ఖాతాలు ఖాళీ చేసి.. మళ్లీ ఏంటీ షాక్‌లు?

కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆర్థిక సంఘం నిధులను విద్యుత్తు ఛార్జీల బకాయిలకు అడ్డగోలుగా మళ్లించి, పంచాయతీ ఖాతాలు ఖాళీ చేసేసిన జగన్‌ ప్రభుత్వానికి ఇంకా ధనదాహం తీరడం లేదు.

Updated : 31 Mar 2024 08:08 IST

విద్యుత్తు బకాయిలు చెల్లించాలని సర్పంచులకు వేధింపులు
పంచాయతీ కార్యాలయాలకు సరఫరా నిలిపివేత
అయిదేళ్లలో రూ.2 వేల కోట్లకు పైగా ఆర్థిక సంఘం నిధులు మళ్లించిన జగన్‌ ప్రభుత్వం
ఇంకా తీరని ధనదాహం

ఈనాడు, అమరావతి: కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆర్థిక సంఘం నిధులను విద్యుత్తు ఛార్జీల బకాయిలకు అడ్డగోలుగా మళ్లించి, పంచాయతీ ఖాతాలు ఖాళీ చేసేసిన జగన్‌ ప్రభుత్వానికి ఇంకా ధనదాహం తీరడం లేదు. సర్పంచుల పోరాటాల ఫలితంగా పంచాయతీల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమయిన నిధులపైనా కన్నేసింది. వీటిని లాగేసుకోవడానికి విద్యుత్తు పంపిణీ సంస్థలను పంచాయతీలపైకి ఎగదోస్తోంది. ఈ క్రమంలో ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో దాదాపు 40 పంచాయతీ కార్యాలయాలకు శనివారం విద్యుత్తు సరఫరా నిలిపివేశారు. పశ్చిమగోదావరి జిల్లాలోనూ పలు కార్యాలయాలకు బకాయిలు చెల్లించాలని నోటీసులిచ్చారు. ఇదే జిల్లా పెనుమంట్ర మండలంలో కొన్ని పంచాయతీ కార్యాలయాలకు కొద్దిరోజుల క్రితం సరఫరా నిలిపివేశారు. గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోనూ బకాయిలు చెల్లించాలని పంచాయతీలకు నోటీసులిస్తున్నారు.

ఈ పరిణామాలతో సర్పంచుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. కేంద్రం పంచాయతీలకు ఇచ్చిన 14, 15వ ఆర్థిక సంఘం నిధుల నుంచి విద్యుత్తు ఛార్జీల బకాయిల పేరుతో రాష్ట్రప్రభుత్వం గత అయిదేళ్లలో రూ.2వేల కోట్లకు పైగా మళ్లించింది. పంచాయతీల తీర్మానం లేకుండా, సర్పంచుల అనుమతి తీసుకోకుండా పీడీ ఖాతాల్లో నుంచి నిధులు లాగేసుకుంది. దీనిపై సర్పంచులు చేసిన పోరాటాలు దిల్లీని కూడా తాకాయి. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో పంచాయతీల పేరుతో ప్రత్యేకంగా బ్యాంకు ఖాతాలు తెరిపించిన రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ... దాదాపు రూ.2వేల కోట్లకు పైగా 15వ ఆర్థిక సంఘం నిధులు ఇటీవల జమచేసింది.

లెక్కాపత్రం లేని బకాయిలు

పంచాయతీల ఖాతాల్లో నిధులు జమయ్యాయని తెలియగానే విద్యుత్తు పంపిణీ సంస్థలు పాత బకాయిల పేరుతో వసూళ్లకు సిద్ధమైపోతున్నాయి. బకాయిల పేరుతో ఒకవైపు ఖాతాల్లో డబ్బులు తీసేసుకుంటూ.. ఇంకా రూ.లక్షల్లో బకాయిలు చూపించడంపై సర్పంచుల నుంచి నిరసన వ్యక్తమవుతోంది. చెల్లించిన డబ్బులు ఎక్కడికి వెళుతున్నాయి? బకాయిలపై సరైన లెక్క చెప్పాలన్న సర్పంచుల విజ్ఞప్తిని విద్యుత్తు పంపిణీ సంస్థలు పట్టించుకోవడం లేదు. ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన కొందరు సర్పంచులు కొద్ది నెలల క్రితం పంచాయతీరాజ్‌శాఖ అధికారులను కలిసి విద్యుత్తు ఛార్జీల బకాయిల లెక్కలు తేల్చాలని విజ్ఞప్తి చేశారు. బకాయిలను మించి వసూలు చేసి, మళ్లీ బకాయిలు చూపిస్తున్నారని శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఒక పంచాయతీ కార్యదర్శి విద్యుత్తు ఛార్జీల బకాయిలపై రెండు పేజీల లేఖ రాశారు. నిధులన్నీ విద్యుత్తు ఛార్జీల బకాయిలకే తీసుకుంటే పంచాయతీల్లో అత్యవసర పనులు కూడా చేయలేమని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ఆర్థిక సంఘం మార్గదర్శకాలకు విరుద్ధంగా నిధుల్లో నుంచి పెద్ద మొత్తంలో రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్తు ఛార్జీలకు మళ్లిస్తోందని కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ ఉప కార్యదర్శి విజయ్‌కుమార్‌కు కృష్ణా జిల్లాకు చెందిన ఓ సర్పంచి కొద్ది నెలల క్రితం ఫిర్యాదు చేశారు.

లెక్కలు తేల్చరు.. కట్టాల్సిందేనట!

బకాయిలు చెల్లించకపోతే పంచాయతీ కార్యాలయాలకు విద్యుత్తు సరఫరా నిలిపివేస్తామని విద్యుత్తు పంపిణీ సంస్థల ఇంజినీర్లు బెదిరింపులకు దిగడంపై సర్పంచులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయాన్ని కొందరు రాష్ట్ర పంచాయతీశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఇంతవరకు చెల్లించిన బకాయిలపై డిస్కంలు లెక్కలు చెబితే.. మిగతా వాటి గురించి ఆలోచిస్తామని సర్పంచులు చెబుతున్నారు. లెక్కల సంగతి తరువాత.. మొదట పంచాయతీ బ్యాంకు ఖాతాల్లోని నిధుల నుంచి ఎంతో కొంత చెల్లించాలని అధికారులు  సర్పంచులకు ఉచిత సలహాలిస్తుండటం గమనార్హం.


మీటర్లు లేకుండా బిల్లులెలా ఇస్తారు?

విద్యుత్తు వినియోగంపై చాలా పంచాయతీల్లో రీడింగ్‌ మీటర్లే లేవు. రీడింగ్‌ తీశాకే నోటీసులివ్వాలి కదా? రూ.లక్షల్లో బకాయిలు ఎలా చూపిస్తున్నారు? కొన్ని చోట్ల వసూలు చేసిన మొత్తాలకు రసీదులూ ఇవ్వడం లేదు. ఆర్థిక సంఘం నిధులు పంచాయతీల బ్యాంకు ఖాతాల్లో జమైనప్పుడల్లా ఇదో పెద్ద సమస్యగా మారింది. ఇది చాలా అన్యాయం. ప్రభుత్వ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం.

వైవీబీ రాజేంద్రప్రసాద్‌, ఏపీ పంచాయతీరాజ్‌ ఛాంబర్‌ అధ్యక్షులు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని