‘సీమ వాసులారా..’ రేపు ఊరెళ్తున్నారా?

రాష్ట్రవ్యాప్తంగా రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. నిత్యం కొన్ని మండలాల్లో వడగాలులు వీస్తాయని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీచేస్తోంది.

Updated : 01 Apr 2024 08:50 IST

మండుతున్న ఎండల్లో గంటలకొద్దీ నిరీక్షించాల్సిందే
మదనపల్లె ‘మేమంతా సిద్ధం’ సభకు 1,057 బస్సుల కేటాయింపు
ప్రయాణికుల కష్టాలను పట్టించుకోని సీఎం జగన్‌

ఈనాడు, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. నిత్యం కొన్ని మండలాల్లో వడగాలులు వీస్తాయని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీచేస్తోంది. ఇలాంటి తరుణంలో రాయలసీమ జిల్లాల్లోని ప్రయాణికులకు సీఎం జగన్‌ కొద్ది రోజులుగా నరకం చూపిస్తున్నారు. ‘మేమంతా సిద్ధం’ పేరిట వైకాపా నిర్వహిస్తున్న సభలకు 1,000 నుంచి 1,100 చొప్పున ఆర్టీసీ బస్సులు మళ్లించి, ప్రయాణికులు గంటలతరబడి ఎండలో వేచి ఉండేలా చేస్తున్నారు. తాజాగా మదనపల్లెలో మంగళవారం నిర్వహించనున్న సభ కోసం ఏకంగా 1,057 ఆర్టీసీ బస్సులు తీసుకుని.. ప్రయాణికులు ఏమైపోతే మాకేంటనే రీతిలో వ్యవహరిస్తున్నారు.

ఎన్నికల కోడ్‌ వచ్చినా..

అయిదేళ్లపాటు ప్రభుత్వ కార్యక్రమాల కోసం బలవంతంగా ప్రజలను తరలించేందుకు వందలు, వేల ఆర్టీసీ బస్సులు మళ్లించి ప్రయాణికులకు చుక్కలు చూపారు. ఇటీవల నాలుగుచోట్ల నిర్వహించిన ‘సిద్ధం’ సభలకూ 3,000-3,500 చొప్పున బస్సులు తీసుకున్నారు. మార్చి 16 నుంచి ఎన్నికల కోడ్‌ అమల్లోకి రావడంతో.. ఇకపై తమకు కష్టాలు ఉండవని ప్రయాణికులు భావించారు. కానీ జగన్‌ మాత్రం ఇప్పుడూ వదలట్లేదు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గత నెల 27 నుంచి ‘మేమంతా సిద్ధం’ అంటూ ప్రొద్దుటూరు, నంద్యాల, ఎమ్మిగనూరులో సభలు నిర్వహించారు. సగటున వెయ్యి బస్సుల్లో ప్రజలను తరలించారు. మంగళవారం మదనపల్లెలో జరగనున్న సభకూ రాయలసీమలోని చిత్తూరు, తిరుపతి, అనంతపురం, శ్రీసత్యసాయి, వైయస్‌ఆర్‌, అన్నమయ్య జిల్లాల్లోని 40 డిపోల నుంచి 1,057 బస్సులు మళ్లిస్తున్నారు. ఇందులో 484 ఎక్స్‌ప్రెస్‌లు, 573 పల్లెవెలుగు సర్వీసులు ఉన్నాయి. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నుంచి మదనపల్లె 230 కి.మీ. దూరంలో ఉంది. తిరుపతి జిల్లాలోని గూడూరు నుంచి 210 కి.మీ, సూళ్లూరుపేట నుంచి 200 కి.మీ దూరంలో ఉంది. అయినా ఆయాచోట్ల నుంచి బస్సులు పంపిస్తుండటం గమనార్హం.

శ్రీవారి భక్తులకు ఇబ్బందులు..

తిరుపతి, తిరుమల, అలిపిరి, మంగళం డిపోల సర్వీసులన్నీ ఎక్కువగా తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులను దృష్టిలో పెట్టుకుని నడిపిస్తారు. ఉత్తరాది రాష్ట్రాల్లో విద్యార్థులకు వేసవి సెలవులు, ఏపీలో పది, ఇంటర్‌ పరీక్షలు ముగియడంతో తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య భారీగా పెరిగింది. అందుకు తగ్గట్టుగా ఆర్టీసీ సర్వీసులు పెంచాలి. కానీ ఆయా డిపోల నుంచి పెద్దసంఖ్యలో బస్సులను.. సీఎం జగన్‌ సభలకు మళ్లిస్తున్నారు. మరోవైపు సభకు హాజరయ్యే వైకాపా కార్యకర్తలకు ఆ పార్టీ నేతలు మద్యం, చికెన్‌ బిర్యానీ పంపిణీ చేస్తున్నారు. వారు బస్సుల్లోనే మద్యం తాగుతూ, బిర్యానీ తింటున్నారు. తిరుమలకు రాకపోకలు సాగించే బస్సుల్లో ఇలా చేస్తుండటంపై విమర్శలు వస్తున్నాయి.


ఇంకా అధికార పార్టీకి దాసోహమేనా?

మొన్నటి వరకు అధికార పార్టీ చెప్పినట్లు వినాల్సి వచ్చిందని ఆర్టీసీ అధికారులు వాపోయారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చినప్పటికీ.. వైకాపా నేతలకు అధికారులు దాసోహం అవుతున్నారు. ‘జగన్‌ సభలకు ఎన్ని ఆర్టీసీ బస్సులు కావాలంటే అన్ని బుక్‌ చేసుకోండి’ అంటూ ఇటీవల ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆ పార్టీ నాయకులతో పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని