అగ్రిగోల్డ్‌ ఆస్తులపై ఈడీ జప్తు ఉత్తర్వుల కొట్టివేత

అగ్రిగోల్డ్‌ సంస్థ ఆస్తులకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) జారీచేసిన ప్రాథమిక జప్తు ఉత్తర్వులను హైకోర్టు కొట్టేసింది.

Published : 31 Mar 2024 04:26 IST

ఏపీ డిపాజిటర్ల చట్టం కింద సీఐడీ జప్తును సమర్థించిన హైకోర్టు

ఈనాడు, అమరావతి: అగ్రిగోల్డ్‌ సంస్థ ఆస్తులకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) జారీచేసిన ప్రాథమిక జప్తు ఉత్తర్వులను హైకోర్టు కొట్టేసింది. ఏపీ డిపాజిటర్ల చట్ట నిబంధనలను అనుసరించి ప్రత్యేక కోర్టు అనుమతితో కాంపిటెంట్‌ అథారిటీ(సీఐడీ) చేసిన జప్తును సమర్థించింది. సీఐడీ ‘జప్తు చేయని’ ఆస్తుల విషయంలో నగదు అక్రమ చలామణి నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద చర్యలు తీసుకునేందుకు ఈడీకి వెసులుబాటు ఇచ్చింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ చీమలపాటి రవి ఇటీవల ఈ మేరకు తీర్పు ఇచ్చారు. అగ్రిగోల్డ్‌ ఆస్తులు కొన్నింటిని ఈడీ జప్తు చేయడాన్ని సవాలు చేస్తూ ఆ సంస్థ యాజమాన్యం హైకోర్టులో వ్యాజ్యాలు వేసింది. తాము రుణం ఇచ్చాముకాబట్టి ఆ ఆస్తులను వేలం వేసి విక్రయించుకునే హక్కు తమదేనని యూబీఐ (గతంలో కార్పొరేషన్‌ బ్యాంక్‌) వ్యాజ్యాలు వేసింది. అగ్రిగోల్డ్‌కు చెందిన కొన్ని ఆస్తులను బ్యాంకు వేలం వేయగా కొనుగోలు చేశామని, వాటిని జప్తు చేయడానికి వీల్లేదని మరో వ్యాజ్యం దాఖలైంది. ఆల్‌ ఇండియా అగ్రిగోల్డ్‌ కస్టమర్స్‌, ఏజెంట్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ మరో వ్యాజ్యం వేస్తూ.. సంస్థపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడానికి ముందే కొన్ని ఆస్తులను తాము కొనుగోలు చేశామని, వాటిని ఈడీ, సీఐడీ జప్తు చేయడానికి వీల్లేదని పేర్కొంది. అగ్రిగోల్డ్‌ నుంచి కొనుగోలు చేసిన భూముల్లో నిర్మించుకున్న అపార్ట్‌మెంట్‌ను సీఐడీ జప్తు చేయడాన్ని సవాలు చేస్తూ ఏలూరు ఫార్చ్యూన్‌ అపార్ట్‌మెంట్‌ ఓనర్స్‌ అసోసియేషన్‌ హైకోర్టును ఆశ్రయించింది. ఈ వ్యాజ్యాలపై తుది విచారణ జరిపిన న్యాయమూర్తి.. ఇటీవల తీర్పు ఇచ్చారు. జప్తు చేసిన ఆస్తుల విక్రయం ద్వారా వచ్చే సొమ్మును బాధితులకు న్యాయబద్ధంగా కేటాయించేందుకు డిపాజిటర్ల చట్టం వీలుకల్పిస్తుందని న్యాయమూర్తి తెలిపారు. ఆ చట్టాన్ని అనుసరించి ఏలూరులో ఏర్పాటు చేసిన ప్రత్యేక కోర్టు ఇచ్చే ఉత్తర్వులు డిపాజిటర్ల ప్రయోజనాలను కాపాడేందుకు ఉపయోగపడతాయన్నారు. పిటిషనర్లు అక్కడ వాదనలు వినిపించుకోవచ్చన్నారు. 2015లో సీఐడీ జప్తు చేసిన అగ్రిగోల్డ్‌ ఆస్తుల విషయంలో.. 2020 డిసెంబరు 24, 2021 నవంబరు 30న ఈడీ జారీచేసిన ప్రాథమిక జప్తు ఉత్తర్వులను(పీఏఓ) కొట్టేస్తున్నట్లు ప్రకటించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని