ఇష్టారీతిన రూ.12,950 కోట్ల చెల్లింపులు

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చిన తర్వాత ఖజానా నుంచి దాదాపు రూ.12,950 కోట్ల మేర ఇష్టారీతిన చెల్లింపులు జరిగాయి. మార్చి 16 నుంచి 30 వరకు ఈ మొత్తం ఉన్నతాధికారుల నిర్ణయంతోనే చెల్లించేశారు.

Updated : 01 Apr 2024 06:21 IST

ఫిఫో అమలుకు తిలోదకాలు
స్క్రీనింగ్‌ కమిటీ ప్రమేయమూ లేదు

ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చిన తర్వాత ఖజానా నుంచి దాదాపు రూ.12,950 కోట్ల మేర ఇష్టారీతిన చెల్లింపులు జరిగాయి. మార్చి 16 నుంచి 30 వరకు ఈ మొత్తం ఉన్నతాధికారుల నిర్ణయంతోనే చెల్లించేశారు. మార్చి 30న ఏకంగా రూ.6,000 కోట్ల మేర చెల్లింపులు జరిపారు. అసలు ఎవరికి, ఎంత మొత్తం, ఎందుకు చెల్లించారనే వివరాలనూ గోప్యంగా ఉంచుతున్నారు. ఎన్నికల కోడ్‌ అంటేనే ఎవరికీ ప్రత్యేకలబ్ధి కలిగించకుండా నిబంధనల ప్రకారం పాలన నిర్వహించేలా చూడటం. ఆర్థికశాఖలో నియమాల ప్రకారం చెల్లింపులు జరపడం అంటే ఫిఫో (మొదట వచ్చిన బిల్లు ముందుగా చెల్లించడం) అమలు ఒక్కటే మార్గం. ఇలా చేస్తే విమర్శలొచ్చే అవకాశం ఉండదు. ఎవరికీ అనుచిత లబ్ధి కల్పించే ఆస్కారం కలగదు. అందుకు విరుద్ధంగా సీఎంఓలోని ఒక ఉన్నతాధికారి, సీఎస్‌ ఆదేశాలతో పాటు ఎప్పటి నుంచో బిల్లుల చెల్లింపుల వ్యవహారాలు పర్యవేక్షిస్తున్న ఆర్థికశాఖ కార్యదర్శి కె.వి.వి.సత్యనారాయణ ఆధ్వర్యంలో ఈ చెల్లింపులు సాగుతున్నాయి.

స్క్రీనింగ్‌ కమిటీ పరిశీలనా లేదా?: ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో నిర్ణయాలు తీసుకునేందుకు ఒక స్క్రీనింగ్‌ కమిటీ ఏర్పాటయింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సాధారణ పరిపాలనాశాఖ ముఖ్య కార్యదర్శి, ఏ ప్రభుత్వశాఖకు సంబంధించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉందో ఆ శాఖ ముఖ్య కార్యదర్శిలను ఈ కమిటీలో నియమించారు. కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు ఏపీ ప్రభుత్వం 2024 మార్చి 18న ఇందుకు సంబంధించిన జీవో 607 ఇచ్చింది. అయితే ఈ చెల్లింపులు స్క్రీనింగ్‌ కమిటీ ప్రమేయం లేకుండానే సాగిపోతున్నాయి. పైగా సాధారణ పరిపాలనాశాఖ అధికారికి చాలా ఫైళ్లు పంపడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఉత్తర్వుల ప్రకారం స్క్రీనింగ్‌ కమిటీ పనిచేయడం లేదనే చర్చ జరుగుతోంది. ఎవరో కొద్దిమందికి లబ్ధి కలిగేలా అధికారపార్టీ పెద్దల కనుసన్నల్లోనే రూ.వేల కోట్ల పందేరం జరుగుతోంటే అది ఎన్నికలపై ప్రభావం చూపించే ఆస్కారం ఉంటుందనేది జగమెరిగిన సత్యం.

మారిటైం బోర్డు ద్వారా..: పెద్దమొత్తంలో బిల్లుల చెల్లింపుల కోసం రాష్ట్రప్రభుత్వం మారిటైం బోర్డు ద్వారా రూ.3,900 కోట్ల అప్పు పుట్టించింది. పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ నుంచి ఆ మొత్తం రుణం తీసుకుంది. మచిలీపట్నం పోర్టు కోసం తీసుకున్న భూములను తనఖా పెట్టి ఈ అప్పు పొందింది. ఇందులో నిబంధనల ఉల్లంఘనకు వివిధ శాఖల అధికారులపై ఒత్తిళ్లూ వచ్చాయి. చివరికి ఏపీ మారిటైం బోర్డు ద్వారా ఆ మొత్తం రుణం తీసుకుంది. ఆ నిధులు శనివారమే ఖజానాకు చేరినట్లు తెలిసింది. వాటినీ ఫిఫో నిబంధనలు పక్కన పెట్టి చెల్లింపులు చేసేశారు.

త్వరలో అప్పుల పందేరం: కొత్త ఆర్థిక సంవత్సరం సోమవారం నుంచి ప్రారంభమవుతోంది. ఏప్రిల్‌ 2న ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రూ.4,000 కోట్ల మేర రుణం తీసుకురాబోతోంది. కేంద్రం తొలుత అడ్‌హాక్‌ తరహాలోనే ఈ రుణాలకు అనుమతులు ఇచ్చినట్లు తెలిసింది. కేంద్రం నుంచి పూర్తిస్థాయి రుణాల అనుమతులకూ ప్రయత్నిస్తున్నారు. ఆ రుణాలు, ప్రభుత్వ రాబడులూ కలిపి ఎన్నికల ముందు ఎంతో కీలకమైన ఏప్రిల్‌ నెలలో కొన్ని వేల కోట్ల రూపాయల చెల్లింపులు జరపబోతున్నారు. ఇప్పటికైనా చెల్లింపుల వ్యవస్థను నిబంధనల ప్రకారం నిర్వహించేలా చర్యలు తీసుకోవాలి. ఈ అంశాలపై వివరణ తీసుకునేందుకు ఆర్థికశాఖ కార్యదర్శి కె.వి.వి.సత్యనారాయణను ఫోన్లో సంప్రదించేందుకు ప్రయత్నించగా ఆయన స్పందించలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని