విశాఖ ఎంపీ ఎంవీవీ బరితెగింపు

విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ బరితెగింపునకు అడ్డూఅదుపూ లేకుండా పోతోంది. మాస్టర్‌ప్లాన్‌ రహదారి కోసం జీవీఎంసీ సేకరించిన స్థలాన్ని ఆక్రమించి.. తన ప్రాజెక్టు కోసం భారీ ట్రాన్స్‌ఫార్మర్‌ ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Updated : 31 Mar 2024 09:13 IST

రహదారి స్థలం ఆక్రమణ
భారీ ట్రాన్స్‌ఫార్మర్‌ ఏర్పాటుకు  సన్నాహాలు

విశాఖపట్నం(కార్పొరేషన్‌), న్యూస్‌టుడే: విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ బరితెగింపునకు అడ్డూఅదుపూ లేకుండా పోతోంది. మాస్టర్‌ప్లాన్‌ రహదారి కోసం జీవీఎంసీ సేకరించిన స్థలాన్ని ఆక్రమించి.. తన ప్రాజెక్టు కోసం భారీ ట్రాన్స్‌ఫార్మర్‌ ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. సిరిపురం రహదారిలోని ది కన్వెన్షన్‌ బాప్టిస్ట్‌ చర్చ్‌ ఆఫ్‌ ది నార్తన్‌ సర్కార్స్‌ (సీబీసీఎన్‌సీ) స్థలంలో ఎంవీవీ పీక్‌ పేరుతో ఎంపీ భారీ బహుళ అంతస్తుల సముదాయ నిర్మాణం చేపట్టారు. ప్రధానరహదారికి ఆనుకుని ఆ స్థలం ఉంది. 2041- మాస్టర్‌ప్లాన్‌లో భాగంగా భవిష్యత్తులో రహదారి విస్తరణ చేపట్టాల్సి ఉందని భావించిన జీవీఎంసీ రెండేళ్ల క్రితం సీబీసీఎన్‌సీకి చెందిన ఆ స్థలాన్ని సేకరించి ప్రత్యామ్నాయంగా రూ.64 కోట్ల టీడీఆర్‌ పత్రాలను అందజేసింది. ఆ స్థలాన్ని ఎంపీ ఎంవీవీ సంస్థ అభివృద్ధి చేస్తుండటంతో టీడీఆర్‌ పత్రాలు ఆయనకే దక్కాయి. తాజాగా జీవీఎంసీ చదును చేసి రహదారి కోసం సిద్ధం చేసిన స్థలాన్ని ఎంవీవీ ఆక్రమించి తన ప్రాజెక్టు కోసం భారీ ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. పెద్ద గొయ్యి తవ్వి, అందులో ఇనుప చువ్వలు ఏర్పాటుచేశారు. ఇంత జరుగుతున్నా జీవీఎంసీ అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. దీనిపై జీవీఎంసీ పట్టణ ప్రణాళికాధికారులను వివరణ కోరగా రహదారి అభివృద్ధి కోసం జీవీఎంసీ తీసుకున్న స్థలంలో ట్రాన్స్‌ఫార్మర్‌ ఏర్పాటు చేయడం చట్టరీత్యా నేరమని, వెంటనే ఆ పనులను నిలిపివేయిస్తామని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని