గురువులకూ చుట్టేశారు గుండు సున్న!

అధికారంలోకి వచ్చేందుకు ఐదేళ్ల కిందట జగన్‌ చెప్పని మాట లేదు...  ఇవ్వని హామీ లేదు... ప్రైవేటు టీచర్లకు ఎన్నో ఆశలు కల్పించారు... తీరా గద్దెనెక్కిన తర్వాత తూచ్‌ అనేశారు.

Updated : 31 Mar 2024 13:36 IST

ప్రైవేటు ఉపాధ్యాయులకు కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత కరవు 
పాదయాత్రలో మాటిచ్చి మరచిన జగన్‌ 
పాఠశాల విద్య కమిషన్‌ను నామమాత్రంగా మార్చేసిన వైనం 
కరోనా సమయంలోనూ ఆదుకోని వైకాపా సర్కారు

అధికారంలోకి వచ్చేందుకు ఐదేళ్ల కిందట జగన్‌ చెప్పని మాట లేదు...  ఇవ్వని హామీ లేదు... ప్రైవేటు టీచర్లకు ఎన్నో ఆశలు కల్పించారు... తీరా గద్దెనెక్కిన తర్వాత తూచ్‌ అనేశారు... రాష్ట్రంలోనే అతిపెద్ద ప్రైవేటు వ్యవస్థను... వైకాపా సర్కారు అసలేమీ పట్టించుకోలేదు... అందుకే గురువులంతా కలిసి... ఈసారి గుణపాఠం చెప్పేందుకు సిద్ధమయ్యారు!


కార్పొరేట్‌, ప్రైవేటు విద్యాసంస్థల టీచర్లు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించాం. మన ప్రభుత్వం రాగానే అసెంబ్లీలో తీర్మానం చేసి చట్టం తీసుకొస్తాం. కనీస వేతనం, రెగ్యులర్‌గా జీతాలు, పని గంటలు, సెలవులు, పీఎఫ్‌, ఈఎస్‌ఐ, ఆరోగ్యబీమా తదితరాలన్నీ వర్తించేలా చూస్తాం.

ప్రతిపక్ష నేతగా జగన్‌ హామీ


బద్ధాలు, మాయమాటలతో ఆకాశానికి నిచ్చెనలు వేయడంలో జగన్‌ దిట్ట. గత ఎన్నికల ముందు అధికారంలోకి వచ్చేందుకు ఏదేదో చేసేస్తామని ప్రజలను నమ్మించిన ఆయన.. సీఎం పీఠంపై కూర్చున్నాక హామీల తెప్పను తగలేశారు. అన్ని వర్గాల మాదిరే లక్షల మంది ప్రైవేటు ఉపాధ్యాయులనూ మోసం చేశారు. పాదయాత్ర సమయంలో వారు ఎక్కడ కనిపించినా.. ఉద్యోగ జీవితానికి భద్రత కల్పిస్తానంటూ అర చేతిలో స్వర్గం చూపించారు. అధికారంలోకి వచ్చాక ఆ మాటే మరిచారు. కనీస వేతనాలు, ఆరోగ్య బీమా, ఈఎస్‌ఐ, పీఎఫ్‌లాంటి సదుపాయాలు అమలు చేసేందుకు ఐదేళ్లలో ఒక్కసారైనా పట్టించుకున్న పాపాన పోలేదు. కరోనా సమయంలో ఉపాధి కరవై.. జీవనోపాధి కోసం వారి కుటుంబాలు రోడ్డున పడినా ఎలాంటి సాయం చేయలేదు. కొందరు కుటుంబ పోషణ కోసం... ఉపాధి హామీ కూలీలుగా, రోడ్డు పక్కన దుస్తుల వ్యాపారులుగా, కరోనా వార్డులకు మందుల సరఫరాదారులుగా, సెక్యూరిటీ గార్డులుగా పనిచేశారు. అయినా, నాడు జగన్‌ మనసు ఏమాత్రం చలించలేదు.


4 లక్షల మంది ప్రైవేటు ఉద్యోగులు...

రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, లెక్చరర్లు కలిపి నాలుగు లక్షల మందికిపైగా ఉన్నారు. ప్రైవేటురంగంలో ఇంత పెద్ద సంఖ్యలో ఉద్యోగులున్న వ్యవస్థ మరొకటి లేదు. వైకాపా అధికారంలోకి వచ్చాక ప్రైవేటు ఉపాధ్యాయ, లెక్చరర్ల సంఘాల ప్రతినిధులు పలుమార్లు తమ సమస్యలను వినతిపత్రాల ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. కానీ, సర్కారు మాత్రం వీరిని అసలు లెక్కలోకే తీసుకోలేదు.

  • అరకొర జీతాలతో కుటుంబాలను నెట్టుకొస్తున్నామని, తమకూ కనీస వేతనాలు అందేలా చూడాలని ఉపాధ్యాయులు, లెక్చరర్లు కొన్నేళ్లుగా కోరుతున్నారు.
  • కొన్నిచోట్ల వారంలో ఒక్కరోజు సెలవు దొరకడమూ కష్టంగా ఉంటోంది. ఉదయం పాఠశాల, కళాశాలకు వెళ్లింది మొదలు... ఇంటికొచ్చే వరకు విరామం లేకుండా బోధించాల్సి ఉంటుంది. ఈ పరిస్థితి నుంచి కాస్త ఉపశమనం దక్కేలా చూడాలని విన్నవించారు.
  • దురదృష్టవశాత్తు ఏదైన అనుకోని సంఘటన ఎదురైతే కుటుంబం మొత్తం రోడ్డు పడాల్సి వస్తోందని, ప్రభుత్వం ప్రత్యేకంగా ఆరోగ్య కార్డులు, బీమా అమలు చేయాలని కోరుతున్నారు. ప్రభుత్వం కొందరికి మాత్రమే నవరత్నాల్లో ఇచ్చే వాటినే అందిస్తోంది.
  • పట్టణాల్లో నెలకు రూ.12 వేలు, గ్రామాల్లో నెలకు రూ.10 వేల కంటే ఎక్కువ ఆదాయం ఉందని కొందరు ప్రైవేటు ఉపాధ్యాయులకు ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో కోత విధిస్తున్నారు. అద్దె ఇళ్లలో ఉంటున్న తమకు ఈ వేతనాలను సాకుగా చూపి పథకాలు దక్కకుండా చేయడం సరికాదని వారు వాపోతున్నారు.

కోరలు లేని కమిషన్‌ ఎందుకు?

ప్రైవేటు ఉపాధ్యాయుల భద్రత కోసమంటూ ‘పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌’ను జగన్‌ సర్కారు తీసుకొచ్చినా... దానికి కోరలు లేకుండా చేసింది. ఈ కమిషన్‌కు మూడేళ్లకోసారి నూతన కార్యవర్గాన్ని నియమించాల్సి ఉండగా.. 2022 అక్టోబరు నుంచి ఆ ఊసేలేదు. దాదాపు 18 నెలల నుంచి ఒక్క ఛైర్మన్‌తోనే ఈ కమిషన్‌ కొనసాగుతోంది. ప్రైవేటు ఉపాధ్యాయుల సమస్యలపై గతంలో ఓ కమిటీ నివేదిక సమర్పించినా... ఇంతవరకు దానిపై జగన్‌ స్పందించిన దాఖలాలే లేవు. ఒకపక్క చట్టాన్ని తీసుకొచ్చామని గొప్పగా చెబుతున్న జగన్‌.. అది సక్రమంగా పనిచేసేలా చూడటంలో విఫలమయ్యారు.


భర్తీ చేస్తే కొందరికైనా అవకాశం

ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తే ప్రైవేటులో పనిచేస్తున్న కొందరికైనా అవకాశం లభిస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ బడుల్లో 25 వేలకుపైగా ఖాళీలు ఉంటే... సర్కారు మాత్రం 6,100 పోస్టులకే డీఎస్సీ ప్రకటించింది. గత ఎన్నికల ముందు మెగా డీఎస్సీ నిర్వహిస్తామని బీరాలు పోయి, గడిచిన ఐదేళ్లు ఏమాత్రం పట్టించుకోని జగన్‌.. ఇప్పుడు ఎన్నికల నేపథ్యంలో నోటిఫికేషన్‌ ఇచ్చారు. ప్రభుత్వ ఉదాసీనతతో ప్రైవేటులో పనిచేస్తున్న వారి కష్టాలు అరణ్య రోదనగానే మిగిలిపోతున్నాయి.


ఉపాధ్యాయ విద్యకు తగ్గిన ఆదరణ

ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగాలు తగ్గిపోవడం, ప్రైవేటులో భద్రత లేకపోవడంతో బీఈడీ, డీఈడీ కోర్సుల్లో చేరేవారి సంఖ్య ఏటా గణనీయంగా తగ్గిపోతోంది. రాష్ట్రవ్యాప్తంగా 411 బీఈడీ కళాశాలలు ఉండగా.. వాటిలో 34 వేల సీట్లు ఉన్నాయి. కన్వీనర్‌ కోటాలో సుమారు 24 వేల సీట్లుంటే మూడు వేలకు మించి ప్రవేశాలు పొందడంలేదు. డీఈడీలో ప్రభుత్వ కళాశాలలు మినహా మరెక్కడా విద్యార్థులు ప్రవేశాలు పొందుతున్న దాఖలాలే లేవు. 

ఈనాడు, అమరావతి


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని