YS Jagan: వికటిస్తున్న జగన్నాటకం

వివిధ పథకాల లబ్ధిదారులు, వైకాపా భజన బృందంతో జగన్నాటకాన్ని రక్తికట్టించేందుకు ఐప్యాక్‌ ప్రతినిధులు చేస్తున్న ప్రయత్నాలు వికటిస్తున్నాయి.

Updated : 31 Mar 2024 08:43 IST

ప్రశ్నించేందుకు మేమంతా సిద్ధమంటున్న జనం
భజనపరులను తెచ్చినా నిలదీస్తున్న వైనం

ఈనాడు-అమరావతి, కర్నూలు, న్యూస్‌టుడే-తుగ్గలి: వివిధ పథకాల లబ్ధిదారులు, వైకాపా భజన బృందంతో జగన్నాటకాన్ని రక్తికట్టించేందుకు ఐప్యాక్‌ ప్రతినిధులు చేస్తున్న ప్రయత్నాలు వికటిస్తున్నాయి. వారిని జగన్‌ ముందు నిలబెట్టి ముఖాముఖి పేరుతో నడుపుతున్న ఈ ప్రహసనం అధికార పార్టీకి ఇబ్బందికరంగా మారుతోంది. ఇక్కడ లబ్ధిదారులు వారికి అందుతున్న లబ్ధి గురించి చెబుతూనే సమస్యలను ఏకరవు పెడుతున్నారు. శనివారం కర్నూలు జిల్లా తుగ్గలి వేదికగా నిర్వహించిన ‘మేమంతా సిద్ధం’ ముఖాముఖి కార్యక్రమంలో స్థానికుల ప్రశ్నలతో జగన్‌కు దిమ్మతిరిగింది. కొందరు జగన్‌ భజన చేసినా మరికొందరు నిర్మొహమాటంగా ప్రభుత్వ లోపాలను కడిగిపారేశారు. పింఛన్లు రావడం లేదని ప్రశ్నించారు. మరొకరు పంటలకు గిట్టుబాటు ధర ఎక్కడుందని ప్రశ్నించారు. వైకాపా హయాంలో రైతులు పడిన బాధలు అన్నీ ఇన్నీ కావని వాపోయారు.

వాలంటీర్‌ను రమ్మని ఎలా ఆదేశిస్తారు?.

ఈ సమావేశం సందర్భంగా ఓ మహిళ.. భర్త చనిపోయినా తనకు పింఛను ఇవ్వట్లేదని ప్రశ్నించింది. దీనికి స్పందించిన సీఎం..సంబంధిత వాలంటీర్‌ను రమ్మని సీఎం ఆదేశాలిచ్చారు. జరిగేది పార్టీ ప్రచారమని, వాలంటీర్లు ఉండకూడదని ఆయనకు గుర్తులేదా? వాలంటీర్‌ను రమ్మని సభా వేదిక మీద నుంచి ఎలా ఆదేశిస్తారని పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు.

జగన్‌ భజనపాట పాడిన వాలంటీర్‌...

వాలంటీర్లు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకూడదని హైకోర్టు, ఎన్నికల సంఘం ఆదేశాలున్నా జగన్‌ మేమంతా సిద్ధం కార్యక్రమంలో వారినీ భాగస్వాములను చేస్తున్నారు. శనివారం హోసూరుకు చెందిన వాలంటీరు శివ.. జగన్‌ను కీర్తిస్తూ పాటపాడటం గమనార్హం.

రూ.2 వేల పింఛన్‌ ఇచ్చింది గత ప్రభుత్వమే

పింఛన్లపై అబద్ధాలను వల్లెవేసే జగన్‌కు రాతన గ్రామానికి చెందిన రంగమ్మ దిమ్మ తిరిగే సమాధానమిచ్చారు. గత ప్రభుత్వంలోనే రూ.2 వేల పింఛను అందేదని, వైకాపా వచ్చిన తర్వాత దాన్ని రూ.3 వేలకు పెంచినట్టు సీఎం ఎదుట పేర్కొన్నారు. అంతకుముందే జగన్‌ తన ప్రసంగంలో గత ప్రభుత్వంలో రూ.వెయ్యి మాత్రమే పింఛను వచ్చేదని తెలిపారు.

పింఛను లేదు: సరస్వతి, తుగ్గలి

రెండేళ్ల క్రితం మా ఆయన చనిపోయారు. పింఛను రావడం లేదు. నాకు ఎలాంటి జీవనభృతీ లేదు. పింఛను రాకపోడానికి కారణం ఏంటో తెలియదు. వచ్చేలా చేస్తారని అడుగుతున్నా. నేను డిగ్రీ చదివాను. విద్యార్హతకు సరిపడా చిన్న ఉద్యోగం ఇప్పించండి.

గిట్టుబాటు ధర ఏది?: లాల్‌బాషా, హోసూరు

రైతులు చాలా నష్టపోయారు. పంట ఉంటే గిట్టుబాటు ధర ఉండదు. ధర ఉన్నప్పుడు పంట చేతికి రావడం లేదు. రైతులకు పింఛను ఇవ్వాలి

చెరువుకు నీళ్లివ్వాలి: సురేశ్‌, ఉపాధి మేట్‌

రాతన గ్రామంలో చెరువుకు నీళ్లు రావాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం తుగ్గలిని కరవు మండలంగా ప్రకటించకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు.

కష్టాల్లో రైతులు: శ్యామలాదేవి, పత్తిపాడు

రైతులు ఇబ్బందుల్లో ఉన్నారు. వారిని ఆదుకోవాలి. రైతు రుణమాఫీ ప్రకటిస్తే మీరు ఇంట్లో ఉన్నా మేం గెలిపిస్తాం. రైతు భరోసా, చేయూత, ఆసరా, తోడు పథకాలు అందాయి.


యథేచ్ఛగా కోడ్‌ ఉల్లంఘన

ఈనాడు డిజిటల్‌, అనంతపురం: అనంతపురం జిల్లాలో బస్సుయాత్ర చేపట్టిన సీఎం జగన్‌ శనివారం రాత్రి 11.30 వరకు ప్రచారం నిర్వహించారు. నిబంధనల మేరకు రాత్రి 10 తర్వాత ప్రచారం చేయడం నిషిద్ధం. సీఎం జగన్‌ యథేచ్ఛగా కోడ్‌ను ఉల్లంఘించారు. యాత్ర రాప్తాడుకు చేరుకునే సరికి రాత్రి 10.20 అయ్యింది. ఆ సమయంలో జిల్లా పోలీసు ఉన్నతాధికారులు, ఆర్వో ఉన్నా, అడ్డు చెప్పలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని