‘ఎన్నికల’ డీఎస్సీ వాయిదా

ఎన్నికల ముందు నిరుద్యోగ యువతను మభ్యపెట్టేందుకు జగన్‌ సర్కార్‌ ప్రకటించిన డీఎస్సీకి ఎన్నికల కోడ్‌తో బ్రేక్‌ పడింది.

Updated : 31 Mar 2024 06:40 IST

కోడ్‌ ముగిసిన తర్వాతే టెట్‌ ఫలితాల విడుదల, డీఎస్సీ నిర్వహణ
రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశం
యువతను మభ్యపెట్టి ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూసిన జగన్‌
ఉపాధ్యాయ నియామకాలు జరగవని తెలిసే ఎన్నికల ముందు ప్రకటన
అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డీఎస్సీ ప్రకటిస్తామంటూ తెదేపా హామీ

ఈనాడు, అమరావతి: ఎన్నికల ముందు నిరుద్యోగ యువతను మభ్యపెట్టేందుకు జగన్‌ సర్కార్‌ ప్రకటించిన డీఎస్సీకి ఎన్నికల కోడ్‌తో బ్రేక్‌ పడింది. కోడ్‌ ముగిసిన తర్వాతే ఏపీ హైకోర్టు ఆదేశాల మేరకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) ఫలితాలు విడుదల చేయాలని, ఉపాధ్యాయ నియామక పరీక్ష (డీఎస్సీ) నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీచేసింది. ఎన్నికల నియమావళి కారణంగా డీఎస్సీ నిర్వహణ ఆగిపోతుందని ముందే తెలిసే.. నిరుద్యోగులను మోసం చేసేందుకు జగన్‌ డీఎస్సీ ప్రకటించారంటూ ప్రతిపక్షాలు విమర్శిస్తూ వచ్చాయి. 2019 ఎన్నికలకు ముందు మెగా డీఎస్సీ నిర్వహిస్తామని హామీ ఇచ్చిన జగన్‌ అధికారంలోకి వచ్చి.. నాలుగున్నరేళ్లు నిద్రపోయారు. ఇప్పుడు 2024 ఎన్నికలకు ముందు నిద్ర లేచి, డీఎస్సీ అంటూ హడావుడి చేశారు. ఎన్నికల షెడ్యూల్‌ రావడానికి నెల ముందు 6,100 అరకొర పోస్టులతో డీఎస్సీ ప్రకటించారు. అది కూడా సక్రమంగా చేయకుండా, ప్రకటనలో గందరగోళం సృష్టించారు. న్యాయచిక్కుల కారణంగా మొదట్లోనే వాయిదాల పర్వం కొనసాగింది. ఈలోపు ఎన్నికల కోడ్‌ వచ్చేసింది. జగన్‌ స్వార్థ ఆలోచనలకు ఈ డీఎస్సీనే పెద్ద నిదర్శనం. యువతకు ఏదో మేలుచేసినట్లు నటించడం.. తరువాత దాన్ని ముందుకు కదలకుండా చేయడంలో జగన్‌ను మించిన వారు ఉండరంటే అతిశయోక్తి కాదు.

వివాదాలు సృష్టించిన జగన్‌ సర్కార్‌..

ఎన్నికల ముందు డీఎస్సీ ప్రకటించిన జగన్‌ సర్కార్‌.. ఆ ప్రక్రియను ముందుకెళ్లకుండా అడ్డుకునేందుకు కావాలనే అర్హతల్లో అయోమయం సృష్టించింది. సుప్రీంకోర్టు తీర్పునకు వ్యతిరేకంగా సెకండరీ గ్రేడ్‌  టీచర్‌(ఎస్జీటీ) పోస్టులకు బీఈడీ వారికి అర్హత కల్పించింది. బీఈడీ చేసిన వారికి ఎస్జీటీ పోస్టులకు అర్హత లేదని మొదట జనవరి 26న జీవో 4ను ప్రవీణ్‌ప్రకాష్‌ జారీ చేశారు. తర్వాత ఫిబ్రవరి 12న జారీ చేసిన డీఎస్సీ నోటిఫికేషన్‌లో ఎస్జీటీ పోస్టులకు బీఈడీ వారికి అర్హత కల్పించారు. 17 రోజుల్లోనే రెండు విరుద్ధ నిర్ణయాలను ప్రకటించారు. ఈ గందరగోళంపై కొందరు అభ్యర్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఎస్జీటీ పోస్టులకు బీఈడీ వారు అనర్హులంటూ న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. న్యాయస్థానం ఆదేశాలతో ప్రభుత్వం డీఎస్సీ దరఖాస్తు గడువును ఫిబ్రవరి 21 నుంచి 25 వరకు పొడిగించింది. అభ్యర్థులకు సన్నద్ధత సమయం ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశాలివ్వడంతో డీఎస్సీ పరీక్షను మార్పు చేసింది. మార్చి 15 నుంచి నిర్వహించాల్సిన పరీక్షలను మార్చి 30 నుంచి ఏప్రిల్‌ 30 వరకు నిర్వహిస్తామంటూ ప్రకటించింది. ఎన్నికల కోడ్‌ వచ్చిన నేపథ్యంలో టెట్‌ ఫలితాల విడుదల, డీఎస్సీ నిర్వహణపై ఈసీ నిర్ణయం కోసం నివేదిక పంపారు. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం శనివారం తన నిర్ణయాన్ని ప్రకటించింది. కోడ్‌ ముగిశాకే టెట్‌ ఫలితాలు వెల్లడించాలని, డీఎస్సీ నిర్వహించుకోవాలని సూచించింది. ఇలా ప్రభుత్వమే వివాదం సృష్టించి వాయిదాకు కారణమైంది.

తొలిరోజే మెగా డీఎస్సీ ఇస్తామంటూ తెదేపా హామీ

రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం వస్తూనే తొలిరోజు తొలి సంతకం మెగా డీఎస్సీపైనే పెడతామని తెదేపా అధినేత చంద్రబాబు ఇప్పటికే ప్రకటించారు. 2014-19 మధ్య తెదేపా హయాంలో రెండుసార్లు డీఎస్సీ నిర్వహించారు. డీఎస్సీ-2014లో 10,313 పోస్టులు భర్తీ చేయగా.. డీఎస్సీ-2018లో 7,902 పోస్టులకు ప్రకటన ఇచ్చారు. వీటిని భర్తీచేసే సమయానికి వైకాపా అధికారంలోకి వచ్చింది. ఉమ్మడి ఏపీ నుంచి విభజిత ఏపీ వరకు చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో మొత్తం 8 సార్లు డీఎస్సీ ప్రకటించడం విశేషం.


టెట్‌ ఫలితాలు, డీఎస్సీ వాయిదా: కమిషనర్‌

కేంద్ర ఎన్నికల కమిషనర్‌ ఆదేశాల మేరకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌) ఫలితాలు, ఉపాధ్యాయ నియామక పరీక్షల నిర్వహణను తాత్కాలికంగా వాయిదా వేసినట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ సురేష్‌ కుమార్‌ తెలిపారు. కొత్త తేదీలతో షెడ్యూల్‌ను తరువాత ప్రకటిస్తామని వెల్లడించారు. ‘‘మార్చి 30 నుంచి ఏప్రిల్‌ 30 వరకు డీఎస్సీ నిర్వహించేందుకు షెడ్యూల్‌ ఇచ్చాం. ఇంతలో ఎన్నికల కోడ్‌ అమల్లోకి రావడంతో టెట్‌ ఫలితాలు, ఉపాధ్యాయ నియామక పరీక్షలు నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి కోరింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్నందున కోడ్‌ ముగిసే వరకు వాయిదా వేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది’’ అని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని