అనంత పట్టు రైతుకు పుట్టెడు కష్టాలు

పట్టుగూళ్లు కేజీ రూ.650 ఉండేది. ఇప్పుడు రూ.300లకూ అమ్ముకోలేని పరిస్థితి. కిలోకు రూ.50 చొప్పున ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకాల్లోనూ ఇప్పటికీ రూ.4 కోట్ల బకాయిలు ఉన్నాయి.

Published : 31 Mar 2024 05:28 IST

ప్రోత్సాహకాలు పెంచుతామని.. నట్టేట ముంచిన వైకాపా ప్రభుత్వం
ఐదేళ్లలో అనంతపురం రైతులకే రూ.50 కోట్ల బకాయి
పింఛన్లు పీకేసి, రాయితీలు ఎత్తేసి.. మళ్లీ మాయ యాత్రలా!
పట్టు నేసే కార్మికులనూ దగా చేశారే..

పట్టుగూళ్లు కేజీ రూ.650 ఉండేది. ఇప్పుడు రూ.300లకూ అమ్ముకోలేని పరిస్థితి. కిలోకు రూ.50 చొప్పున ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకాల్లోనూ ఇప్పటికీ రూ.4 కోట్ల బకాయిలు ఉన్నాయి. ఒక్కసారి ఆలోచించమని మిమ్మల్ని కోరుతున్నా. వైకాపా అధికారంలోకి రాగానే పట్టు రైతులకు ప్రోత్సాహకాలు పెంచుతామని హామీ ఇస్తున్నా.’’

 2019 ఏప్రిల్‌ 4న ఎన్నికల ప్రచారం కోసం హిందూపురం వచ్చిన సందర్భంగా జగన్‌ అన్న మాటలివి.


ఈనాడు, అమరావతి- ఈనాడు డిజిటల్‌, అనంతపురం: ప్రోత్సాహకాలనందిస్తా.. మిమ్మల్ని నిలబెడతానంటూ ఎన్నికల ముందు తేనె పలుకులు పలికి నేతన్నను నమ్మించిన జగన్‌.. అధికారంలోకొచ్చాక వారిని నిలువునా ముంచారు. గత ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహకాలు సరిపోలేదని, వాటిని పెంచుతామన్న ఆయన.. సీఎం పీఠం ఎక్కాక మాట తప్పారు. కిలో పట్టుగూళ్లకు రూ.50 చొప్పున గత తెదేపా ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహకాన్ని అధికారంలోకి వచ్చాక జగన్‌ పూర్తిగా నిలిపివేశారు. ఓ వైపు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకం అందక, మరోవైపు మార్కెట్లో పట్టుగూళ్ల ధరలు పడిపోవడంతో రైతులు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయారు. చంద్రబాబు ప్రభుత్వం అందించిన రాయితీలనూ జగన్‌ నిలిపివేశారు. దీంతో పెట్టుబడులు రెండింతలు పెరిగిపోయాయి రైతులు అల్లాడిపోయారు. ఐదేళ్లలో సగటున ఒక్కో రైతుకు రూ.లక్ష నుంచి రూ.3 లక్షల వరకూ ప్రోత్సాహకాలు చెల్లించాల్సి ఉంది. ఇవన్నీ చెల్లించకుండా మోసం చేస్తున్న జగన్‌.. ఇప్పుడు ఏం మాయమాటలు చెప్పడానికి వస్తున్నారు? ఎన్నికలు వచ్చాయని మళ్లీ అనంతపురం వచ్చారు.. ఈ సందర్భంలోనైనా గతంలో మీరిచ్చిన హామీలు గుర్తుకు తెచ్చుకొని.. రైతన్నలు, నేతన్నల బాధలపై చర్చించే మనసుందా మీకు..?


నాడు:  జగన్‌ మొసలికన్నీరు..
నేడు:  రైతుల రక్తకన్నీరు!

2019 ఎన్నికల ప్రచారంలో పట్టు పరిశ్రమపై సీఎం జగన్‌ మొసలి కన్నీరు ఒలకబోశారు. నిజంగా తెదేపా, వైకాపా ప్రభుత్వాల హయాంలో ఆ రంగం ఎలా ఉందో పరిశీలిద్దాం..!


తెదేపా ప్రభుత్వ హయాంలో లబ్ధి ఇలా..

 • పట్టు రైతులకు పెద్దమొత్తంలో రాయితీలు అందించారు.
 • బైవోల్టిన్‌ పట్టు సాగు చేసే వారికి ఎరువులు, మందులను రాయితీతో అందించా. పట్టుగూళ్లను మార్కెట్‌లో విక్రయించిన రైతులకు కిలోకు రూ.50 చొప్పున ప్రోత్సాహకం ఇచ్చారు.
 • పట్టు రైతు రూ.1,250 చెల్లిస్తే రూ.5,000 విలువైన రోగ నిరోధక మందులు, బ్లీచింగ్‌, సున్నం వంటివి అందిచారు.
 • నేత కార్మికులకు ముడి పట్టుపై కిలోకు రూ.500 చొప్పున 4 కిలోల వరకు రాయితీ ఇచ్చారు. ఇలా నెలకు రూ.2 వేలు, ఏడాదికి రూ.24 వేల లబ్ధి చేకూర్చారు.
 •  ఆదరణ పథకం కింద చేనేతలకు వృత్తి పరికరాలు ఇచ్చారు. ఒక్క ధర్మవరంలోనే 10 వేల మందికి లబ్ధి కలిగింది.
 • ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ధర్మవరం, పుట్టపర్తి, ఉరవకొండ ప్రాంతాల్లో క్లస్టర్లు ఏర్పాటు చేసి చేనేత వృత్తిలో నైపుణ్య శిక్షణ ఇచ్చారు. అనంతపురంలోనే 10 వేల మందికి శిక్షణ ఇప్పించారు.
 • రుణాలు ఇప్పించి వ్యాపారాలు చేసుకునేలా ప్రోత్సహించారు.
 • చేనేత ఉత్పత్తులపై ఎలాంటి పన్నులు ఉండేవి కాదు.

జగన్‌ మోసానికి సాక్ష్యాలిగో..

జగన్‌ హయాంలో నేతన్న బతుకు రోడ్డున పడింది. అయిదేళ్లలో ఉమ్మడి అనంతపురం జిల్లాలోనే 40 మంది చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు. చాలా కుటుంబాలకు పరిహారమూ ఎగ్గొట్టారు.

 •  50 ఏళ్లు నిండిన నేతన్నలకు పింఛను ఇస్తామని హామీ ఇచ్చిన జగన్‌.. అధికారంలోకి వచ్చాక నిబంధనల సాకుతో అప్పటివరకూ పింఛను పొందుతున్న వారికీ రాకుండా చేశారు.
 • నేతన్నలకు ఏటా రూ.24 వేలు ఇస్తామన్నారు.. కేవలం సొంత మగ్గాలు ఉన్నవారికే ‘నేతన్న నేస్తం’ పేరుతో సాయం అందిస్తున్నారు. ఫోర్‌ వీలర్‌ ఉందని, 10ఎకరాల భూమి ఉందని చెప్పి 15 వేల మందికి కోత పెట్టారు. ధర్మవరం నియోజకవర్గంలో 80 వేల మంది కార్మికులుంటే.. కేవలం 10 వేల మందికే ‘నేతన్న నేస్తం’ వస్తోంది.
 • పింఛను కోసం దరఖాస్తు చేసుకున్న నేతన్నలకు నిబంధనల మెలికలు పెట్టి.. దరఖాస్తులు నిలిపివేశారు. గతేడాది జులై నుంచి ఈ ఏడాది జనవరి వరకు పింఛన్‌ కోసం దరఖాస్తు చేసుకున్నవారికి ఎదురుచూపులే మిగిలాయి.

వైకాపా పాలనలో అదనపు భారం...

 • వైకాపా వచ్చిన తొలి ఏడాది అరకొరగా ప్రోత్సాహకాలు ఇచ్చి, ఆ తరువాత నిలిపివేశారు.
 • ఈ అయిదేళ్లలో రూ.50 కోట్ల బకాయి పెట్టారు.
 • రాయితీ మందులు నిలిపివేయడంతో రైతులు అధిక ధరలు చెల్లించి ప్రైవేటుగా కొనుగోలు చేయాల్సి వస్తోంది. ఈ మందుల విషయంలోనే ప్రతి రైతుకూ ఒక్కో పంటపై రూ.4 వేల నుంచి 5 వేల అదనపు భారం పడుతోంది.
 • ముడి పట్టుపై రాయితీలనూ పూర్తిగా ఎత్తేశారు.
 • నేత సామగ్రిపై రాయితీని నిలిపివేశారు.
 • ఒక్కరికీ శిక్షణ ఇవ్వలేదు. క్టస్లర్లనూ మూసేశారు.
 • పరిశ్రమల దిక్కే లేదు.. ఇంకా రుణాలు ఇప్పించిన దాఖలాలెక్కడివి.
 • జగన్‌ అధికారంలోకి వచ్చాక పట్టు ఉత్పత్తులపై 18% జీఎస్టీ విధించారు. పైగా కరెంటు ఛార్జీలు పెంచడంతో పెట్టుబడి భారం పెరిగిపోయింది.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని