పంచాయతీలకు ఇవ్వాల్సిన రూ.900 కోట్లకు ఎసరు

పంచాయతీలకు మూడు నెలలకోసారి ఇవ్వాల్సిన స్టాంపుడ్యూటీ మొత్తాలను ప్రభుత్వం గత తొమ్మిది నెలలుగా ఇవ్వడం లేదు. దీనికి సంబంధించి దాదాపు రూ.900 కోట్ల వరకు ప్రభుత్వం తమకు బకాయి పడిందని పలువురు సర్పంచులు పేర్కొంటున్నారు.

Published : 01 Apr 2024 04:41 IST

స్టాంపు డ్యూటీ బకాయిలు ఇవ్వని ప్రభుత్వం
విడుదల చేయాలని సీఎస్‌కు సర్పంచుల లేఖలు

ఈనాడు, అమరావతి: పంచాయతీలకు మూడు నెలలకోసారి ఇవ్వాల్సిన స్టాంపుడ్యూటీ మొత్తాలను ప్రభుత్వం గత తొమ్మిది నెలలుగా ఇవ్వడం లేదు. దీనికి సంబంధించి దాదాపు రూ.900 కోట్ల వరకు ప్రభుత్వం తమకు బకాయి పడిందని పలువురు సర్పంచులు పేర్కొంటున్నారు. నిధులొస్తే గ్రామాల్లో చిన్న చిన్న పనులు చేయిద్దామని ఆశపడుతున్న తమకు నిరాశే ఎదురవుతోందని వారు వాపోతున్నారు. పలువురు సర్పంచులు స్టాంపుడ్యూటీ బకాయిలు వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్‌కు ఆదివారం వినతులు పంపారు. వివిధ రిజిస్ట్రేషన్లపై ప్రభుత్వానికి వచ్చే స్టాంపుడ్యూటీ ఆదాయంలో కొంత మొత్తాన్ని గ్రామ పంచాయతీలకు మూడు నెలలకోసారి జమ చేస్తుంటారు. వీటిని కొద్ది నెలలుగా విడుదల చేయడం లేదు. ఇదిగో, అదిగో అంటూ కాలయాపన చేస్తున్నారు. జగన్‌ ప్రభుత్వం ఇతర అవసరాలకు ఈ మొత్తాలను వాడుకుందన్న అనుమానాన్ని సర్పంచులు వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ఆర్థిక సంఘం నిధుల మళ్లింపుతో పంచాయతీలు ఇప్పటికే దిగాలు పడ్డాయి. ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోతే ఆందోళన చేస్తామని ఏపీ పంచాయతీరాజ్‌ ఛాంబర్‌ రాష్ట్ర అధ్యక్షుడు వైవీబీ రాజేంద్రప్రసాద్‌ హెచ్చరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని