ఫిఫోకు ఎగనామం... రూ.3,300 కోట్ల చెల్లింపులు

ప్రభుత్వ ఖజానా నుంచి చెల్లింపులకు పాటించాల్సిన విధానాన్ని యథేచ్ఛగా విస్మరిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎందరో గుత్తేదారులు, సరఫరాదారులు ఆర్థిక సంవత్సరం చివర్లోనైనా బిల్లులు దక్కుతాయోమోనని ఎదురుచూస్తోంటే ఆర్థికశాఖ అధికారులు, ఆ పైన ఉన్న కీలకాధికారులు ఇద్దరూ ఈ ఆందోళనలను పట్టించుకోవడం లేదు.

Published : 31 Mar 2024 04:19 IST

ఎన్నికల కోడ్‌ వచ్చినా నిబంధనల ఉల్లంఘనే

ఈనాడు, అమరావతి: ప్రభుత్వ ఖజానా నుంచి చెల్లింపులకు పాటించాల్సిన విధానాన్ని యథేచ్ఛగా విస్మరిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎందరో గుత్తేదారులు, సరఫరాదారులు ఆర్థిక సంవత్సరం చివర్లోనైనా బిల్లులు దక్కుతాయోమోనని ఎదురుచూస్తోంటే ఆర్థికశాఖ అధికారులు, ఆ పైన ఉన్న కీలకాధికారులు ఇద్దరూ ఈ ఆందోళనలను పట్టించుకోవడం లేదు. రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్‌ అమల్లో ఉంది. మరోవైపు ఆర్థిక చెల్లింపుల్లో అధికారపార్టీ ఇష్టారాజ్యం కొనసాగుతోంది. ఉన్నతాధికారులు అధికారపార్టీకే అండగా నిలుస్తున్నారు.

రాష్ట్ర ముఖ్యనేత కార్యాలయంలో ఉన్న కీలకాధికారి సిఫార్సులు, రాష్ట్రంలోనే అత్యున్నతాధికారి ప్రమేయంతో ఆర్థికశాఖలో ఈ చెల్లింపులు సాగిపోతున్నట్లు సమాచారం. ఒక్క శుక్రవారం రోజే రూ.3,300 కోట్ల వరకు బిల్లులు చెల్లించారు.

2023-24 ఆర్థిక సంవత్సరం ఆదివారంతో ముగిసిపోతుంది. వందల మంది ఈ చివరి రోజుల్లో బిల్లుల కోసం ఎదురుచూస్తున్నారు. విభాగాధిపతి నుంచి బిల్లులు పాస్‌ అయి, బడ్జెట్‌ ఆమోదం ఉండి.. ఆ మొత్తాలు పొందేందుకు రాజధాని చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. చివరిరోజు లోపు బిల్లులు అందుకోలేకపోతే అవి ల్యాప్స్‌ అయిపోతాయి. మళ్లీ కొత్త ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్‌ మంజూరైతేనే ఆ బిల్లులు అందుకునే ఆస్కారం ఉంటుంది. దాదాపు మూడేళ్లుగా పెండింగులో ఉండి, ఎప్పటికప్పుడు ఆర్థిక సంవత్సరం చివర్లో మురిగిపోయి మళ్లీ మొదటి నుంచి ప్రయత్నాలు చేసుకుని సిద్ధమైన బిల్లులు కూడా చెల్లింపులు సాగక ఉసూరుమంటున్నవారు ఎందరో ఉన్నారు.

మా హక్కులకు దిక్కేదీ?

పనులు చేసిన గుత్తేదారులు, సరఫరాదారులు అందరికీ బిల్లులు పొందే హక్కు ఉంటుంది. ఎవరో కొందరి దయాదాక్షిణ్యాలపైనే బిల్లులు మంజూరు అవుతుంటే ఎలా అనే ఆందోళన వారిలో వ్యక్తమవుతోంది. గతంలో సీఎఫ్‌ఎంఎస్‌ విధానాన్ని పారదర్శకంగా అమలు చేసేవారు. ఆ సందర్భంలో మొదట వచ్చిన బిల్లు ముందుగానే చెల్లించేవారు (ఫస్ట్‌ ఇన్‌ ఫస్ట్‌ అవుట్‌-ఫిఫో). ఒకవేళ వెనుక ఉన్న బిల్లు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడితే ఆ ముందు ఉన్న వాటిని క్లియర్‌ చేసి ఆ తర్వాత ఆ బిల్లు సొమ్ములు చెల్లించేవారు. జగన్‌ ప్రభుత్వంలో ఈ భరోసా మొత్తం పోయింది. దాదాపు రూ.లక్షన్నర కోట్ల వరకు పెండింగు బిల్లులు ఉన్నాయని సమాచారం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కొన్ని వేల కోట్ల రూపాయలు మురిగిపోనున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లోనూ కేంద్రం నుంచి మార్చి నెల చివర్లో రావాల్సిన వివిధ మొత్తాలు, పన్నుల్లో వాటాలు, ఇతరత్రా సొంత రాబడులు ఖజానాకు చేరాయి. ఎలాంటి వేస్‌ అండ్‌ మీన్స్‌ లేకుండానే శుక్రవారం రూ.3,300 కోట్లు తమ ఇష్టానుసారంగా చెల్లింపులు చేశారు. చివరి ప్రయత్నంగా ఆదివారమైనా బిల్లులు రాబట్టుకోవాలని వివిధ వర్గాలు ప్రయత్నాలు సాగిస్తున్నాయి. ఇప్పటికైనా ఫిఫో అమలు చేసేలా కేంద్ర ఎన్నికల సంఘం జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉందనే అభ్యర్థనలు వినిపిస్తున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు