మరీ ఇంత భారమా... చెల్లించలేం!

ఆక్రమణల క్రమబద్ధీకరణకు అడ్డగోలుగా ఫీజులను ఖరారు చేయడంతో ఎవరూ ఆసక్తి చూపడంలేదు. ప్రైవేటు స్థలాల క్రమబద్ధీకరణ విషయంలో మొండిగా వ్యవహరిస్తూ ఫీజుల్ని అమాంతం పెంచేసిన సర్కారుకు చుక్కెదురవుతోంది.

Updated : 01 Apr 2024 06:15 IST

క్రమబద్ధీకరణకు అధిక ఫీజులు
ముందుకురాని యజమానులు
వైకాపా సర్కారుకు చుక్కెదురు

ఈనాడు, అమరావతి: ఆక్రమణల క్రమబద్ధీకరణకు అడ్డగోలుగా ఫీజులను ఖరారు చేయడంతో ఎవరూ ఆసక్తి చూపడంలేదు. ప్రైవేటు స్థలాల క్రమబద్ధీకరణ విషయంలో మొండిగా వ్యవహరిస్తూ ఫీజుల్ని అమాంతం పెంచేసిన సర్కారుకు చుక్కెదురవుతోంది. భారీగా ఉన్న ఫీజులను చెల్లించేందుకు యజమానులు సుముఖత వ్యక్తంచేయడం లేదు. స్థానిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకోకుండా ప్రభుత్వం ఫీజుల్ని పెంచేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడ, గుంటూరు, విశాఖ, హైదరాబాద్‌లలో 1976లో పట్టణ భూ గరిష్ఠ పరిమితి చట్టం అమల్లోకి వచ్చింది. ఒక కుటుంబానికి నిర్దేశిత నివాస స్థలం మాత్రమే ఉండాలన్న ప్రధాన షరతుతో ఈ చట్టాన్ని అమల్లోకి తెచ్చారు. ఈ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవడంతో కొంత భూమి ప్రభుత్వ పరిధిలోకి వెళ్లింది. ఈ క్రమంలోనే పలువురు న్యాయస్థానాలు/రెవెన్యూ ట్రైబ్యునళ్లను ఆశ్రయించడం ద్వారా ప్రభుత్వ చర్యలను తాత్కాలికంగా అడ్డుకున్నారు. ఈ భూములు రిజిస్ట్రేషన్ల రూపంలో చేతులు మారుతూ వచ్చాయి. ఈ వివాదాస్పద భూములను నిషిద్ధ భూముల జాబితా 22(1)(డి)లోకి చేర్చారు. దీనిపై సరైన సమాచారం లేకపోవడం, సబ్‌-రిజిస్ట్రార్‌ కార్యాలయాల నుంచి అభ్యంతరాలు వ్యక్తం కాకపోవడంతో యథావిధిగా క్రయ, విక్రయాలు జరుగుతూ వస్తున్నాయి. ఇలాంటి భూములకు ఫీజులు కట్టి దరఖాస్తు చేసుకుంటే క్రమబద్ధీకరిస్తూ నిషిద్ధ జాబితా నుంచి తప్పిస్తున్నారు.

3 నగరాల్లో కలిపి 2,505 ఎకరాలు

విశాఖ, గుంటూరు, విజయవాడ నగరాల్లో కలిపి సుమారు 2,505 ఎకరాల మిగులు భూములు సుమారు 8 వేల మంది వద్ద ఉన్నాయి. కిందటేడు స్థల విస్తీర్ణంతో సంబంధం లేకుండా క్రమబద్ధీకరణకు మూల విలువలో ఒకటిన్నర రెట్లు ఫీజు చెల్లించాలని ప్రభుత్వం మెలికపెట్టింది. దీని ప్రకారం కోటి నుంచి మూడు కోట్ల రూపాయల వరకు చెల్లించాలని నోటీసులు రావడంతో యజమానులు మండిపడ్డారు. స్థానికుల నుంచి రోజురోజుకూ వ్యతిరేకత పెరుగుతుండటంతో 150 చదరపు గజాల వరకు ఉచితంగా, 150-300 చ.గజాల వరకు బేసిక్‌ విలువలో 15%, 300 నుంచి 500 చ.గజాల వరకు 100% ఫీజు చెల్లిస్తే క్రమబద్ధీకరిస్తామని ప్రభుత్వం గత ఫిబ్రవరిలో జారీచేసిన ఉత్తర్వులు సవరించింది. తర్వాత మూడు నగరాల్లో కలిపి ఇప్పటివరకు 365 దరఖాస్తులే క్రమబద్ధీకరణ కోసం వచ్చాయి. క్రమబద్ధీకరణకు ఫీజు చెల్లించి సమర్పించిన దరఖాస్తులు 58 మాత్రమే.  


యజమానుల తీవ్ర అభ్యంతరం

రిజిస్ట్రేషన్‌లు జరిగిన భూముల్ని క్రమబద్ధీకరించి... యాజమాన్య పట్టాలు కాకుండా  ప్రభుత్వ భూమిగా పరిగణిస్తూ డి(దరఖాస్తు) పట్టా ఇస్తామని సర్కారు పేర్కొనడం వివాదాస్పదమైంది. ప్రభుత్వ భూమిని పొందిన వారికి డి పట్టా ఇస్తున్నారు. చేతులు మారుతూ... స్టాంపు డ్యూటీలు కడుతూ వచ్చిన ఈ భూముల్లో ఇళ్లు/భవనాలు వెలిశాయి. యజమానుల పేర్లతో విద్యుత్తు, నీటి కనెక్షన్లు ఉన్నాయి. ఇంటి పన్నునూ చెల్లిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో డి పట్టా ఇచ్చి... పదేళ్ల తర్వాతే యాజమాన్య బదలాయింపు హక్కు కల్పిస్తామని పేర్కొనడంపై యజమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని