‘వివేకం’ చిత్రానికి విశేష ఆదరణ

ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి బాబాయ్‌, మాజీ మంత్రి వై.ఎస్‌.వివేకానందరెడ్డి బయోపిక్‌గా తెరకెక్కిన ‘వివేకం’ చిత్రానికి యూట్యూబ్‌లో విశేష ఆదరణ లభిస్తోంది.

Updated : 01 Apr 2024 17:44 IST

విడుదలైన ఒక్క రోజులోనే యూట్యూబ్‌లో 10 లక్షలకుపైగా వీక్షణలు

ఈనాడు, అమరావతి: ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి బాబాయ్‌, మాజీ మంత్రి వై.ఎస్‌.వివేకానందరెడ్డి బయోపిక్‌గా తెరకెక్కిన ‘వివేకం’ చిత్రానికి యూట్యూబ్‌లో విశేష ఆదరణ లభిస్తోంది. శుక్రవారం విడుదలైన ఒక్కరోజులోనే యూట్యూబ్‌లో 10 లక్షల వీక్షణలు లభించాయి. సీబీఐ ఛార్జిషీట్‌లోని అంశాల ఆధారంగా ‘టీమ్‌ ఎస్‌ క్యూబ్‌’ ఈ చిత్రానికి దర్శకత్వం వహించింది. వివేకా హత్య అనంతరం అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్‌ విలేకరులతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యల వీడియోను చిత్రంలో యథాతథంగా చూపించారు. ఓవైపు జగన్‌ పాత్రధారి నోట ఈ డైలాగ్‌లను పలికిస్తూ, సమాంతరంగా అప్పట్లో జగన్‌ చేసిన వ్యాఖ్యల ఒరిజనల్‌ వీడియో చూపించారు.

అధికార దాహమే వివేకా హత్యకు కారణం

నాటి ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డి అధికార దాహం.. ఆయన బాబాయ్‌ వివేకా హత్యకు ఎలా దారి తీసింది? సీఎం కుర్చీమీద జగన్‌ పాత్రధారికి ఉన్న మోహం రక్తసంబంధాన్ని ఎలా బలితీసుకుంది? వివేకాపై గొడ్డలివేటు వేయడానికి కుట్ర ఎక్కడ మొదలైంది? ఎవరెవరు అమలుచేశారు? వారి వెనక ఎవరెవరు ఉన్నారు? అనే అంశాలను ‘వివేకం’ సినిమాలో చూపించారు. సీబీఐ ఛార్జిషీట్‌లోని అంశాల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ‘హూ కిల్డ్‌ బాబాయ్‌’ అంటూ బాగా ప్రాచుర్యం పొందిన ప్రశ్నతో మొదలుపెట్టి ఈ చిత్రంలో వివేకా హత్యకు దారితీసిన పరిణామాలను చూపించారు. ‘జగనే రణమై చేశాడు నేరం. జరిగింది జగన్మోహన పట్టాభిషేకం’ అంటూ మొత్తం కథను ఒకే వాక్యంలో చెప్పారు.

‘రాయలసీమ ప్రాంతంలో జనం దైవ సమానంగా కొలిచే ఓ రాజు.. ఆయన కడుపున రాక్షసమృగం పుట్టింది. అది అధికారకాంక్షతో రగిలిపోతూ మంచీచెడూ మరిచిపోయి తన మన భేదం లేకుండా మారణహోమాన్ని తలపించే భీకర యుద్ధాన్ని సృష్టించి ఎదగటం ప్రారంభించింది’ అంటూ సీఎం జగన్‌ పాత్రధారిని ఉద్దేశించిన నేపథ్య వ్యాఖ్యానంతో దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని తెరపై చూపిస్తూ సినిమా కథ మొదలవుతుంది. ఆ తర్వాత ‘వెల్‌కమ్‌ టు పులివెందుల’ అంటూ వైఎస్‌ వంశవృక్షం ఆధారంగా వారి కుటుంబంలోని ఒక్కో పాత్ర పరిచయమవుతుంది. జగన్‌మోహన్‌రెడ్డి సతీమణి భారతికి కడప ఎంపీ అవినాష్‌రెడ్డి మేనమామ కుమారుడు. ఆయన రాజకీయ భవిష్యత్తు కోసం జరిగిన యుద్ధమే ఈ కథ.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని