ఇంటి వద్దనే పింఛను అందించాలి

వాలంటీర్ల ద్వారా పింఛన్ల పంపిణీని నిలిపివేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలిచ్చినందున వెంటనే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని, లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి పింఛను ఇవ్వాలని తెదేపా అధినేత చంద్రబాబు కోరారు.

Updated : 01 Apr 2024 06:02 IST

లబ్ధిదారులకు నగదు రూపంలోనే చెల్లించండి
ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ సీఈఓకు చంద్రబాబు లేఖ

ఈనాడు డిజిటల్‌, అమరావతి: వాలంటీర్ల ద్వారా పింఛన్ల పంపిణీని నిలిపివేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలిచ్చినందున వెంటనే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని, లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి పింఛను ఇవ్వాలని తెదేపా అధినేత చంద్రబాబు కోరారు. ఎలాంటి జాప్యానికీ తావులేకుండా నగదు రూపంలోనే పింఛను చెల్లించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్‌కుమార్‌ మీనాకు ఆదివారం ఆయన లేఖ రాశారు.

‘‘గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందిని పింఛను పంపిణీలో వినియోగించాలి. ఈ మేరకు పింఛను నగదును బ్యాంకుల నుంచి గ్రామాలకు తీసుకువెళ్లేందుకు సచివాలయ సిబ్బందికి అనుమతి ఇవ్వాలని ఎంపీడీవోలు, మున్సిపల్‌ కమిషనర్లకు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్‌) సీఈవో ఇప్పటికే ఆదేశాలిచ్చారు. అయితే ఇప్పటివరకు పింఛన్ల పంపిణీకి కావాల్సిన మొత్తాన్ని సంబంధిత శాఖ వద్ద ఉంచలేదనే వార్తలు వస్తున్నాయి. కావున వెంటనే నిధులు సమకూర్చండి. గతంలో మాదిరిగానే ఒకటో తేదీ నుంచి అయిదో తేదీ మధ్య పింఛన్ల పంపిణీ ప్రక్రియ పూర్తి చేయడానికి అవసరమైన యంత్రాంగాన్ని, నిధుల్ని సమకూర్చడం, అందుకు కావాల్సిన పాలనాపరమైన చర్యలు తీసుకునేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించండి’’ అని చంద్రబాబు లేఖలో కోరారు. ఇదే అంశంపై సీఎస్‌ జవహర్‌రెడ్డికి చంద్రబాబు మరో లేఖ రాశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని