ప్రవీణ్‌ ప్రకాశ్‌.. ఎన్నికల కోడ్‌ ఉండగా ఇదేం తీరు?

‘‘రాష్ట్ర ప్రభుత్వం డిజిటల్‌ విద్యకు రూ.కోట్లు వెచ్చిస్తోంది. గతంలో ఇంత ఎప్పుడైనా ప్రభుత్వం ఖర్చు పెట్టిందా’’ అంటూ పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ప్రకాశ్‌ వ్యాఖ్యానించడం వివాదాస్పదంగా మారింది.

Updated : 31 Mar 2024 09:33 IST

అధికార పార్టీకి అనుకూలంగా వ్యాఖ్యలు
డిజిటల్‌ విద్యకు ప్రభుత్వం అధికంగా ఖర్చు చేస్తోందంటూ కితాబు

ఈనాడు, విజయనగరం, గుమ్మలక్ష్మీపురం, న్యూస్‌టుడే: ‘‘రాష్ట్ర ప్రభుత్వం డిజిటల్‌ విద్యకు రూ.కోట్లు వెచ్చిస్తోంది. గతంలో ఇంత ఎప్పుడైనా ప్రభుత్వం ఖర్చు పెట్టిందా’’ అంటూ పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ప్రకాశ్‌ వ్యాఖ్యానించడం వివాదాస్పదంగా మారింది. ఎన్నికల నియమావళి అమలులో ఉన్న సమయంలో పాఠశాలల తనిఖీలంటూ ఆయన అధికార పార్టీకి అనుకూలంగా వ్యాఖ్యలు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. త్వరలో ఉపాధ్యాయులు పోలింగ్‌ విధులకు హాజరవ్వనున్నారు. ఈ పరిస్థితుల్లో తనిఖీల పేరుతో వారిని ఒత్తిడికి గురి చేయడంపైనా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.

పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలంలో శనివారం ఆయన పలు పాఠశాలలను తనిఖీ చేశారు. ఆధునిక విజ్ఞానం అందుబాటులో ఉన్నా.. ఆయా వనరులను వినియోగించడం రాకపోతే ఎలా అని ఉపాధ్యాయులు, అధికారులను ప్రవీణ్‌ ప్రకాశ్‌ ప్రశ్నించారు. ‘‘గతేడాది పాఠశాలల తనిఖీ చేసి చర్యలు తీసుకుంటే ప్రవీణ్‌ప్రకాశ్‌ డౌన్‌ డౌన్‌ అన్నారు.. ఇప్పుడూ అలా అంటారా.. ఇప్పుడు చర్యలు తీసుకుంటే ఏం చేస్తారు.. ఏడాదిలో 12 సార్లు చెప్పినా ఎందుకు నా మాటలు పట్టించుకోరు.. ఆధునిక సాంకేతికతపై సాధన చేయకుండా నన్నెందుకు అవమానిస్తున్నారు’’ అని అసహనం వ్యక్తం చేశారు. గుమ్మలక్ష్మీపురం జడ్పీ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు భీముడును డిజిటల్‌ బోర్డుపై గణితంలో ఉపరితలాలకు సంబంధించిన అంశాన్ని చూపమని ఆదేశించారు. ఆయనతోపాటు డిప్యూటీ డీఈవో కృష్ణమూర్తి, డీఈవో పగడాలమ్మ డిజిటల్‌ బోర్డును నిర్వహించలేకపోయారు. నోడల్‌ అధికారి సైతం సరైన సమాధానం చెప్పలేకపోయారు. దీంతో ఆయన వెంట ఉన్న ఐఏఎస్‌ అధికారి, పార్వతీపురం ఐటీడీఏ పీవో విష్ణుచరణ్‌తో పాటు ఇతర అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సచివాలయ విద్యా సహాయకులు, వాలంటీర్ల సమన్వయంతో పాఠశాలల్లో ప్రవేశాలను పూర్తిస్థాయిలో పెంచాలని ఆదేశించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని