సంక్షిప్త వార్తలు (5)

రాష్ట్ర అభివృద్ధికి తమవంతు బాధ్యతగా అనేక కార్యక్రమాలు చేస్తున్న ప్రవాసాంధ్రులను వేమూరు నియోజకవర్గ వైకాపా అభ్యర్థి వరికూటి అశోక్‌బాబు బెదిరించడం దారుణమంటూ ప్రవాసాంధ్రుడు, తెదేపా ఎన్నారై అమెరికా కోఆర్డినేటర్‌ జయరాం కోమటి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated : 01 Apr 2024 06:23 IST

‘ప్రవాసాంధ్రులను బెదిరించిన వైకాపా అభ్యర్థిపై చర్యలు తీసుకోవాలి’

ఈనాడు డిజిటల్‌, అమరావతి: రాష్ట్ర అభివృద్ధికి తమవంతు బాధ్యతగా అనేక కార్యక్రమాలు చేస్తున్న ప్రవాసాంధ్రులను వేమూరు నియోజకవర్గ వైకాపా అభ్యర్థి వరికూటి అశోక్‌బాబు బెదిరించడం దారుణమంటూ ప్రవాసాంధ్రుడు, తెదేపా ఎన్నారై అమెరికా కోఆర్డినేటర్‌ జయరాం కోమటి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘రాష్ట్రానికి వచ్చి ఏదైనా చేస్తే.. తిరిగి విదేశాలకు వెళ్లలేరు’ అంటూ బెదిరించిన అశోక్‌బాబుపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి చర్యలు తీసుకోవాలని ఆదివారం ఆయన ఓ ప్రకటనలో డిమాండు చేశారు. ఏపీకి అన్నివిధాలా సాయం చేస్తున్న ఎన్నారైలను వైకాపా తీవ్రంగా అవమానపరుస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.


11 మంది వాలంటీర్లపై వేటు

తిరుపతి(కలెక్టరేట్‌), న్యూస్‌టుడే: తిరుపతి జిల్లా పరిధిలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘించిన 11 మంది వాలంటీర్లను విధుల నుంచి తొలగించినట్లు కలెక్టర్‌ జి.లక్ష్మీశ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఏర్పేడు మండల పరిధిలో నలుగురు, నారాయణవనం మండల పరిధిలో ముగ్గురు, రేణిగుంట, పుత్తూరు పరిధిలో ఒక్కొక్కరు, బీఎన్‌కండ్రిగ పరిధిలో ఇద్దరిని విధుల నుంచి తప్పించినట్లు పేర్కొన్నారు.


నేటి నుంచి పాలిసెట్‌కు ఉచిత శిక్షణ

ఈనాడు, అమరావతి: పాలిటెక్నిక్‌ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించే పాలిసెట్‌కు హాజరయ్యే అభ్యర్థులకు సోమవారం నుంచి ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ చదలవాడ నాగరాణి తెలిపారు. అన్ని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ల్లోనూ ఏప్రిల్‌ 25 వరకు ఈ శిక్షణ కొనసాగుతుందని, స్టడీ మెటీరియల్‌ ఉచితంగా ఇస్తామని వెల్లడించారు. పదోతరగతి పరీక్షలు రాసినవారు ఈ శిక్షణకు హాజరుకావొచ్చని, ఉదయం 9నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు శిక్షణ ఉంటుందని తెలిపారు. చివరిరోజున ప్రీఫైనల్‌ ప్రవేశపరీక్ష ఉంటుందని వెల్లడించారు. పాలిసెట్‌కు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఏప్రిల్‌ 5 వరకు స్వీకరిస్తామని పేర్కొన్నారు.


నేటి నుంచి పదో తరగతి పరీక్షల మూల్యాంకనం

ఈనాడు, అమరావతి: పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల జవాబుపత్రాల మూల్యాంకనం సోమవారం నుంచి ఏప్రిల్‌ 8 వరకు నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ సురేష్‌కుమార్‌ తెలిపారు. ఈ ఏడాది 6.23 లక్షల మంది రెగ్యులర్‌ విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారని, రాష్ట్రంలో 26 జిల్లాల్లోనూ మూల్యాంకనం కొనసాగుతుందని వెల్లడించారు. 25వేల మంది ఉపాధ్యాయులు 47,88,738 జవాబుపత్రాలను మూల్యాంకనం చేయనున్నట్లు పేర్కొన్నారు.


దళితులపై పోలీసుల దౌర్జన్యం

ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు

ఈనాడు, అమరావతి: ఏలూరు జిల్లా దెందులూరు మండలం దోస్పాడులో దళితులు, పేదలపై పోలీసులు నిర్బంధకాండ కొనసాగిస్తున్నారని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. ‘ఎసైన్డ్‌, సీలింగ్‌ భూములకు సంబంధించి దళితులు, పేదలకు రాష్ట్ర ప్రభుత్వం పట్టాలిచ్చింది. భూస్వాములు వాటిని కాజేసి చేపలు, రొయ్యల చెరువులు సాగు చేస్తున్నారు. 300 ఎకరాల్లో 70 ఎకరాలు జాయింట్‌ కలెక్టర్‌ కోర్టులో ఉంది. ఆ భూములపై 145 సెక్షన్‌ విధించారు. చట్టప్రకారం భూస్వాములు అందులోకి అడుగుపెట్టకూడదు. కానీ వారిని అనుమతిస్తూ.. పేదలు వెళ్లకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. తిరిగి వారిపైనే కేసు పెడుతున్నారు’ అని మండిపడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని