కోడ్‌ కూసినా గనులశాఖలో సర్దుబాటు బదిలీలు

ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నా గనులశాఖ అధికారులు సర్దుబాటు పేరిట బదిలీలు చేస్తూనే ఉన్నారు. చాలాకాలంగా పోస్టింగ్‌ ఒక చోట, విధులు మరోచోట ఇస్తూ ఇష్టానుసారం ఉద్యోగుల విధులలో మార్పులు చేశారు.

Published : 01 Apr 2024 04:50 IST

తెరవెనక మంత్రి ఓఎస్డీ హస్తం

ఈనాడు, అమరావతి: ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నా గనులశాఖ అధికారులు సర్దుబాటు పేరిట బదిలీలు చేస్తూనే ఉన్నారు. చాలాకాలంగా పోస్టింగ్‌ ఒక చోట, విధులు మరోచోట ఇస్తూ ఇష్టానుసారం ఉద్యోగుల విధులలో మార్పులు చేశారు. ఉత్తరాంధ్రకు చెందినవారికి రాయలసీమలో.. అక్కడివారికి ఉత్తరాంధ్రలో సర్దుబాటు పోస్టింగ్‌లు ఇచ్చారు. ప్రస్తుతం కోడ్‌ అమల్లో ఉన్నందున.. ఈసీ అనుమతి లేకుండా బదిలీలు, డిప్యుటేషన్లు చేయకూడదన్న నిబంధనను పట్టించుకోవడంలేదు. పలు కారణాలు చూపిస్తూ బదిలీలు చేస్తున్నారు. వీటివెనక ఓ మంత్రి ఓఎస్డీ, మరో వ్యక్తి ఉన్నట్లు గనులశాఖలో చర్చ జరుగుతోంది.

  • విజయనగరంలోని గనులశాఖ విజిలెన్స్‌ విభాగం కార్యాలయంలో ఇన్‌ఛార్జి సహాయ సంచాలకులు (ఏడీ)గా కొంతకాలంగా ఎస్‌పీకే మల్లేశ్వరరావు విధులు నిర్వహిస్తున్నారు. వాస్తవానికి ఆయన నర్సీపట్నంలోని డివిజనల్‌ గనులశాఖ కార్యాలయంలో సహాయ భూగర్భనిపుణులు (ఏజీ)గా పనిచేయాలి. వర్కింగ్‌ ఎరేంజ్‌మెంట్‌ కింద అక్కడ విధులు నిర్వహిస్తున్నారు. తాజాగా ఆయన్ను విజయనగరం నుంచి నర్సీపట్నం కార్యాలయంలో డివిజనల్‌ గనులశాఖ అధికారిగా పూర్తి అదనపు బాధ్యతలు తీసుకోవాలని.. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పాడేరు గనులశాఖ అధికారిగానూ బాధ్యతలు చూడాలని ఈ నెల 26న ఆ శాఖ సంచాలకుడు వెంకటరెడ్డి ఆదేశాలు జారీచేశారు. ఇప్పటికే పాడేరులోని ఏజీగా ఉన్న బి.రవికుమార్‌ గతనెల నుంచి అల్లూరి జిల్లా గనులశాఖ అధికారిగా అదనపు బాధ్యతలు చూస్తున్నారు. అయినా అదే కేడర్‌లో ఉన్న మలేశ్వరరావుకు ఈ బాధ్యతలు అప్పగించారు. కోడ్‌ అమల్లో ఉన్నప్పుడు ఇలా చేయడంపై ఆ శాఖలో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
  • శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలోని జిల్లా గనులశాఖ కార్యాలయంలో సర్వేయర్‌గా సత్యనారాయణ విధులు నిర్వహిస్తున్నారు. మన్యం పార్వతీపురం జిల్లా గనులశాఖ కార్యాలయానికి ఆయనను సర్వేయర్‌గా డిప్యుటేషన్‌పై పంపుతూ ఆదేశాలు జారీచేశారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని