ఎమ్మెల్యే చెవిరెడ్డిపై చర్యలేవీ?

ప్రజలను ప్రలోభాలకు గురిచేసేందుకు వైకాపా నేతలు దాచిన తాయిలాలను పట్టుకున్న అధికారులు సూత్రధారులను విస్మరిస్తున్నారు.

Published : 31 Mar 2024 04:28 IST

గోదాము లీజుదారు ఆయనైనా విస్మరించిన వైనం
వైకాపా తాయిలాల పట్టివేతలో సిబ్బందిపైనే కేసులు

ఈనాడు-తిరుపతి, న్యూస్‌టుడే-రేణిగుంట: ప్రజలను ప్రలోభాలకు గురిచేసేందుకు వైకాపా నేతలు దాచిన తాయిలాలను పట్టుకున్న అధికారులు సూత్రధారులను విస్మరిస్తున్నారు. తిరుపతి జిల్లా రేణిగుంట మండలంలో చంద్రగిరి వైకాపా ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆధీనంలోని గోదాములో సామగ్రి పట్టుబడిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో తొలినుంచి అధికారుల తీరు అనుమానాలకు తావిస్తోంది. ఎన్నికల నియమావళికి విరుద్ధంగా ప్రజలకు పంచేందుకు 13 రకాల వస్తువులను దాచినట్లు అధికారులు లెక్కతేల్చారు. ప్రచార సామగ్రిని బుక్‌ చేసిన సుమన్‌, గోదాము కాపలాదారులు అనిల్‌, రమేష్‌రెడ్డి, గోదాము ఇన్‌ఛార్జి రవికుమార్‌లపై గాజులమండ్యం పోలీసులు కేసులు నమోదుచేశారు. వీరిలో సుమన్‌ ఆచూకీ తెలియరాలేదని పేర్కొన్నారు.

ఎమ్మెల్యే అంగీకరించినా.. వదిలేశారు

సామగ్రిని భద్రపర్చేందుకు గోదాము లీజుకు తీసుకున్నట్లు ఎమ్మెల్యే ప్రకటించారు. అన్ని లెక్కలూ ఉన్నాయని, రాష్ట్రం మొత్తానికి పార్టీతరఫున పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. అయినా ఆయన్ను వదిలేసి కిందిస్థాయి సిబ్బందిపైనే కేసులు నమోదుచేశారు. సీఎం జగన్‌కు అత్యంత సన్నిహితుడు కావడంతోనే ఆయన పేరు చేర్చలేదన్న ఆరోపణలున్నాయి. దీనిపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసేందుకు విపక్ష నేతలు సిద్ధమవుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని