోయారు.

గుత్తివాసులకు 12 గంటల ఉక్కపోత

జగన్‌ బస్సుయాత్ర ఉదయం 10:30 గంటలకే గుత్తి చేరుకుంటుందని.. అక్కడే మధ్యాహ్నం 3 గంటల వరకు విశ్రాంతి తీసుకుంటారని ముందురోజు ప్రకటించారు. సీఎం ప్రయాణించే బస్సుకు అసౌకర్యం కలగకూడదనే కారణంతో ఉదయం 8 గంటలకే గుత్తిలో కరెంటు నిలిపివేశారు. బస్సు యాత్ర పూర్తయిన తర్వాత కూడా కరెంటు ఇవ్వలేదు. రాత్రి 8.40 గంటలకు సరఫరాను పునరుద్ధరించారు. దీంతో 12 గంటలపాటు ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోయారు. కరెంటు లేకపోవడంతో ఆసుపత్రుల్లోని రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బేకరీలు, శీతల పానీయాల దుకాణాల్లో వ్యాపారం జరగక నష్టపోయినట్లు యజమానులు వాపోయారు. సీఎం జగన్‌ రావడానికి రెండు గంటల ముందే గుత్తిలో ట్రాఫిక్‌ నిలిపివేయడంతో రైల్వేస్టేషన్‌కు వెళ్లాల్సిన ప్రయాణికులు 3 కిలోమీటర్లు కాలినడకన వెళ్తూ కనిపించారు.

మాటైనా మాట్లాడకుండా వెళ్లిపోయిన సీఎం

బస్సుయాత్ర సందర్భంగా గుంతకల్లు ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి పెద్దఎత్తున జనాల్ని గుత్తికి తరలించారు. మహిళా కూలీలకు రూ.500 చొప్పున ఇచ్చి ఆటోల్లో తీసుకొచ్చారు. పురుషులకు డబ్బుతోపాటు మద్యం సీసాలు పంచారు. గుత్తిలోని మహాత్మాగాంధీ కూడలికి మధ్యాహ్నం 12 గంటలకే జనాల్ని తరలించారు. జగన్‌ రాక 6 గంటలు ఆలస్యమవడంతో జనాలు ఎండకు మాడిపోయారు. బస్సుయాత్ర వచ్చేసరికి పట్టుమని 3 వేల మంది కూడా మిగల్లేదు. ఉన్న కొద్దిపాటి జనాలకు బస్సు పైనుంచి అభివాదం చేసుకుంటూనే జగన్‌ ఒక్కమాటైనా మాట్లాడకుండానే ముందుకు వెళ్లిపోయారు.


పొలాలు ఎండుతున్నాయి..

ఈనాడు, కర్నూలు: ‘పల్లెల్లో చెరువులకు నీరు చేరక రైతులమంతా అవస్థలు పడుతున్నాం. కుళాయిల్లో నీరు రాక దాహంతో తల్లడిల్లుతున్నాం..’ అని పలు గ్రామాల ప్రజలు ముఖ్యమంత్రి జగన్‌కు వివరించారు. ‘మేమంతా సిద్ధం’ కార్యక్రమంలో భాగంగా శనివారం కర్నూలు జిల్లా తుగ్గలిలో ఆయన ‘ముఖాముఖి’ నిర్వహించారు. ఇందులో పలువురు స్థానికులు తమ సమస్యలు వివరించారు. తుగ్గలి మండలంలో దుర్భిక్ష పరిస్థితులున్నాయని, కరవు మండలంగా ప్రకటించాలని రాతన గ్రామానికి చెందిన సురేశ్‌ కోరారు. ఆయన ఉపాధి హామీ మేటీగానూ విధులు నిర్వహిస్తున్నారు. రైతు రుణాలను మాఫీ చేయాలని ఇదే గ్రామానికి చెందిన శ్యామలాదేవి కోరారు. పంటలు బాగా పండినప్పుడు ధరలు ఉండటం లేదని, ధరలు ఉన్నప్పుడు పంటలు చేతికందడం లేదని హోసూరుకు చెందిన లాల్‌బాషా వాపోయారు. రైతులకూ పింఛను ఇచ్చే అవకాశాన్ని పరిశీలించాలని కోరారు.

 తుగ్గలిలో ముఖాముఖి సందర్భంగా గ్రామానికి ఏమైనా ప్రత్యేక హామీలిస్తారేమోనని ఎదురుచూసినవారికి నిరాశ తప్పలేదు. ఉదయం 9.30 గంటలకు కార్యక్రమం ప్రారంభిస్తామని 11 గంటలకు మొదలుపెట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని